Manohari Gold Tea పొద్దున్నేవేడి వేడిగా టీ గొంతులో దిగకపోతే చాలా మందికి రోజు గడవదు. అంతలా తేనీరు అలియాస్ టీ మనిషి జీవితంలో భాగమైపోయింది. అందరికీ టీ అలవాటు ఉంటుందని అనలేం కానీ, చాలా మందికి అదో అలవాటు. కొందరికి అది వ్యసనం కూడా.
చాలా తక్కువ ధరకే టీ దొరుకుతుంది మార్కెట్లో. దాంతో రోజూ నాలుగైదు టీలు తాగే సామాన్యులున్నారు. వీలైతే, పది, పదిహేనుసార్లు టీ గొంతులో పోసుకునేవాళ్లూ ఉన్నారు. కానీ, ఇక్కడ మనం చెప్పుకుంటున్న టీ ఖరీదెంతో తెలిస్తే, దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది.
Manohari Gold Tea అక్షరాలా లక్ష రూపాయలు..
ఆగండాగండి.. అక్షరాలా లక్ష రూపాయలు అనగానే టీ ఖరీదని అనుకునేరు. టీ పొడి ఖరీదిది. కిలో టీ పొడి ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు పలికింది. కాకపోతే ఒక్క రూపాయి తప్ప. అంతలా ఈ టీలో ఏముంటుందో కానీ, వేలంలో ఇంత ధర దక్కించుకున్న ఆ టీ పొడి బ్రాండ్ పేరు ‘మనోహరీ గోల్డ్’ (Manohari Gold).

అత్యంత నాణ్యమైన టీ పొడి అట ఇది. టీ పొడిలో ఎన్నిప్రత్యేకతలుంటే మాత్రం ఇంత ధర అవసరమా.? అంటే అవసరమేనేమో. వేరే ఏ ఇతర తేయాకుల్లోనూ లేని ప్రత్యేకతలతో ఈ టీ పొడిని రూపొందించడమే ఇంత ధరకు కారణమని మనోహరీ గోల్డ్ (Manohari Gold Tea Powder) ప్రతినిధులు చెబుతున్నారు.
మనోహరి.. ఆ రుచే వేరబ్బా..
ఈ మనోహరీ గోల్డ్ (Manohari Gold) టీ పొడిని సౌరవ్ ట్రేడర్స్ అనే సంస్థ కొనుగోలు చేసిందట. తేయాకు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అస్సాం. ఆ అస్సాంలోని గుహవటి (గౌహతి) టీ వేలం కేంద్రం నిర్వహించిన వేలంలో మనోహరీ గోల్డ్ టీ పొడికి ఇంత ధర లభించింది. విదేశాల్లో ఇలాంటి టీ పొడి బ్రాండ్లకు మంచి గిరాకీ వుంటుంది.
Also Read: Turmeric Health Benefits.. ‘పసుపు’తో అందం, ఆరోగ్యం.. ఇదిగో ఇలా.!
కాస్త పసుపు రంగు (గోల్డెన్ కలర్) లో ఈ టీ ఉంటుందట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని అంటున్నారు. ఆరోగ్యం సంగతి దేవుడెరుగు. ఈ టీ పొడితో తయారయ్యే టీ ధర సామాన్యుడికి మాత్రం గుండె గుభేల్‌మనిపిస్తుంది. అందుకే ఇది సామాన్యుల టీ పొడి కానే కాదు. బా..గా.. బలిసినోళ్ల టీ పొడి అన్నమాట.
ఛాయ్ ఛమక్కులే చూడరా బాయ్ అంటాడు మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాలో. గరమ్ ఛాయ్ గురించి ఘాటుగా హాటుగా పాటేసుకుంటుంది నటి ఛార్మి ఇంకో సినిమాలో. ఇక్కడ ఈ మనోహరీ రేటు ఛమక్కు, ఘాటు చురుక్కు. తాగితే ఎలాంటి అనుభూతినిస్తుందో కానీ, రేటు గురించి వింటుంటే, సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనిపించడం ఖాయం.
పేరులో ఉన్న గోల్డ్ ఛాయ్‌లో కూడా ఉంటుందా.? ఎందుకుండదూ.. దీని రుచీ బంగారమే మరి. బహుశా ఇలాంటి ప్రత్యేకతలున్న తేయాకు గురించేనేమో సినిమాల్లో పాటలు పుట్టుకొస్తుంటాయ్. అవకాశమొస్తే మాత్రం ఈ మనోహరీ గోల్డ్ టేస్ట్ చేయడానికి మాత్రం వెనుకాడద్దు సుమీ.