Gaddar Gummadi Vittal Rao.. గద్దరన్న అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.! గద్దర్ అనగానే, ప్రజా యుద్ధ నౌక.. అన్న పేరు గుర్తుకొస్తుంటుంది.!
ప్రజా గాయకుడు గద్దర్, అనారోగ్యంతో కన్నుమూశారు. హృదయ సంబంధ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన గద్దర్, అనారోగ్య సమస్య నుంచి కోలుకుంటాననే ధీమా వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన అభిమానుల్ని ఉద్దేశించి ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఇంతలోనే హఠాన్మరణం చెందారాయన.
హృదయ సంబంధిత సమస్యతోపాటు, లంగ్స్ అలాగే, యూరినరీ సమస్యలు.. దానికి తోడు వృద్ధాప్యం.. వెరసి, గద్దర్ తుదిశ్వాస విడిచారు.!
ప్రజా యుద్ధ నౌక గద్దర్..
గద్దర్ (Gaddar Telangana) అంటే పాట. గద్దర్ అంటే ఆట.! గద్దర్ అనగానే, నెరిసిన జుట్టు.. ఆపై గడ్డం.. చేతిలో ఓ కర్ర.!
వేదికపైకెక్కి గద్దర్ పాట అందుకుంటే, ఆ పాటకు గొంతు కలపాలనిపిస్తుంటుంది. ఉద్యమ సెగల్లోకి దూకాలనిపిస్తుంది.. ఆ ఉద్యమాన్ని మరింత వేడెక్కించాలనిపిస్తుంటుంది.
దురదృష్టమేంటంటే, ప్రజల కోసం బతికిన మనుషుల్ని.. ప్రజలు, నాయకుల్లా చూడరు. గద్దర్ విషయంలో కూడా అదే జరిగింది.

నేరాలు చేసి జైలుకెళ్ళినోళ్ళూ నాయకులవుతారు.. పదవులు పొందుతారు.. అధికార పీఠాలెక్కుతారు.
గద్దర్ లాంటోళ్ళు మాత్రం, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి మాత్రమే పనికొస్తారు. ఆ ప్రజల్లోంచి నాయకులుగా మారడానికి పనికిరారు.!
Gaddar Gummadi Vittal Rao.. తెలంగాణ ఉద్యమంలో..
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ (Gaddar Telangana) పాటకి ప్రత్యేక స్థానం వుంది. కానీ, తెలంగాణ రాజకీయాల్లో గద్దర్ రాణించలేకపోయారు.
ఏదిఏమైనా, ఉద్యమ పాట ఎక్కడ వినిపించినా.. అక్కడ గద్దర్ గుర్తుకొస్తారు. అదీ గద్దర్.. ఉద్యమంపై వేసిన ముద్ర.
Also Read: ప్చ్.! ట్విట్టర్ పిట్ట ఎగిరిపోయిందే.!
ఒకప్పుడు ఆయన మీద హత్యాయత్నం జరిగింది. ఆనాటి ఆ ఘటనకు గురుతుగా, ఓ బుల్లెట్ ఆయన శరీరంలోనే వుండిపోయింది.
గద్దరన్న లేని లోటు పూడ్చలేనిది.! ఔను, ఉద్యమ పాట మూగబోయింది.! ప్రజా యుద్ధ నౌక శాశ్వత నిద్రలోకి జారుకుంది.
పోయినోళ్ళంతా మంచోళ్ళే.. రాజకీయంగా గద్దర్‌ని తొక్కేసినోళ్ళంతా ఇప్పుడు గద్దరన్న గొప్పతనం గురించి గొప్ప గొప్పగా మాట్లాడేస్తుండడం ఆశ్చర్యకరం.!