Table of Contents
Home Medicines Equipment.. ఒకప్పుడు జ్వరం వస్తే, ఇంట్లోనే ప్రాథమిక చికిత్స జరిగేది. జలుబు చేసినా, తలనొప్పి వచ్చినా, పంటి నొప్పి వేధిస్తున్నా.. వంటింట్లోని పోపుల పెట్టె చాలావరకు ఆ సమస్యలకు పరిష్కారం చెప్పేది.
కానీ, ఇప్పుడు సీన్ మారింది. ప్రతి ఇల్లూ ఓ మినీ మెడికల్ షాప్‌లా తయారైపోవాల్సిందే. చిన్నదో పెద్దదో ఓ ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటూ ఇంట్లో వుండకపోతే కుదరడంలేదిప్పుడు.
చిన్న చిన్న గాయాలకు వాడే అయోడిన్ దగ్గర్నుంచి, శ్వాస సమస్యలు తలెత్తితే ఉపయోగించే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల వరకూ.. స్తోమతుకి మించి సమకూర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అంతకు ముందు.. ఆ తర్వాత.!
కోవిడ్ పాండమిక్‌కి ముందు, ఆ తర్వాత.. అని చెప్పుకోవాల్సి వస్తే, జరిగిన మార్పులు చాలానే వున్నాయ్. ‘మీ ఇంట్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వున్నాయా.? అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరమైతే ఏం చేస్తారు.?’ ఇలా స్నేహితులు మధ్య, బంధువుల మధ్య చర్చ జరుగుతున్న రోజులివి.
రక్తపోటు (హైపర్‌టెన్షన్), మదుమేహం (డయాబెటిస్) వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారింట్లో తప్పనిసరిగా బీపీ కొలిచే సాధనం అలాగే మధుమేహాన్ని ఎప్పటికప్పుడు పరీక్ష చేసేందుకు అవసరమైన కిట్స్ వుండడమనేది సర్వసాధారణమైపోయింది.

థర్మామీటర్ గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.? అదెప్పుడో ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా వుండాల్సిన వస్తువుగా మారింది. కొత్తగా లిస్టులోకి పల్స్ ఆక్సోమీటర్ వచ్చి చేరింది. ఇది కోవిడ్ తెచ్చిన మార్పు. వీటితోపాటుగా వేపరైజర్లు (ఆవిరి పట్టే పరికరాలు) కూడా ఎక్కువగా మార్కెట్లో అమ్ముడవుతున్నాయి.
అత్యవసరమేనా.? సమకూర్చుకోవాల్సిందేనా.?
ఎవరికి ఏది అవసరం.? అనవసరం.? అన్నది వైద్యులు చెబుతారు. కొన్ని సందర్భాల్లో ఆ వైద్యులే, ‘వీటిని ముందస్తుగా మీరు సమకూర్చుకోండి.. అత్యవసర సమయాల్లో పని చేస్తాయి..’ అని చెబుతున్నారు.
Also Read: జాతిపుష్పం: ఊ అంటావా మావా.. ఊహూ అంటావా.!
వైద్యులు చెబుతున్నారు కాబట్టి.. అన్న కోణంలో వాటిని సమకూర్చుకోవడమే కాదు, అవసరం వున్నా లేకపోయినా వాటిని వాడేస్తున్నారు, కొత్త సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు.
వంద రూపాయలతో దొరికే వస్తువు నుంచి లక్షన్నర ఆ పైన ఖర్చయ్యే మెడికల్ పరికరాల వరకు, ‘ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా’ సమకూర్చుకోవడం తప్పనిసరైపోతోంది. ఏమో, ముందు ముందు ఇంకెలాంటి పరిస్థితులు వస్తాయో.!
కిట్టు.. కనికట్టు.!
ప్రెగ్నెన్సీ నిర్ధారణ కిట్, కోవిడ్ నిర్ధారణ కిట్.. వారెవ్వా, మెడికల్ మాఫియా మార్కెటింగ్ స్ట్రేటజీ అదిరింది.! దురదృష్టం ప్రజారోగ్యమే సర్వనాశనమైపోతోంది. ఆర్థికంగా బతుకులు చితికిపోతున్నాయ్.!
ఇప్పటికైతే ఇలా.! ముందు ముందు ప్రతి ఇల్లూ ఓ మెడికల్ స్టోర్‌లా మారిపోవాల్సిందేనేమో.! ఎవరికి వారు సొంతంగా వైద్య పరీక్షలు, సాధారణ వైద్య చికిత్సలు చేసేసుకోవడమే కాదు, శస్త్ర చికిత్సలు కూడా చేసేసుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు.
Also Read: కోడి పందెం: గెలిచినా ఓడినా ప‘కోడి’నే.!
అన్నట్టు, అడపా దడపా వార్తల్లో వింటున్నాం చూస్తున్నాం కదా.. యూ ట్యూబ్ వీడియోలు చూసి, సర్జరీలు చేసేయడం గురించి. అవి వికటించి ప్రాణాలు పోతున్న వైనం గురించి తెలుసుకున్నప్పుడు ఒకింత బాధ కలగడం సహజం. కానీ, ఈ మెడికల్ మాఫియా నుంచి తప్పించుకోవడమెలా.? ఛాన్సే లేదు.
వైద్యుల సూచన మేరకు కొన్ని అత్యవసర మందుల్ని అందుబాటులో వుంచుకోవడం తప్పు కాదు. శరీర ఉష్ణోగ్రత కొలిచే పరికరాలు, బీపీ అలాగే డయాబెటిస్ విషయంలో తగిన కిట్స్ వుండొచ్చు. వాటికన్నా ముందు, అసలు మనం ఏమేం తినాలి.? ఏమేం తింటున్నాం.? ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం వుందా.? లేదా.? అన్నది చూసుకోవాలి. చూసుకుందామా ఇకనైనా.?