Table of Contents
Mirai Review One.. తేజ సజ్జ, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మిరాయ్’.! రితిక నాయక్ హీరోయిన్. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు.!
తేజ సజ్జాని ‘సూపర్ యోధా’గా చూపించాడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రంలో. అసలు ‘మిరాయ్’ అంటే ఏంటి.? సినిమాలో మంచు మనోజ్ పోషించిన పాత్ర ఏంటి.? ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
అశోకుడు కలింగ యుద్ధంలో విజయం సాధించాక, ‘ఇంతమంది చావుకి కారణమయ్యాను’ అంటూ పశ్చాత్తాపంతో, తనలోని దైవ శక్తిని, తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేస్తాడు.
ఆ గ్రంథాల్ని కాపాడాల్సిందిగా, తొమ్మిది మందికి ‘ఆజ్ఞా’పిస్తాడు అశోకుడు. తరాలుగా వాటిని, ఆయా వ్యక్తులు.. వారి వారసులు సంరక్షిస్తుంటారు.

కానీ, ఆ గ్రంథాల్ని స్వాధీనం చేసుకుని, వాటిలోని శక్తిని తాను పొందాలనుకుంటాడు మహా వీర్ (మంచు మనోజ్). దీన్ని ఆపే బాధ్యతని అంబిక (శ్రియ), తన బిడ్డకి గర్భంలో వున్నప్పుడే అప్పగిస్తుంది.
ఆ బిడ్డ పేరు వేద (తేజ సజ్జా) అనాధగా పెరుగుతాడు. అతనికి కర్తవ్యాన్ని బోధించేందుకు హిమాలయాల నుంచి వస్తుంది విభ. మరి, మహా వీర్ని వేద అడ్డుకోగలిగాడా.? అన్నది తెరపై చూడాల్సిందే.
Mirai Review One.. మంచు మనోజ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్..
నటీనటుల గురించి చెప్పుకోవాలంటే, ముందుగా మనోజ్ గురించి మాట్లాడుకోవాలి. మంచు మనోజ్‌కి ఇదొక డిఫరెంట్ రోల్. తెరపై అతను నిజంగానే ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాడు.
‘మిరాయ్’ కంటే ముందు ‘భైరవం’ సినిమాలో విలనిజం పండించినా.. ‘మిరాయ్’లో సెటిల్డ్ పెర్ఫామెన్స్ ప్రదర్శించాడు మంచు మనోజ్.

ఇక, హీరో తేజ సజ్జా.. సరదాగా తిరిగే బాధ్యతగలిగిన ‘అల్లరి, చిల్లర’ దొంగలా కనిపించాడు. చాలా జోష్ చూపించాడు ఆ పాత్రలో.
కానీ, యాక్షన్ బ్లాక్స్ చేసేటప్పుడు, ఇంకా ‘చిన్నపిల్లాడే’ అనిపించాడు. ఓ సీన్లో తేజ, సిక్స్ ప్యాక్ చూపిస్తాడేమో అనుకుంటాంగానీ, ప్చ్.. అలా చేయలేదు.

ఇలాంటి సినిమాల్ని భుజాన మోసే క్రమంలో ఏదో దైవ శక్తి, తేజ సజ్జాకి అండగా వుంటోందేమో అనిపిస్తుంటుంది. ఈ విషయంలో తేజ సజ్జా అదృష్టవంతుడు.
కేవలం, అదృష్టమే కాదు, కథల ఎంపికలో జాగ్రత్తలు.. సినిమా కోసం తేజ పడే కష్టం.. అన్నీ తెరపై కనిపిస్తున్నాయి.
బొమ్మలా వుందిగానీ..
హీరోయిన్ అనలేంగానీ, కథలో కీలక పాత్ర పోషించింది రితిక నాయక్. నిజానికి, మంచి నటి. కానీ, లిమిటెడ్ ఎక్స్‌ప్రెషన్స్‌కే పరిమితమయ్యింది ఆమె నటన.
రితిక నాయక్‌కి దర్శకుడు ఇచ్చిన పాత్ర అలాంటిది. ‘ఏఐ’ బొమ్మలా అనిపిస్తుంటుంది కొన్ని సీన్స్‌లో. చూడముచ్చటైన అందాల బొమ్మ రితిక నాయక్.

ఈ ‘మిరాయ్’లో మరో ఇంట్రెస్టింగ్ రోల్ శ్రియ శరణ్ది. ఆమె తన పాత్రలో ఒదిగిపోయింది. జగపతిబాబు, గెటప్ శ్రీను.. తదితరులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
టెక్నికల్‌గా మాట్లాడుకోవాల్సి వస్తే, లిమిటెడ్ బడ్జెట్ అయినాగానీ.. వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ‘సంపతి’ ఎపిసోడ్లో వీఎఫ్ఎక్స్.. గుర్తుండిపోతాయి.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి అదనపు ఆకర్షణ. కొన్ని సాధారణ సన్నివేశాల్ని కూడా సంగీత దర్శకుడు గౌర హరి, తన మ్యాజిక్కుతో వేరే లెవల్‌కి తీసుకెళ్ళాడు.
సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కదా.. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, తాను అనుకున్న కథకి సరైన సినిమాటోగ్రఫీని సమకూర్చుకున్నాడు.
ఎడిటింగ్ పరంగానూ ఎక్కడా వంకలు పెట్టడానికేం లేదు. కాకపోతే, కొన్ని సన్నివేశాలకు నిడివి తగ్గినా, కథాగమనానికి ఏమీ అడ్డం వుండదు. పైగా, సినిమా మరింత క్రిస్పీగా వుండేది.
అసభ్యతకు తావు లేకుండా..
అసభ్యతకు తావు లేకుండా, పక్కదారి పట్టకుండా.. సినిమాని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన విధానాన్ని అభినందించి తీరాలి.
నిర్మాణపు విలువలు చాలా బావున్నాయి. సినిమాకి అవసరమైనంత ఖర్చు చేశారు నిర్మాతలు.
ముందుగా తీసిన రెండు సాంగ్స్, సినిమాలో పెట్టలేదు.. కథాగమనానికి అడ్డం వస్తాయని. ఈ విషయంలో దర్శక నిర్మాతల్ని అభినందించి తీరాలి.
అయితే, ఆ పాటలు సినిమా విడుదల తర్వాత జత చేసి వుంటే, రిపీట్ ఆడియన్స్ ఇంకా పెరిగేవారేమో.! ‘వైబున్నది’ పాట ఆడియో సింగిల్ రూపంలో ముందే విడుదల చేశారు.
Also Read: న్యూక్లియర్ సైంటిస్టు.. మూఢ నమ్మకాలూ.!
నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్ మాత్రం దాచి పెట్టారు. అది ఇంకో భాగంలో వస్తుందట. ఓవరాల్‌గా చూస్తే, ఫ్యామిలీ ఆడియన్స్‌తో కలిసి చూడాల్సిన సినిమానే ఇది.
లాజిక్కులు వెతక్కూడదు ఇలాంటి సినిమాలకి.!
గమనిక: ఇదంతా, సినిమాకి పాజిటివ్ సైడ్ మాత్రమే.! కేవలం సినిమాగా చూస్తే, ‘మిరాయ్’కి వంక పెట్టలేం.!
కానీ, ‘మిరాయ్’ అంటే, ఆయుధం.. దాని ప్రత్యేకతల దృష్ట్యా.. ఈ సినిమాకి ఇంకో రివ్యూ కూడా రాబోతోంది. అది కొంచెం ఘాటుగా వుండబోతోంది. జస్ట్ వెయిట్ అండ సీ.!
– yeSBee
