Nara Lokesh Redbook Politics.. ఏడాదిన్నరలో మూడు పేజీలు మాత్రమే.! మరి, మిగిలిన తొంభై ఏడు పేజీల కథేంటి.? మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
అసలు ఈ రెడ్ బుక్ ఏంటి.? మూడు పేజీల్లో ఏం రాసుకున్నారు,? మిగిలిన పేజీల్ని ఎప్పుడు పూర్తి చేస్తారు.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
వైసీపీ హయాంలో, అప్పటి ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. పలువురు టీడీపీ సీనియర్ నేతలు వివిధ కేసుల్లో అరెస్టయ్యారు.
సాక్షాత్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయ్యారు. దాదాపు రెండు నెలలపాటు జైల్లో వుండాల్సి వచ్చింది చంద్రబాబుకి.
Nara Lokesh Redbook Politics.. రెడ్ బుక్ రాజ్యాంగం..
ఈ నేపథ్యంలోనే, రెడ్ బుక్ అంశం తెరపైకొచ్చింది. కక్ష సాధింపులపై రెడ్ బుక్‌లో అన్ని విషయాలూ రాసుకుంటున్నానని అప్పట్లో నారా లోకేష్ చెప్పారు.
పాదయాత్ర సమయంలో, అడుగడుగునా రెడ్ బుక్ ప్రస్తావన వచ్చేది. కూటమి అధికారంలోకి వచ్చాక, వైసీపీ నుంచి ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అంటూ, విమర్శల దాడి మొదలైంది.
టీడీపీ కార్యకర్తలు కూడా, ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలు.. వైసీపీకి వెన్నులో వణుకు.. అంటూ, సోషల్ మీడియా వేదికగా కామెంట్లు మొదలు పెట్టారు.
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి, కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాక, ప్రతి అరెస్టు సమయంలోనూ ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అని వైసీపీ కామెంట్లు చేయడం చూస్తున్నాం.
రెడ్ బుక్‌లో జగన్ అరెస్ట్ వుందా.?
ఒకవేళ నారా లోకేష్ గనుక, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే, మొదటి అరెస్ట్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అయి వుండేది. కానీ, ఇప్పటిదాకా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోలికి వెళ్ళింది లేదు.
దాంతో, టీడీపీ కార్యకర్తల్లో అసహనం పెరిగిపోతోంది. ‘మేం తిరిగి అధికారంలోకి వచ్చాక.. మీ అంతు చూస్తాం..’ అని వైసీపీ అధినేత సహా, వైసీపీ నేతలు, కార్యకర్తలకు బెదిరింపులకు దిగుతున్నారు.
ఈ క్రమంలోనే నారా లోకేష్ మీద టీడీపీ కార్యకర్తలు ‘రెడ్ బుక్’ విషయమై ఒత్తిడి చేయడం ప్రారంభించారు.
Also Read: ఆకాశంలో క్రీడీ మైదానం! ఎడారి దేశంలో అద్భుతం!
వారి ఆవేదనను అర్థం చేసుకున్న లోకేష్, ‘రెడ్ బుక్‌లో మూడు పేజీలే చూశారు.. ఇంకా తొంభై ఏడు పేజీలున్నాయి’ అంటూ తాజాగా వ్యాఖ్యానించారు.
ఇప్పుడిక, ఆ తొంభై ఏడు పేజీల్లో ఎక్కడన్నా జగన్ అరెస్ట్ అంశం వుందా.? అని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
కార్యకర్తల ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో లోకేష్ చేసిన ‘రెడ్ బుక్’ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి.
