బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ తన మీద అత్యాచార యత్నానికి ఒడిగట్టాడంటూ హీరోయిన్ పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తొలుత మీడియాకెక్కి, ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించిన పాయల్, ఈ వివాదంలోకి మరో బాలీవుడ్ నటి రిచా చద్దాని (Payal Ghosh Vs Richa Chadha) లాగింది.
దాంతో, రిచా చద్దా పరువు నష్టం దావా వేసింది. చేసేది లేక, పాయల్ ఘోష్, రిచా చద్దాకి బేషరతు క్షమాపణ చెప్పింది. మామూలుగా అయితే, ఇక్కడితో ఇద్దరి మధ్యా వివాదం సద్దుమణగాల్సి వుంది. కానీ, ఇద్దరి మధ్యా సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతూనే వుంది.
తాను క్షమాపణ చెప్పడం వెనుక కారణం వేరనీ, దాన్ని రిచా చద్దా ఇంకోలా ప్రొజెక్ట్ చేసుకుంటోందనీ పాయల్ ఆరోపిస్తోంది. ‘క్షమాపణ చెప్పింది.. ఇదిగో సాక్ష్యం..’ అంటూ అందుకు తగ్గ వివరాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రిచా. ‘నేను అందర్నీ గౌరవిస్తాను. పొరపాటున ఆమె పేరు ప్రస్తావనకు వచ్చింది.

అయితే, అసలు సమస్య వేరే. నేను ఆ సమస్యతో పోరాడుతున్న సమయంలో, ఈ సిల్లీ వివాదం అనవసరమన్న భావనతోనే ఆమెకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కోర్టు బయట సెటిల్మెంట్ జరిగింది’ అంటూ పాయల్ ఘోష్ చెప్పడాన్ని రిచా చద్దా (Payal Ghosh Vs Richa Chadha) తీవ్రంగా తప్పుపడుతోంది.
ఈ వివాదం ముందు ముందు ఎక్కడిదాకా వెళుతుందోగానీ, పాయల్ కేవలం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందనే చర్చ బాలీవుడ్లో గట్టిగానే జరుగుతోంది. ఓ వైపు పోలీసులకు ఫిర్యాదు చేయడం మరో వైపు మహిళా కమిషన్‌లో తన ఆవేదనను వెల్లగక్కుకోవడం వెరసి, అనురాగ్ కశ్యప్‌పై గట్టిగానే పోరాడాలనుకుంటోంది పాయల్ ఘోష్.
అయితే, అనురాగ్‌కి మద్దతుగా బాలీవుడ్లో చాలామంది ముందుకొస్తున్నారు. ‘ఆయన చాలా మంచివాడు’ అని అంటున్నవారిలో పలువురు బాలీవుడ్ నటీనటులున్నారు. ‘ఆయన గురించి మాకు తెలుసు.. అదే సమయంలో, ఆయన తప్పు చేశాడని తేలితే.. ఆయన్ని మేం సమర్థించే పరిస్థితి వుండదు’ అని అంటున్నవారూ లేకపోలేదు.
ఏదిఏమైనా, మీ టూ తర్వాత ఈ వివాదం ఆ స్థాయిలో పాపులర్ అయ్యింది. మీ టూ అంతటి వివాదమే తర్వాత్తర్వాత నీరుగారిపోయిన నేపథ్యంలో పాయల్ ఘోష్ గొడవ ఏమవుతుందో వేచి చూడాలి.