ఓ సినిమా విడుదలవుతోందంటే (Love Story Review), ఒకప్పుడు వుండే హంగామా వేరు. కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలయ్యేందుకు భయపడుతున్నాయి. తప్పదు, భయపడాలి.. ఇది కరోనా కాలం మరి.! పరిస్థితులు అలా తగలడ్డాయ్..
ధైర్యం చేసి కొన్ని చిన్న సినిమాలు, ఓ మోస్తరు సినిమాలు ప్రేక్షకుల మందుకొస్తున్నాయి (థియేటర్లలో విడుదలడం ద్వారా). వాటిల్లో కొన్ని తొలి రోజు అదుర్స్.. అనే టాక్ తెచ్చుకుంటున్నా.. రెండో రోజు పరిస్థితి దారుణంగా తయారవుతోంది. కారణం, కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు పెద్దగా ఆసక్తి చూపకపోవడమే.
ఆ హోరు మళ్ళీ మొదలైంది..
తొలి రోజు సందడి కూడా థియేటర్ల దగ్గర అంతంతమాత్రమే కనిపిస్తున్న రోజులివి. అలాంటిది, ‘లవ్ స్టోరీ’ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగుల హోరు.. తొలి రోజు తొలి షో చూసేందుకు థియేటర్ల వద్ద చాంతాడంత క్యూ లైన్లు.. వెరసి, సగటు సినీ అభిమాని పండగ చేసుకుంటున్న సందర్భమిది.
భారీ కటౌట్లతో తమ అభిమాన హీరో సినిమా విడుదల సంబరాల్లో మునిగితేలిపోయారు అభిమానులు. టపాకాయల హోరు, కళ్యాణ మండపం తరహాలో సినిమా థియేటర్ల అలంకరణ.. అభిమాన హీరో కటౌట్లకు పాలాభిషేకాలు.. డప్పుల దరువులు.. అబ్బో, ఆ హంగామాని వర్ణించేందుకు మాటలు సరిపోవేమో.
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఇంతటి హడావిడి.? బహుశా నాగచైతన్య గత చిత్రాలకూ ఇంత హడావిడి లేదేమో. ఓ వైపు నాగచైతన్య, ఆయన భార్య సమంత చుట్టూ విడాకుల గాసిప్స్ నడుస్తున్న దరిమిలా, ఇంకో వైపు లవ్ స్టోరీ సంబరాలు.. ఒకింత ప్రత్యేకమే మరి.
లవ్ స్టోరీ ఎలా వుంది.?
‘లవ్ స్టోరీ’ సినిమా ఎలా వుంది.? అన్నది వేరే చర్చ. సినిమా కోసం థియేటర్లకు ప్రేక్షకులు ఉత్సాహంగా వెళ్ళడంతోనే, తెలుగు సినిమా కాస్త ఊపిరి పీల్చుకున్నట్టయ్యింది. రాజకీయ పరమైన కార్యక్రమాలకు లేని ఆంక్షలు, సినిమాలకే వచ్చి పడటం శోచనీయం.. (అన్ని చోట్లా కాదు, కొన్ని చోట్ల మాత్రమేనండోయ్) అయినాగానీ, ‘లవ్ స్టోరీ’ విడుదలకు ముందు సూపర్ హిట్ అయిపోయింది.. సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే విషయమై.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాకి ప్రీ రిలీజ్ బజ్ అదిరిపోయింది. ఓవర్సీస్ రిపోర్టుని బట్టి చూస్తే, సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.
నాగచైతన్య, తన తండ్రిలాగానే ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూనే వున్నాడు. ఆ క్రమంలో ‘లవ్ స్టోరీ’ కూడా అతనికి ఓ స్పెషల్ ఫిలిం అయ్యే అవకాశాలున్నాయి. సాయి పల్లవి నటకి ప్రశంసలు దక్కుతున్నాయి. విలక్షణ చిత్రాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల మరోమారు సెన్సిబుల్ ఫిలిం ( Love Story Review ) తెరకెక్కించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రేక్షకుల నుంచి.