Table of Contents
‘ఎన్‌టిఆర్ బయోపిక్’ (NTR Biopic) అంటూ, ‘ఎన్‌టిఆర్ కథా నాయకుడు’ (NTR KathaNayakudu), ‘ఎన్‌టిఆర్ మహా నాయకుడు’ (NTR MahaNayakudu) పేర్లతో క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో వెండితెర వేల్పు స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర గురించి చెప్పేందుకు రంగం సిద్ధమవుతుండగా, ఆ స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరమాంకంలోని సంఘటనల్ని నేటి తరానికి చాటి చెప్పేందుకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘విజయదశమి’ నాడు కొబ్బరికాయ కొట్టబోతున్నారు. సాధారణంగా దేవుళ్ళని నమ్మని రామ్‌గోపాల్ వర్మ, ముహూర్తాల్ని పట్టించుకోని రామ్‌గోపాల్ వర్మ.. విజయదశమి రోజున సినిమా ప్రారంభించడమేంటి.? అదీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడి సన్నిధి సాక్షిగా సినిమా విశేషాల్ని ప్రకటిస్తానని చెప్పడమేంటి.? క్రిష్ వర్సెస్ ఆర్జీవీ.. ఈ ఇద్దరిలో ఎవరి సినిమా ‘అన్నగారి’ చరిత్రని వున్నది వున్నట్లుగా చూపిస్తుంది.? ఎవరిది నాటకీయంగా వుండబోతోంది.? ఈ సినిమాల వల్ల నేటి తరం తెలుసుకోబోయేదేంటి.?
యుగపురుషుడంటే ఆయనే..
యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao). ఇది అందరికీ తెలిసిన సంగతే. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే తెలియనివారుండరు. కొన్ని జనరేషన్స్ వరకు ఆయన పేరు మార్మోగిపోతూనే వుంటుంది. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవ అలాంటిది. ఆయనకు జాతీయ స్థాయి గుర్తింపు సినిమాలతోనే కాదు, రాజకీయాల కారణంగానూ వచ్చింది. ‘తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం’ అనే మాట, స్వర్గీయ నందమూరి తారకరామారావు ద్వారానే విశ్వవ్యాపితమయ్యింది. అదీ ‘అన్నగారి’ సత్తా.
బయోపిక్ అంటే ఆషామాషీ వ్యవహారమా?
అచ్చమైన తెలుగుదనానికి స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రతీక. అలాంటి స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కించడమంటే అది చిన్న విషయం కానే కాదు. ఆ మహా యజ్ఞాన్ని స్వయంగా ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేపట్టారు. ముందుగా తేజ దర్శకత్వంలో సినిమా అనుకున్నా, తర్వాత అది దర్శకుడు క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) Krish (Radhakrishna Jagarlamudi) చేతుల్లోకి వెళ్ళింది. ఒక్క సినిమాతో స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర గురించి చెప్పడం చాలా కష్టం గనుక, రెండు పార్టులుగా సినిమాని విడుదల చేయబోతున్నారు. ఒకటి సంక్రాంతికి, ఇంకోటి గణతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో ఒకటి ‘ఎన్‌టిఆర్ కథానాయకుడు’ కాగా, మరొకటి ‘ఎన్‌టిఆర్’ మహానాయకుడు.
కథా నాయకుడే మహా నాయకుడయ్యాడు
సినిమాల్లో విలన్లను చీల్చి చెండాడినట్లే.. రాజకీయాల్లోనూ ప్రత్యర్థుల్ని తన పదునైన మాటలతో చీల్చి చెండాడేశారు స్వర్గీయ ఎన్టీఆర్. తెలుగునాట రాజకీయాల్లో ఆయనది ఓ ప్రత్యేకమైన శైలి. సరికొత్త రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఘనుడు స్వర్గీయ ఎన్టీఆర్. ఆయన, రాజకీయ వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఆయన కథానాయకుడే కాదు, మహానాయకుడు కూడా అయ్యాడు. కథా నాయకుడెలా అయ్యాడో ఓ సినిమాలో చూపించి, మహా నాయకుడెలా అయ్యాడో ఇంకో సినిమాలో చూపించాలన్న ఆలోచనే ఓ అద్భుతం.
