మన బంధువుల్లో లేదంటే తెలిసినవాళ్ళలో ఎవరికైనా కవలలు పుడితే, అదొక వింత. ఒకే కాన్పులో ముగ్గరు పిల్లలు పుడితే అది అద్భుతమే. నలుగురు పుడితే, దాన్నొక మహాద్భుతంగా అభివర్ణిస్తాం. అలాంటిది, ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు ఓ మహిళ (Halima Cisse Gives Birth To Nonuplets) జన్మనిస్తే.. దాన్నేమనాలి.?
ఆ మహిళ పేరు హలిమా సిస్సీ. ఆమె వయసు 25 ఏళ్ళు. గర్భం దాల్చిన హలీమా వైద్య పరీక్షల నిమిత్తం వెళితే, ఆమెకు ఏడుగురు పిల్లలు ఒకే కాన్పులో జన్మించే అవకాశం వుందని వైద్యులు తెలిపారు. చిత్రమేంటంటే, ఏడుగురు కాదు.. ఏకంగా తొమ్మిదిమంది ఒకే కాన్పులో జన్మించారామెకి.
ఏడుగురు పిల్లలు పుట్టే అవకాశముందని స్కానింగ్ రిపోర్ట్ ద్వారా వెల్లడి కావడంతో, వైద్యులు ఆమెను అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో వున్న ఆసుపత్రికి వెళ్ళాల్సిందిగా సూచించారు. గర్భం దాల్చినప్పటినుంచి, కాన్పు వరకూ ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే వుంది.
సాధారణ ప్రసవం అయ్యేందుకు అవకాశాలు తక్కువగా వుండడంతో, వైద్యులు ఆమెకు సిజేరియన్ శస్త్ర చికిత్స చేశారు. మొత్తం 9 మంది పిల్లల్ని బయటకు తీశారు. అదేంటీ, స్కానింగ్ రిపోర్టులో ఏడుగురు కనిపిస్తే, 9 మంది పిల్లలు పుట్టడమేంటి.? అంటే, స్కానింగ్ రిపోర్టులో ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారట. అదీ అసలు సంగతి.
గతంలో కూడా ఓ మహిళ ఇలాగే 9 మంది పిల్లలకు జన్మనిచ్చినా అందులో ఎవరూ బతకలేదు. హలీమా మాత్రం అదృష్టవంతురాలు. పిల్లలంతా క్షేమంగానే వున్నారు. మొత్తం ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఒకే కాన్పులో జన్మించారామెకి.
ఒకే కాన్పులో పుట్టిన తొమ్మిది మంది పిల్లల్ని చూసుకుని హలీమా సిస్సీ మురిసిపోతోంది. అందరూ ఆరోగ్యంగా వుడడంతో ఆ తల్లి (Halima Cisse Gives Birth To Nonuplets) ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది.