Kodali Nani Boothu Rajakeeyam.. రాజకీయాల్లో బూతులు సర్వసాధారణమైపోయాయంటే, అందుక్కారణం ప్రధాన రాజకీయ పార్టీలు, అందులో కొందరు రాజకీయ నాయకులు.!
తెలుగు రాష్ట్రాల్లో.. అందునా, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో బూతులకు కేరాఫ్ అడ్రస్ అంటే, మాజీ మంత్రి కొడాలి నాని పేరే ముందుగా చెప్పాలి.!
నోటికొచ్చింది వాగడమే రాజకీయం అనుకుంటారాయన.! టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అంటే, కొడాలి నానికి అస్సలు ఇష్టం వుండదు.
రాజకీయాల్లో విమర్శలు తప్పు కాదు.! కానీ, బూతు రాజకీయాలు అత్యంత హేయం.! బూతులు మాట్లాడటంలో, కొడాలి నాని తర్వాతే ఎవరైనా.!
మహిళా పాత్రికేయులు ఆఫ్ ది రికార్డుగా కొడాలి నాని బూతుల వ్యవహారంపై తోటి పాత్రికేయుల వద్ద వాపోయిన సందర్భాలు కోకొల్లలు.!
కొడాలి నాని ప్రెస్ మీట్ పెడితే చాలు, బూతుల ప్రవాహమే అక్కడ.! అయితే, గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో, ప్రత్యక్ష రాజకీయాలకు కొడాలి నాని దూరంగా వున్నారు.
మొన్నామధ్య కొడాలి నానికి బైపాస్ సర్జరీ జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తిరిగి యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తానని కొడాలి నాని తాజాగా సెలవిచ్చారు.
అంతే, ‘బాబోయ్ బూతులు మళ్లీనా.?’ అన్న చర్చ మీడియా వర్గాల్లో జరుగుతోంది. ‘ఉద్యమాల్లో పాల్గొంటాను’ అని కొడాలి నాని తాజాగా వ్యాఖ్యానిస్తే, ‘బూతుల యుద్ధమే కదా..’ అని పాత్రికేయులు చర్చించుకుంటున్నారు.
నిజానికి, ఇంతలా మీడియా ప్రతినిథులు భయపడిపోవాల్సిన అవసరం లేదు. అలాంటి బూతు రాజకీయ నాయకుల్ని ‘బాయ్‌కాట్’ చేస్తే సరిపోతుంది.!
ఏదిఏమైనా, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడిప్పుడే కాస్త ప్రశాంతంగా మారుతున్నాయి. మంత్రుల ప్రెస్ మీట్లలో అభివృద్ధికి సంబంధించిన మాటలే వినిపిస్తున్నాయి.
ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ప్రెస్ మీట్లు పెట్టినా, బహిరంగ సభల్లో వాళ్ళు మాట్లాడినా బూతులు వుండటం లేదు. కొడాలి నాని రీ-ఎంట్రీ ఇస్తే, మళ్ళీ బూతుల రచ్చ షురూ అవుతుందన్నది నిర్వివాదాంశం.
2024 ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని దారుణ పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అతని బూతు రాజకీయమే, అతనికి రాజకీయంగా సమాధి కట్టేసింది.
