Pawan Vijay Tamilnadu TVK.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. రాజకీయాలు భిన్నంగా వుంటాయి. స్థానిక రాజకీయాలకు అనుగుణంగా, రాజకీయ పార్టీలు తమ వ్యూహాల్ని రచిస్తుంటాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో సింగిల్ మోడల్ రాజకీయాలు నడుస్తాయని అనుకోగలమా.? అంతెందుకు, రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో భిన్నమైన రాజకీయ పరిస్థితులుంటాయి.
ఆ మాటకొస్తే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉత్తరాంధ్ర, రాయలసీమ.. ఇలా వేరు చేసి చూస్తుంటారు రాజకీయ వ్యవహారాలకు సంబంధించి.
కోనసీమలో ఓ రకమైన రాజకీయాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇంకో రకమైన రాజకీయాలు నడుస్తుంటాయి.
భిన్నత్వంలో ఏకత్వం.. అని మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటుంటాం. అది మళ్ళీ వేరే చర్చ.
Pawan Vijay Tamilnadu TVK.. తమిళనాడులో ఏం జరుగుతోంది.?
అసలు ఇప్పుడిదంతా ఎందుకు.? అంటే, తమిళనాడులో ఆంధ్ర ప్రదేశ్ పొలిటికల్ మోడల్ దిశగా వ్యూహ ప్రతివ్యూహాలు నడుస్తున్నాయన్న చర్చ జరుగుతోంది గనుక.
తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. అదే, సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని ‘టీవీకే’.! అక్కడ ఆల్రెడీ రెండు ప్రధాన రాజకీయ పార్టీలున్నాయి.
డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల మధ్యనే తమిళనాడులో ఎప్పుడూ పోటీ వుంటుంది. కమల్ హాసన్ పార్టీ పెట్టి కూడా, తమిళనాడు రాజకీయాల్ని ప్రభావితం చేయలేకపోయారు.

తమిళనాడులో రాజకీయాల్ని అర్థం చేసుకున్న రజనీకాంత్, రాజకీయాలకు దూరంగా వున్నారు. రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన దశాబ్దాలుగా చేసి, చివరికి ఆ ఆలోచనల్ని విరమించుకున్నారాయన.
విజయ్ కాంత్, శరత్ కుమార్.. చెప్పుకుంటూ పోతే, పెద్ద లిస్టే వుంటుంది.. తమిళనాడులో సినీ రాజకీయాల గురించి.
ఇక, విజయ్ పార్టీ, ఇటీవల పెను సంక్షోభానికి గురైంది, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన బహిరంగ సబలో జరిగిన తొక్కిసలాట తర్వాత.
కాంగ్రెస్, బీజేపీ.. తమిళనాడు రాజకీయాల్లో వున్నాయంటే, వున్నాయంతే. వాటి ప్రభావం తమిళనాడు రాజకీయాలపై చాలా చాలా తక్కువ.
అయితే, బీజేపీ తమవైపుకు టీవీకే విజయ్‌ని లాక్కొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీని మిత్రపక్షంగా భావించే ఏఐఏడీఎంకే ఆల్రెడీ విజయ్‌కి స్నేహ హస్తం అందించింది.
చిత్రమేంటంటే, విజయ్‌తో వున్న స్నేహం కారణంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన్ని ఏఐఏడీఎంకే – బీజేపీలతో కలవమని సూచించారంటూ ప్రచారం జరుగుతోంది.
ఏపీలో బీజేపీ – టీడీపీ – జనసేన కలిసినట్లుగా, తమిళనాడులో బీజేపీ – ఏఐఏడీఎంకే – టీవీకే కలవాలన్నది పవన్ చేసిన సూచనగా వార్తా కథనాల్ని చూస్తున్నాం.
Also Read: పిచ్చోడితో ఐపీఎస్ ‘సూసైడ్ ఆపరేషన్’.!
బీజేపీ తరఫున వచ్చే ఎన్నికల్లో జనసేనాని తమిళనాడులో ప్రచారం చేయొచ్చేమో. అంతేగానీ, ఎంత స్నేహం వున్నా, ఈ తరహా పొత్తుల వ్యవహారాలపై విజయ్‌కి పవన్ కళ్యాణ్ సూచనలు చేసే అవకాశం వుండదు.
బీజేపీ – ఏఐఏడీఎంకే – టీవీకే పొత్తు కుదురితే మాత్రం, ఆ కూటమికి విజయ్ – పవన్ కళ్యాణ్ స్నేహం వల్ల అదనపు పొలిటికల్ గ్లామర్ వస్తుందన్నది నిర్వివాదాంశం.
ముందే చెప్పుకున్నట్లు, తమిళనాడు రాజకీయాలు వేరు.. వాటిని ఏపీ రాజకీయాలతో పోల్చి చూడలేం.!
