Home » మెగా పవర్‌: చిట్టిబాబే 2018 మొనగాడు

మెగా పవర్‌: చిట్టిబాబే 2018 మొనగాడు

by hellomudra
0 comments
Ram Charan Samantha Ruth Prabhu Rangasthalam

2018 సంవత్సరానికిగాను తెలుగు సినిమాకి ‘మొనగాడు’ అంటే, అది ‘చిట్టిబాబు’ మాత్రమే. కొడితే, బాక్సాఫీస్‌ రికార్డులు గల్లంతయిపోవాల్సిందేననేంత కసితో ‘రంగస్థలం’ (Rangasthalam Movie of The Year 2018) సినిమా చేసినట్టున్నాడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. 125 కోట్లకు పైగా షేర్, 200 కోట్లకు పైగా గ్రాస్.. ఇవన్నీ ఓ ఎత్తు.. అన్నివర్గాల ప్రేక్షకుల్నీ అలరించే ఓ మంచి సినిమాగా గుర్తింపు ఇంకో ఎత్తు.

ఏ సినిమాని ప్రశంసించేందుకు విమర్శకులు పోటీ పడ్తారో, ఏ సినిమా వసూళ్ళు ఓ ప్రభంజనంలా మారతాయో, ఏ సినిమాలో లోటు పాట్లు వెతికేందుకు ప్రయత్నించీ ప్రయత్నించీ ‘హేటర్స్‌’ విసుగు చెందుతారో.. అదే హిట్టు బొమ్మ. మామూలు హిట్టు బొమ్మ కాదు ‘రంగస్థలం’. సూపర్‌ హిట్‌ కా బాప్‌.! నిజానికి ‘రంగస్థలం’ (Rangasthalam Movie of The Year 2018) సినిమాపై విడుదలకు ముందు చాలా చాలా నెగెటివ్‌ రూమర్స్‌ ప్రచారంలోకి వచ్చాయి.

‘సినిమా ఆపేయడమే మంచిది’ అని రామ్‌చరణ్‌కి, మెగాస్టార్‌ చిరంజీవి సూచించారంటూ గుసగుసలు విన్పించాయి. సరిగ్గా సినిమా రిలీజ్‌కి ముందు కూడా, ‘అస్సలేమీ బాగాలేదు, చాలా రీ-షూట్స్‌ చెయ్యాలి..’ అంటూ చరణ్‌ కూడా అసహనం వ్యక్తం చేశాడని గాలి వార్తలు షికారు చేశాయి. కానీ, అవన్నీ సినిమా విడదలయ్యేవరకే.!

కసిగా కొట్టాడు, కసి తీరా కొట్టాడు.!

హేటర్స్‌ ఎప్పుడూ హేట్‌ చేస్తూనే వుంటారు. ‘సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌ హీరో’ అనే అర్థం పర్థం లేని విమర్శతో ‘రంగస్థలం’ రిలీజ్‌కి ముందు హేటర్స్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ, వాళ్ళందరి నోళ్ళూ మూయించేశాడు. ‘నటించడమంటే ఎలాగో తెలుసా.?’ అని హేటర్స్‌ అందరికీ క్లాస్‌ తీసుకున్నట్టు చరణ్‌, ‘రంగస్థలం’ సినిమాలో ‘చిట్టిబాబు’గా జీవించి చూపించాడు.

మెగా పవర్‌ స్టార్‌ ఇమేజ్‌ పెట్టుకుని, చెవిటి చిట్టిబాబు పాత్రకి చరణ్‌ ఓకే చెయ్యడమే ఓ పెద్ద సాహసం. ఆ పాత్ర ఎంచుకుని, అందులో జీవించేందుకు చరణ్‌ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆ శారీరక లోపం, కథాగమనానికి ఎక్కడా అడ్డు రాలేదు. పైగా, ఆ లోపానికే అందం తీసుకొచ్చింది ‘చిట్టిబాబు’ పాత్ర. వందకి వంద కంటే ఎక్కువ మార్కులు వేయగలిగతే, అది చిట్టిబాబు పాత్రకు ఖచ్చితంగా వేసి తీరాలి.

