Lata Mangeshkar.. లతా మంగేష్కర్.. లతాజీ.. నైటేంగిల్ ఆఫ్ ఇండియా.. కోవిడ్ బారిన పడి, కోలుకున్నట్టే కోలుకుని.. అనూహ్యంగా మళ్ళీ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. దాదాపు నెల రోజులపాటు ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడారు.! ఈ పోరాటంలో అలసిపోయారు.!
పరిచయం అక్కర్లేని పేరది. భాషతో సంబంధం లేదు, ఆమె పాటలు అలాంటివి. ఏ భాషలో ఆమె పాడినా, ఆ పాట అందర్నీ అలరిస్తుంది. ఆమె ‘గొంతు’ తాలూకు ‘వయసు’ ఎప్పుడూ మారలేదు. అదే ఆమె ప్రత్యేకత.
కేవలం లతా మంగేష్కర్‌ని మాత్రమే ఎందుకు ‘లతాజీ’ అని పిలుస్తాం.? ఆమెకు అందరూ ఇచ్చే గౌరవం అలాంటిది మరి. కాదు కాదు, ఆమె తనకు దక్కిన అతి ప్రత్యేకమైన గౌరవాన్ని అలా నిలబెట్టుకున్నారనడం సబబేమో.!
Lata Mangeshkar.. మీడియా పైత్యం.. ఎందుకీ అత్యుత్సాహం.?
అయితే, లతా మంగేష్కర్ మరణం విషయమై మీడియా చూపించిన అత్యుత్సాహం మాత్రం అంతా ఇంతా కాదు. లతాజీ మరణాన్ని ముందే ఊహించారా.? అన్నట్టు, ఆమె ఇలా తుది శ్వాస విడిచారన్న వార్త బయటకు రాగానే, అలా ఆమె కథనాలు పుంఖాను పుంఖాలుగా పుట్టుకొచ్చాయి.
నిజమే, వాటిల్లో దాదాపు అన్నీ ముందే ఊహించుకున్నవే. గతంలో సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయంలోనూ ఇదే జరిగింది. నిజానికి, చాలామంది సినీ సెలబ్రిటీల విషయంలో ఇలాంటి పైత్యం మీడియా నుంచి ప్రముఖంగా కనిపిస్తుంటుంది.
Also Read: అహంకారమే దిగజారుడుతనమై.! నెట్టింట్లో ఎందుకీ పైత్యం.?
టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం ఆ మధ్య అనారోగ్యం బారిన పడితే, మీడియా సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఎమ్మెస్ నారాయణ విషయంలో జరిగింది మరీ దారుణం.
‘ఆయన ఇంకా బతికే వున్నారు.. దయచేసి, మీ గాలి వార్తలతో మమ్మల్ని చంపేయొద్దు ప్లీజ్..’ అని ఎమ్మెస్ నారాయణ కుటుంబ సభ్యులు మీడియాని వేడుకున్నారు.. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో వున్నప్పుడు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ గుండెపోటుకు గురైతే, ఆయన చనిపోయినట్లుగా మీడియాలో కథనాలొచ్చాయి. హాస్యనటులు ఏవీఎస్, మల్లికార్జునరావు (బట్టల పత్తి) విషయంలోనూ మీడియా పైత్యం వివాదాస్పదమైంది.
‘అందరికంటే ముందు మేమే..’ అని చెప్పుకోవడానికి, ఎలక్ట్రానిక్ మీడియా పడుతున్న పాట్లు ఇవి. ప్రింట్ మీడియా తక్కువేమీ తిన్లేదు. వెబ్ మీడియా సంగతి సరే సరి. అన్నట్టు, రాజకీయ నాయకుల విషయంలోనూ మీడియా ఈ తరహా అతి ప్రదర్శించడం సర్వసాధారణమైపోయింది.
గోతికాడి నక్క.. శవాన్ని పీక్కు తినే రాబందు.!
ఎందుకీ పైత్యం.? ఎందుకీ తొందరపాటు.? ‘గోతికాడి నక్క’, ‘శవాన్నీ పక్కు తినే రాబందు’.. ఇలా మీడియా అతిపై ఎన్ని పోలికలు చేసినా, అవి తక్కువే అవుతాయేమో. సెలబ్రిటీలెవరైనా చిన్నపాటి అనారోగ్యం బారినపడి, ఆసుపత్రికి వెళితే చాలు, మీడియా ముందే చంపేస్తోంది.
Also Read: అసలేంటీ ‘చింతామణి’ నాటకం.! ఎవరిది ఈ పాపం.?
‘పోన్లే, ఇలాగైనా నాకు దిష్టి తొలగిపోయింది..’ అని పలువురు ప్రముఖులు మీడియా ‘చావు డప్పు’పై సెటైర్లేసిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి.
ఆయా సెలబ్రిటీల కుటుంబ సభ్యులు మీడియా అతి ప్రవర్తన వల్ల, మీడియా కక్కుర్తి వల్ల ఎంత ఆవేదన చెందుతాయన్న కనీస ఇంగితం లేకపోతే ఎలా.? దీన్నసలు జర్నలిజం అనగలమా.?