Monalisa Maha Kumbh Mela.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. దేశం నలు మూలల నుంచీ పెద్ద సంఖ్యలో హిందువులు, కుంభ మేళాకి తరలి వెళుతున్నారు. జరుగుతున్నది మహా కుంభమేళా.!
లక్షలాది మంది కాదు, కోట్లాది మంది హిందవులు కుంభమేళాకు పోటెత్తుతున్నారు. దాదాపు 45 రోజుల పాటు సాగే కుంభమేళా, దేశ చరిత్రలోనే చాలా చాలా ప్రత్యేకమైనదని పండితులు చెబుతున్న సంగతి తెలిసిందే.
అంతే కాదు, 144 ఏళ్ళకోసారి జరిగే అద్భుతమని.. మహా కుంభ మేళా గురించి అంతా చెప్పుకుంటున్నాం. ప్రభుత్వాల పరంగా ఏర్పాట్లు కనీ వినీ ఎరుగని స్థాయిలో చేశారు.
మహా కుంభమేళా అద్భుతాల గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్న తరుణంలో, సోషల్ మీడియాలో ఓ యువతి ఈ కుంభమేళా కారణంగా ట్రెండింగ్ అవుతోంది.
ఆ యువతి పేరు మోనా భోంస్లే అట.. మోనాలిసా భోంస్లే.. అని కూడా పిలుస్తున్నారు. ఓ స్టార్ హీరోయిన్‌కి లభించేంత పబ్లిసిటీ ఈ మోనాలిసాకి దక్కుతోంది.
యూ ట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు.. ఈమె కోసమే మహా కుంభ మేళాకి పరుగులు తీస్తున్నారంటే, అది అతిశయోక్తి కాదు.
తమ ఛానళ్ళ రేటింగులు పెంచుకోవడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మోనాలిసా ముందర హడావిడి చేయాల్సి వస్తోంది. ఇంతకీ ఎవరీ మోనాలిసా.?
మోనాలిసా అనే యువతి మహా కుంభ మేళాలో పూసలు అమ్ముకుంటోంది. ఆ పూసలమ్మాయి అందానికి ఫిదా అయిపోతున్నారు ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు. అదీ అసలు కథ.
కొంతమంది అయితే, మోనాలిసాకి మేకోవర్ చేసేస్తున్నారు. ఆమెతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఈ హంగామా కారణంగా మోనాలిసా ఓ పెద్ద స్టార్ అయిపోయింది.
గాలి రాతలు రాసేవాళ్ళయితే, ఫలానా సినిమాలో హీరోయిన్‌గా బుక్కయ్యిందంటూ గాసిప్పులు పుట్టించేస్తుండడం గమనార్హం. కానీ, మోనాలిసా పరిస్థితి ఇంకోలా వుంది.
ఈ హంగామా వల్ల పూసల వ్యాపారం సజావుగా చేసుకోలేకపోతున్నాననీ, తన కడుపు నిండే పరిస్థితి కనిపించడంలేదని, తన కుటుంబమూ ఇబ్బందుల పాలవుతోందని మోనాలిసా కన్నీరు మున్నీరవుతోంది.
ఓ దశలో ఆమె మహా కుంభ మేళా ప్రాంతాన్ని వీడి వెళ్ళాల్సి వస్తోంది కూడా. సెల్ఫీల కోసం ఎగబడుతూ కొందరు తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుండడం వల్లే, తాను తన వ్యాపారం చేసుకోలేకపోతున్నట్లు చెప్పిందామె.
పిచ్చి ముదిరి పాకాన పడటమంటే ఇదే మరి.!