దీపావళి అంటే, దీపాల పండుగ (Happy Deepavali). ప్రతి యేడాదీ దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటూనే వస్తున్నాం. టపాసుల హోరెత్తించేస్తున్నాం.. స్వీట్స్‌తో పండగ చేసుకుంటున్నాం. కానీ, ఈసారి చాలా చాలా ప్రత్యేకమైన దీపావళి. ఇది కరోనా సమయంలో వచ్చిన దీపావళి (Happy Diwali).
కరోనా, ప్రపంచానికి కొత్త హెచ్చరిక చేసింది. పరిశుభ్రంగా వుండమని చెబుతోంది కరోనా వైరస్. మనిషికీ మనిషికీ మధ్య దూరం తప్పదంటోంది. కరచాలనం వద్దు, నమస్కారం ముద్దు.. అని ప్రపంచానికి చాటి చెప్పింది. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలని హెచ్చరించింది.
కరోనా నేపథ్యంలో ప్రపంచం చాలా మారింది. ఇంకా ఇంకా మారాల్సిన అవసరం వుంది. అందరికీ తెలిసిన విషయమే, కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మహా నగరాల్లో కాలుష్యం తగ్గింది. లాక్‌డౌన్ తర్వాత అన్‌లాక్ ఎప్పుడైతే మొదలయ్యిందో.. మళ్ళీ కాలుష్యం మామూలే అయిపోయింది.
రేపటి తరం కోసమే ఈ తరం కష్టపడుతోందని పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్నారు. అది నిజం కూడా. మనం ఎంత కష్టపడినా, మన పిల్లల కోసమే కదా.! కానీ, పర్యావరణం పరంగా మనం మన భవిష్యత్ తరాలకు ఏమిస్తున్నాం.? క్రమక్రమంగా మనం మన వారసులకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం.
ఒక్కరోజు టపాసులు కాల్చితే కాలుష్యం పెరిగిపోతుందా.? అంటే, ఖచ్చితంగా పెరిగిపోతుంది.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. టపాసుల మోత ఒక్కటే కాదు, వాహనాల మోత ఎక్కువైనా కాలుష్యమే.
కరోనా నుంచి కోలుకున్నవారికి ఈ కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతుంది గనుక, ఈసారికి టపాసుల మోత తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. న్యాయస్థానాలు తీర్పులు ఇస్తున్నాయి. అందుకే, గతానికి భిన్నంగా ఈసారి వెలుగుల దీపావళిని కేవలం వెలుగులకే పరిమితం చేయడానికి ప్రయత్నిద్దాం.
కరోనా చీకట్లు పూర్తిగా తొలగిపోలేదు.. దీపావళి వెలుగులతో, కరోనా చీకట్ల నుంచి విముక్తి లభించాలని ఆశిద్దాం. చెట్టుని బతకనిద్దాం.. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకూ నడుం బిగిద్దాం.
పర్యావరణ పరిరక్షణ అనేది ఓ ఉద్యమంలా.. ప్రతి ఒక్కరి బాధ్యతలా మారినప్పుడే.. మనం మన వారసులకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగినట్లు.! అందరికీ దీపావళి (Happy Diwali) శుభాకాంక్షలు.