Kalvakuntla Kavitha CM Telangana.. ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతా.. 2014 నుంచి తెలంగాణలో జరిగిన కుంభకోణాలన్నీ వెలికి తీస్తా.. అంటూ, సీరియస్ పొలిటీషియన్ కవిత, సిల్లీ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
ఏమో, గుర్రం ఎగరావచ్చు.! అలానే, కవిత కూడా సీఎం అవ్వొచ్చేమో.! రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కానీ, ఎలా.? ఆ పరిస్థితి అసలు తెలంగాణలో వుందా.? లేదా.? ఆలోచించుకోవాలి కదా.?
పైగా, 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు తెలంగాణలో అధికారంలో వున్నది స్వయానా కవిత తండ్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావే.!
కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిగా మారిన సంగతి తెలిసిందే. మొన్నీమధ్యనే కవితని, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటేశారు.
అంతకన్నా ముందే, బీఆర్ఎస్ పార్టీకి కవిత ఎదురు తిరిగారు. కేసీయార్ మంచోడే, కానీ.. ఆయన వెనకాల వున్నవాళ్ళంతా దొంగోళ్ళేనన్నది కవిత ఆరోపణ.
మరీ ముఖ్యంగా కేసీయార్ మేనల్లుడు హరీష్ రావు మీద తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు కవిత. పనిలో పనిగా, కేటీయార్ మీద కూడా కవిత ఆరోపణలు చేయడం చూస్తున్నాం.
నడుస్తున్నది కుటుంబ పంచాయితీ.! ఏపీలో జగన్ ఇంట్లో జరుగుతున్న పంచాయితీ కూడా దాదాపు ఇదే. వైసీపీ నుంచి విజయమ్మ బయటకు వచ్చేశారు. షర్మిల కూడా బయటకు వచ్చేశారు.
అక్కడ జగన్, ఇక్కడ కేటీయార్.. అంతే తేడా.! జగన్‌కి షర్మిల నుంచి రాజకీయంగా తలనొప్పులు ఎదురవుతోంటే, కేటీయార్‌కి కవిత రూపంలో తలనొప్పులు రాజకీయంగా చూస్తున్నాం.
అక్కడా, ఇక్కడా ఆస్తుల పంచాయితీనేనా.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ మీద విజయమ్మ కోర్టుకు వెళ్ళారు, ఆస్తుల పంపకాల విషయంలో.
కేసీయార్ ఇప్పటిదాకా కవిత విషయమై బాహాటంగా ఎలాంటి రాజకీయ విమర్శలూ చేసింది లేదు.. ఆస్తుల పంచాయితీ గురించి కోర్టుకు వెళ్ళిందీ లేదు. ముందు ముందు అదీ చూస్తామేమో.!
గులాబీ పార్టీ హయాంలోనే కదా కవిత ఎంపీ అయ్యింది, ఎమ్మెల్సీగా పని చేసిందీ.! మరి, ఆమె కూడా అప్పటి అవినీతిలో భాగస్వామురాలై వుండాలి కదా.?
తెలంగాణలో గులాబీ పార్టీ దాదాపుగా గల్లంతయిపోయే పరిస్థితుల్లో వుంది. కలిసికట్టుగా పని చేసి, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చూడకుండా, ఈ లొల్లి ఏంటో కవితకే తెలియాలి.
ముఖ్యమంత్రి పదవిపై ఆశ పడటంలో వింతేమీ లేదు. రాజకీయమంటేనే అంత.! కానీ, కుర్చీ మీద కూర్చున్నాక గులాబీ పార్టీ అవినీతిని వెలికి తీస్తా.. అనడమే, కామెడీ.!
