Jagan Sajjala Backstabs Vizag.. వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’ అనే గుర్తింపు తెచ్చుకున్నారు వైసీపీ ముఖ్య నేత, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
ఆ సజ్జల కారణంగానే వైసీపీ సర్వనాశనమైపోయిందంటూ, వైసీపీలో ఒకప్పుడు కీలక నేతగా వున్న విజయ సాయి రెడ్డి తదితరులు ఆరోపించడం, వైసీపీకి దూరమవడం తెలిసిన సంగతులే.
సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు సజ్జల భార్గవ రెడ్డీ.. ఇద్దరూ కలిసి వైసీపీని సర్వనాశనం చేశారన్నది వైసీపీ కార్యకర్తల్లో చాలామంది ఇప్పటికీ చెప్పేమాట.
వైసీపీ అధికారం కోల్పోయాక, సజ్జల భార్గవ రెడ్డి దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రం, ఇంకా వైసీపీ తరఫున తన వాయిస్ వినిపిస్తూనే వున్నారు.
కొన్నాళ్ళ క్రితం, రెండు ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు.. సజ్జల మెప్పుకోసం ‘జుట్లు పట్టుకుని కొట్టుకోవడం’, సంబంధిత వీడియోల్ని వాళ్ళే విడుదల చేయడం జరిగాయి.
Jagan Sajjala Backstabs Vizag.. విశాఖలో జగన్ కాపురం.. ఉత్త మాటే.?
అలాంటి సజ్జల రామకృష్ణా రెడ్డి, తాజాగా వైఎస్ జగన్ విశాఖ ‘కాపురం’ గురించి సంచలన కామెంట్స్ చేశారు. విశాఖలో కాదు, అమరావతిలోనే జగన్ వుంటారని సెలవిచ్చారు సజ్జల.
అదేంటీ, 2024 ఎన్నికల్లో గెలిచి.. విశాఖలోనే ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారు కదా.?
అమరావతి కాదు, విశాఖే పరిపాలన రాజధాని అని జగన్ అన్నారు కదా.? అని వైసీపీ శ్రేణులు విస్మయానికి గురయ్యాయి సజ్జల వ్యాఖ్యలతో.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓడాక, రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ మారిందా.? అంటే, మారిందని చెప్పాల్సింది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

కానీ, సజ్జల రామకృష్ణా రెడ్డి స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. అదీ, వైఎస్ జగన్ ఆలోచనలకు వ్యతిరేకంగా. వైసీపీ హయాంలో మూడు రాజధానుల అంశం తెరపైకొచ్చింది.
అమరావతిని శాసన రాజధాని అంటూనే, అమరావతి మీద అప్పటి వైసీపీ ప్రభుత్వం విషం చిమ్మింది. ఐదేళ్ళ వైసీపీ హయాంలో, రాజధాని అమరావతిలో ఒక్క నిర్మాణం కూడా ముందుకు కదల్లేదు.
పరిపాలన రాజధాని విశాఖ.. అని చెప్పిన వైసీపీ, రుషికొండలో వైఎస్ జగన్ నివాసం కోసం ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి పెద్ద ప్యాలెస్ కట్టిన సంగతి తెలిసిందే. అది వృధాగా పడి వుందిప్పుడు.
ఇక, న్యాయ రాజధాని కర్నూలు కోసం కూడా వైసీపీ చేసిందేమీ లేదు. మరిప్పుడు, అమరావతే రాజధాని.. అని సజ్జల సహా వైసీపీ నేతలు కొత్త పల్లవి ఎందుకు అందుకున్నట్లు.?
ఇంతకీ, సజ్జల అమరావతి భజనకి వైఎస్ జగన్ నుంచి ఆమోదం వుందా.? అదే నిజమైతే, విశాఖలో కాపురం పెట్టాలనుకున్న జగన్, తన ఆలోచనల్ని మార్చుకున్నారా.
ఉత్తరాంధ్రకి చెందిన బొత్స సత్యనారాయణ లాంటి వైసీపీ నేతలు, అమరావతిని స్మశానంగా, ఎడారిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.
రాయలసీమకి చెందిన వైసీపీ నేతలైతే, అత్యంత జుగుప్సారంగా అమరావతిపైనా, అమరావతికి చెందిన మహిళలపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని లాంటి వైసీపీ నేతలైతే, అసలు అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దంటూ చేసిన వ్యాఖ్యల్ని ఎలా మర్చిపోగలం.?