ఆ ‘వెన్నుపోటు’ సంగతేంటి.?
స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి మాట్లాడుకోవాలంటే, వెండితెరపై ఆయన నటించిన అద్భుత చిత్రాల్లో ప్రతి ఒక్కదాని గురించీ చర్చించుకోవాలి. ఏ సినిమాలో ఏ పాత్ర వేసినా, ఆ పాత్రకీ, ఆ సినిమాకీ వన్నెతెచ్చేవారు స్వర్గీయ ఎన్టీఆర్. తెలుగు సినిమా వున్నంతకాలం, ఆ ‘సినిమా’ అన్న ప్రస్తావనలో స్వర్గీయ ఎన్టీఆర్ జీవించే వుంటారన్నది నిర్వివాదాంశం. అయితే, రాజకీయాల్లో అనూహ్య విజయాలు సాధించిన స్వర్గీయ ఎన్టీఆర్, ‘నేను ఓడిపోయాను..’ అంటూ కంటతడిన సందర్భం ఎవరూ మర్చిపోలేరు. ఆ ‘వెన్నుపోటు’ గురించి అన్నగారే పలు సందర్భాల్లో చెప్పారు. కానీ, అది వెన్నుపోటు కాదు.. అధికార మార్పిడి అంటారు అన్నగారి అల్లుడు చంద్రబాబు (Nara Chandrababu Naidu). ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), చంద్రబాబు చేతుల్లోనే వుంది.
2019 ఎన్నికలే లక్ష్యంగా ఎన్‌టిఆర్ సినిమాలు..
ఓ సినిమాకి తెలుగుదేశం పార్టీనే అండ. అదే ‘ఎన్‌టిఆర్ బయోపిక్’. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారు. టిడిపి ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో నటిస్తూ నిర్మిస్తున్నారు. అన్నగారి తనయుడు కదా, అచ్చం అన్నగారిలానే బాలయ్యబాబు సినిమా స్టిల్స్‌లో కన్పిస్తున్నారు. చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, బసవతారకం పాత్రలో విద్యా బాలన్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్‌రామ్.. ఇలా ఎందరో ప్రముఖులు ‘ఎన్‌టిఆర్ బయోపిక్’కి కొత్త గ్లామర్ అద్దుతున్నారు. నిండైన పాత్రలతో, అన్నగారి బయోపిక్ తెరకెక్కడం ఓ అద్భుతం. ఈ రెండు సినిమాలూ 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఇంకా ఖరారు కాని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పాత్రలు..
వర్మ రూపొందించనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ (Lakshmis NTR) సినిమాకి కీలకం అన్నగారి పాత్రతోపాటు ఆయనగారి రెండో సతీమణి లక్ష్మీ పార్వతి. ఆమె ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్నారు. క్రిష్ అయినా, వర్మ (RGV) అయినా వున్నది వున్నట్లు చూపిస్తే ఫర్లేదుగానీ, లేదంటే న్యాయపోరాటం చేస్తానని ఆమె హెచ్చరిస్తున్నారు. ఇంకో వైపున ఓ సినిమాతో ఇంకో సినిమా వివాదాలు కొనసాగించే పరిస్థితి వుంది. కారణం జనవరిలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తాయ్. ఇంతవరకు వర్మ తన సినిమాకి సంబంధించి నటీ నటులెవరో చెప్పలేదు. విజయదశమికి వెల్లడిస్తారేమో. ఏదేమైనా, వర్మ (Ramgopal Varma) ఎన్టీఆర్, క్రిష్ ఎన్టీఆర్.. వీటిల్లో ఏది అన్నగారి నిజమైన చరిత్రో తేల్చాల్సింది అన్నగారి అభిమానులే.