Parakamani Dollar Theft YSRCP.. కొన్ని విషయాల్లో స్పందించకపోవడమే మంచిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎవరూ ఎందుకు సూచించరరు.?
ఒకవేళ ఎవరైనా సూచించినా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎవర్నీ లెక్క చేయకుండా, తాను చెయ్యాలనుకున్న డ్యామేజీని వైసీపీకి చేసేస్తుంటారా.?
తిరుమల పరకామణిలో దొంగతనం జరిగింది.. దొంగతనం చేశానని, ఆ దొంగ కూడా ఒప్పుకున్నాడు.
సదరు దొంగ కుటుంబం, 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని టీటీడీకి విరాళంగా ఇచ్చి, చేసిన దొంగతనాన్ని మాఫీ చేయించుకోవాలనుకుంది కూడా.
దొంగతనం నిజం.. దొంగ పట్టుబడిందీ నిజం.. ఈ కేసు విచారణ సందర్భంగా ఓ పోలీస్ అధికారి అనుమానాస్పద రీతిలో హత్యకు గురవడమూ నిజం.
పైగా, ఇదంతా హిందువుల మనోభావాలతో ముడిపడి వున్న అంశం. ‘నాలుగ్గోడల మధ్య బైబిల్ చదువుకుంటా.. నా మతం మానవత్వం’ అని చెప్పుకునే జగన్, పరకామణి వ్యవహారంలో మౌనం దాల్చి వుంటే బావుండేది.
వైసీపీలో చాలామంది నాయకులున్నారు.. వాళ్ళెవరైనా ఈ విషయమ్మీద మాట్లాడితే అదో లెక్క.! అలాగని, వైఎస్ జగన్ మాట్లాడకూడదని కాదు.
ప్రతిపక్ష హోదా మీద ఆశపడుతున్న వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్, పరకామణి దొంగతనంపై మాట్లాడొచ్చు.
కానీ, జరిగింది చిన్న దొంగతనం.. అని వైఎస్ జగన్ అని వుండకూదు.! వారానికోసారి బెంగళూరు నుంచి తాడేపల్లికి రావడం, వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి.. ఇలా దొరికిపోవడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలవాటే.
స్వయానా ఆ దొంగే, తాను చేసినది చిన్న దొంగతనం కాదనీ, చాలా పెద్ద దొంగతనమనీ, చేసిన దొంగతనానికి చింతిస్తున్నాననీ, మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెబుతున్నాడాయె.
దొంగ పేరు రవికుమార్.! 72 వేల రూపాయల విలువ చేసే అమెరికన్ డాలర్లను దొంగిలించిన రవికుమార్ దగ్గర, తిరుమలకు 14 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు విరాళంగా ఇచ్చే ‘శక్తి’ ఎలా వచ్చింది.?
సదరు దొంగ రవికుమార్‌ని వైసీపీ నిన్న మీడియా ముందుకు తీసుకొచ్చి, సెల్ఫ్ గోల్ చేసుకుంది.!
డాలర్ అంటే, అమెరికా డాలర్ కాదు.. తిరుమలలో విక్రయించే బంగారు డాలర్.. అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం స్పష్టంగా అమెరికన్ డాలర్.. అంటున్నారు.
పరకామణిలో దొంగతనానికి సంబంధించి వైసీపీ ఎంతగా ఇరుక్కుపోయిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