సుకుమార్‌ విజన్‌.. నభూతో నభవిష్యతి (Rangasthalam Movie of The Year 2018)

మెగా ఛాన్స్‌ కొట్టేసిన సుకుమార్‌, చరణ్‌తో (Mega Power Star Ram Charan Tej) ఓ కంప్లీట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తాడనుకుంటే.. తీసుకెళ్ళి చరణ్‌ని పల్లెటూళ్ళలో పడేశాడు. అక్కడి వాతావరణ పరిస్థితులు తట్టుకోవడం ఎవరికీ సాధ్యపడలేదు. హీరోయిన్‌, సినిమాటోగ్రాఫర్‌.. ఇతర యూనిట్‌ సభ్యులు.. అందరూ గోదావరి తీరాన, మారుమూల పల్లెటూళ్ళలో పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్టమంతా, ఓ గొప్ప సినిమాని తెలుగు సినీ పరిశ్రమకు అందించేందుకేనని సినిమా విడుదలయ్యాక అంతా ఒప్పుకున్నారు.

‘రంగస్థలం’ సినిమాతో మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమలోని దర్శకుల ఆలోచనలు మారిపోయాయ్‌.. అని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) వ్యాఖ్యానించాడంటే, సుకుమార్‌ ‘రంగస్థలం’ సినిమాని ఏ విజన్‌తో తీశాడో అర్థం చేసుకోవచ్చు. ఓ మాంఛి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని తీసే అవకాశం వున్నా, ఓ మంచి చిత్రాన్ని తీసేందుకే మొగ్గు చూపిన సుకుమార్‌, ఈ క్రమంలో కమర్షియల్‌ విజయాన్నీ అందించడం అభినందించదగ్గ విషయం.

దేవిశ్రీ మ్యూజిక్‌.. సమంత మ్యాజిక్‌

హీరో సౌండ్‌ ఇంజనీర్‌.. అతనికి మాత్రమే వినికిడి లోపం. టెక్నికల్‌గా సౌండింగ్‌ ఎక్కడా తగ్గలేదు. సినిమాటోగ్రఫీ దగ్గర్నుంచి, మ్యూజిక్‌ వరకు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ నుంచి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వరకూ ‘టాప్‌ క్లాస్‌’ పని తీరు ప్రదర్శించాయి. పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లో రాక్‌ స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ (Rock Star Devi Sri Prasad) అదరగొట్టేశాడు. ఆ మ్యూజిక్‌లో నేటివిటీ అద్భుతః అంతే. సినిమాటోగ్రఫీ అయినా, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అయినా ఈ సినిమా రేంజ్‌ని పెంచేశాయి.

హీరోయిన్‌ సమంత (Samantha Ruth Prabhu), అంతకుముందెన్నడూ చేయని పాత్రలో ఒదిగిపోయింది. సమంతలో (Samantha Akkineni) ఈ యాంగిల్‌ కూడా వుందా? అని ఆశ్చర్యపోయారంతా. ‘రంగమ్మత్త’ (Rangammatha Rangammatta) పాత్రలో అనసూయ (Anasuya Bharadwaj) నటనను ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుందేమో.

‘జిగేల్‌ రాణి’ (Jigelu Rani) పాటలో పూజా హెగ్దే (Pooja Hegde) తళుకులు ఎప్పటికీ మర్చిపోలేం. అన్నట్టు, ఆది పినిశెట్టి కెరీర్‌ బెస్ట్‌ రోల్‌ ‘కుమార్‌బాబు’. చిట్టిబాబుకి, కుమార్‌బాబు సపోర్ట్‌ లేకపోతే.. అన్న మాటే ఊహించుకోలేం. జగపతిబాబు కావొచ్చు, ప్రకాష్‌ రాజ్‌ కావొచ్చు.. కమెడియన్‌ మహేష్‌ పాత్ర కావొచ్చు.. ఏదీ తక్కువ కాదు.

మైత్రీ మేకింగ్‌ వాల్యూస్‌..

పల్లెటూరి నేపథ్యంలో సినిమాకి, భారీగా ఖర్చు చేసిన మైత్రీ మూవీ మేకర్స్‌.. తన బ్యానర్‌ వాల్యూని పెంచుకునే చిత్రాన్ని ‘రంగస్థలం’తో (Rangasthalam Movie of The Year 2018) టాలీవుడ్‌కి అందించింది. అలా టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ ప్రతిష్టాత్మక సంస్థగా తన స్థాయిని పెంచుకోవడమే కాదు, విలక్షణ చిత్రాల పట్ల తన ప్యాషన్‌నీ చాటుకున్నట్లయ్యింది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group