Table of Contents
Hello Meera Mudra369 Review.. సినిమా అంటే ఎలా వుండాలి.? ఆరు పాటలు, మూడో నాలుగో ఫైట్లు.! కాస్తంత కామెడీ.. హీరోయిజంతో కూడిన డైలాగులు.. సెంటిమెంటు.. ఇవీ లెక్కలు.!
అన్ని సినిమాలకీ అలాగే వుండాలనే రూలేముంది.? అస్సలు పాటల్లేకుండా సినిమాలొస్తాయ్. ఫైట్లు అవసరం లేని సినిమాల్నీ చూశాం.!
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు.. హీరోయిన్ అవసరమే లేని సినిమాలు.. చెప్పుకుంటూ పోతే.. చాలానే.!
Hello Meera Mudra369 Review.. ఆమె మాత్రమే.!
‘హలో మీరా’ పేరుతో ఓ సినిమా వచ్చింది. అందులో ప్రధాన పాత్రధారి గార్గేయి యెల్లాప్రగడ (Gargeyi). పెద్దగా పేరున్న నటి కాదు.
‘ఎవరికీ చెప్పొద్దు’ పేరుతో తెరకెక్కిన సినిమాలో నటించింది గార్గేయి (Gargeyi Yellapragada). చాలా క్యూట్‌గా వుంటుంది ఆ సినిమాలో ఈ భామ.
‘హలో మీరా’ సినిమాలో ఇంకాస్త క్యూట్‌గా కనిపించింది. బాగానే నటించింది. కాదు కాదు, బాగా నటించి మెప్పించింది కూడా.!
బోర్ కొట్టినాగానీ..
సినిమా కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. కానీ, తర్వాత ఏం జరగబోతోంది.? అన్న ఆసక్తి అయితే కలుగుతుంది. అదే ‘హలో మీరా’ ప్రత్యేకత.
అసలు సిసలు విషయమేంటంటే, ఈ సినిమాలో ఆమె మాత్రమే కనిపిస్తుంది. ఔను, సినిమాలో వేరే పాత్రలు వుంటాయ్.. అవేవీ కనిపించవు.. జస్ట్ వినిపిస్తాయి.

సినిమాలో మెజార్టీ పోర్షన్ కారులోనే చిత్రీకరించేశారు. అది ఈ సినిమాకి సంబంధించి మరో ప్రత్యేకత.
ఓ వైపు ఇంట్లో పెళ్ళి పనులు జరుగుతుంటాయ్.. ఇంతలోనే అనుకోని చిక్కు. పెళ్ళి పీటల మీద కూర్చోవాల్సిన హీరోయిన్, విజయవాడ నుంచి హైద్రాబాద్ పయనమవుతుంది.
ఓ సూసైడ్ కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా పేర్కొనబడుతుంది. దాన్నుంచి ఆమె ఎలా బయటపడింది.? అన్నది మిగతా కథ.
అందులో మనమూ వుంటాం..
కొన్నిసార్లు ఆ కారులో మనం కూడా వున్నట్లుంటుంది. ఆమె చుట్టూ మనం వున్నట్లుగా భావన కలుగుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ మనల్ని అలా తీసుకెళ్తాయ్.
కానీ, ఫోన్‌లో వినిపించే కొన్ని డైలాగులు.. ప్రత్యేకించి, హీరోయిన్ తమ్ముడి డైలాగులు.. సరిగ్గా సూట్ అవలేదు. అది తప్పితే, మిగతాదంతా ఓకే.!
సినిమా అంతా తానే అయి నటించడమంటే చిన్న విషయం కాదు. చాలా అనుభవం వున్న నటీమణులకే కష్టమైన విషయమది.
Also Read: రష్మికను చూస్తే రావణుడు పారిపోతాడా.?
ఈ విషయంలో గార్గేయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేయొచ్చు. చిన్నా చితకా మిస్టేక్స్ పరిగణనలోకి తీసుకోవడం ఇలాంటి సినిమాలకు సంబంధించి అనవసరం.

మంచి ప్రయత్నం.. ఖచ్చితంగా అభివర్ణించాల్సిందే. దర్శకుడి విజన్‌కి, సాంకేతిక విభాగాలు సహకరించిన తీరుని అభినందించకూడా వుండలేం.
థియేటర్‌కి వెళ్ళి చూడాలంటే కష్టమే.! ఓటీటీలోనే వుందిగా.. టైమ్ చూసుకుని, ఓ లుక్కేసెయ్యండి.. ఓ కొత్త అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది మీకు.!