Table of Contents
Lucky Bamboo Plant.. బ్యాంబూ ట్రీ.. లక్కీ బాంబూ, అచ్చ తెలుగులో పచ్చ బంగారం అని పిలుస్తుంటారు. ఇవే కాదు ఇంకా చాలానే పేర్లున్నాయనుకోండి.
ఇవన్నీ వెదురుకు ప్రత్యామ్యాయంగా వాడే పేర్లు మాత్రమే.
సరే పేరేదైతేనేం, వెదురు గురించి మనకు తెలియని ఎన్నో విషయాల్ని వెదురు దినోత్సవం సందర్భంగా ఈ రోజు తెలుసుకుందాం.

వెదురు లేదా బ్యాంబూ గురించి తెలియని వారుండరు. నయా ట్రెండ్‌లో వెదురు మొక్కను లక్కీ ప్లాంట్‌గా అభివర్ణిస్తున్నారు.
ఆ కారణంగానే ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఇంట్లోనూ వెదురు మొక్క అదేనండీ లక్కీ బ్యాంబూ అలంకరణ వస్తువుగా వుంటోంది.
Lucky Bamboo Plant.. వెదురు వారసత్వం సాంప్రదాయం..
అలంకరణ వస్తువుగానే ఈ జనరేషన్‌లో చాలా మందికి వెదురు మొక్క గురించి తెలుసేమో. కానీ, పాత కాలంలో వెదురు మొక్కను ఓ సాంప్రదాయ ఆచారంగా భావించేవారు.
గోదావరీ తీర ప్రాంతంలోని ఓ గిరిజన తెగ పహజంగా పెరిగే కొండ వెదురు మొక్కను ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు.
అంతేకాదు, వర్షాకాలంలో ఈ బ్యాంబూ మొక్కను కోయడం ఈ తెగ మహిళలు తమ సాంప్రదాయ ఆచారంగా భావిస్తారు.

ఈ సీజన్‌లో తమ ఇంటికి వచ్చే అతిధులకు ఈ వెదురు మొక్కతో చేసిన వంటకాల్ని మర్యాద పూర్వకంగా వండి వడ్డించి గర్వంగా ఫీలవుతారట.
మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ వెదురుతో చేసే వంటకాల తయారీ విధానాన్ని తమ వారసత్వంగా భావిస్తారట. ఇతరులకు ఆ వంట విధానం తెలియనివ్వరట. భలే బావుందిగా వెదురు వారసత్వం.
వెదురుతో ఇదే కాదండోయ్.. చాలా రకాల ఉపయోగాలున్నాయ్. వెదురు నుంచి వీచే గాలి ఆరోగ్యం. వెదురుతో చేసే వంటకాలు ఆరోగ్యం.

వెదురుతో చేసే అలంకరణ సామాగ్రి, వస్త్రాలు.. ఇలా అనేకం వున్నాయంటే నమ్ముతారా.?
కేవలం లక్కీ ప్లాంట్‌గానో లేక, ఇంట్లో గ్రీనరీ కోసం అలంకరణ వస్తువుగానో చూసే వెదురులో మనకు తెలియని ఇంకా ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయ్.
చిన్న పిల్లల డైపర్ల తయారీలో
ఓ చంటిబిడ్డ తల్లి ఆవేదనలోంచి పుట్టుకొచ్చిందే ఈ ఆలోచన. వెదురు గుజ్జుతో తయారు చేసిన శానిటరీ ప్యాడ్స్, చంటి పిల్లలకు వాడే డైపర్లు కూడా వున్నాయ్.
విదేశాల్లో వీటికి ఎక్కువ ప్రాచుర్యం వుండి. మన దేశంలోనూ వీటిపై అవగాహన ఇంకాస్త పెరగాల్సిన ఆవశ్యకత వుంది.
ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా వెదురుతో తయారు చేసిన వస్తువులు అందుబాటులో వున్నాయ్. వాటిపైనా అవగాహన కలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రకృతిని ప్రేమించే వాళ్లలో ఎంతో మంది వెదురులోని ప్రత్యేక గుణాల్ని గుర్తించి ప్రకృతి పరిరక్షణలో తమ వంతు పాత్ర చేపడుతున్నారు.
అలా వచ్చిన వినూత్న ఆలోచనలే వెదురుతో అనేక నూతన ఎకో ఉత్పత్తుల తయారీకి శ్రీకారం చుడుతున్నారు.
నగలు, అలంకరణ వస్తువుల తయారీ..
వెదురుతో తయారు చేసిన ఆభరణాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలాగే గృహోపకరణాలు, ఇతర అలంకరణ వస్తువుల తయారీలోనూ వెదురును విరివిగా వుపయోగిస్తున్నారు.
‘ఎకో వేరే’ పేరుతో ఆయా వెదురు వస్తువులు మార్కెట్‌లో అందుబాటులో వున్నాయ్.
ప్లాస్టిక్ మట్టిలో కలవడానికి కొన్నివందల వేల ఏళ్లు పడుతుంది. కానీ, ఈజీగా మట్టిలో కలిసిపోయే వెదురు మొక్కతో చేసే వస్తువులు అటు ప్రకృతికీ, ఇటు మానవాళికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

ఇంతేనా.! బ్యాంటూ టీ, బ్యాంబూ చికెన్.. ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే, బ్యాంబూ ఇటీవల కాలంలో అనేక రకాల వంటల్లో భాగమైపోయి, చాలానే ప్రత్యేకత సంతరించుకుంది.
అందుకే, బ్యాంబూని ‘ఆరోగ్య ఖజానా’గా అభివర్ణిస్తున్నారు.
అంతేకాదు, ‘పేదవాడి కలప’, ‘పచ్చ బంగారం’. ‘అదృష్టదాయిని’.. ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలవబడుతూ అనేక రకాలుగా ఉపాధి కల్పిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది వెదురు.
