Political Liquor.. మధ్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ, అదే మధ్యపానం దేశోద్ధారకం. ఎందుకంటే, మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వాలకు అత్యంత కీలకం. మద్యం విక్రయాల్ని ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వాలు చూస్తున్నాయ్. మందు బాబులు ఎంతలా మద్యం సేవించి ఆరోగ్యాన్నీ, జీవితాల్నీ చెడగొట్టుకుంటే, ప్రభుత్వాలకు అంత గొప్పగా ఆదాయం సమకూరుతుంది.
ఓ సినిమాలో మద్యం సేవించిన వ్యక్తి తనిఖీ చేయడానికి వచ్చిన పోలీసులతో మాట్లాడుతూ.. నేను తాగుబోతుని కాదు, పన్ను చెల్లింపుదారుడిని..’ అంటాడు. మద్యం సేవించడం ద్వారా తాను ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు ఎంతో విలువైనదంటూ లెక్కలు చెబుతాడు. అదొక హాస్య భరిత సన్నివేశమే అయినా ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసే విషయం అందులో ఉంది.
మద్య నిషేధం – ఎన్నికల స్టంట్
మద్య నిషేధం గురించి ఎక్కడ ఎన్నికలు జరిగినా చర్చ జరుగుతూ ఉంటుంది. అధికారంలోకి వస్తే, మద్యాన్ని నియంత్రిస్తామని పార్టీలు చెబుతాయి. మద్య నిషేధంపై కొన్ని పార్టీలు హామీలు కూడా ఇస్తాయ్. కానీ, అధికారంలోకి వచ్చాకా, మద్యం మీద వచ్చే ఆదాయం గురించి మాత్రమే ఆలోచించడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారిపోయింది. ఎందుకిలా.?

ప్రధాన రాజకీయ పార్టీల్లోని ప్రముఖ నాయకులకు మద్యం ప్రధాన ఆదాయ వనరు. ఓటర్లను మభ్య పెట్టడానికీ, మద్యాన్నే వినియోగించాలి. మద్యం ద్వారా వెనకేసుకున్న అక్రమార్జనే ఎన్నికల్లో పెట్టుబడి. ఎన్నికల్లో గెలిచాకా సంపాదనకీ ఆ మద్యమే గొప్పఅవకాశం. అందుకే మద్యాన్నీ, రాజకీయాన్నీ విడదీయలేనంతగా.. ఆ రెండింటి మధ్య బంధం అంతలా బలపడిపోయింది.
Political Liquor ట్రెండ్ మారింది గురూ.!
పిచ్చి పతాక స్థాయికి వెళ్లడం అంటే ఇదే. మేం అధికారంలోకి వస్తే, ఛీప్ లిక్కర్‌ని 50 రూపాయలకే అందిస్తామంటూ ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు ప్రకటించేశాడు. ఇంకా నయం.. ప్రతి నెలా లబ్ఢి దారుల ఇంటికెళ్లి సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లుగా మద్యాన్ని కూడా ఉచితంగా డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించలేదు. ఏమో అలాంటి చెత్త ఐడియాలు కూడా రాజకీయ పార్టీలకు రావచ్చుగాక.
Also Read: సర్వరోగ నివారిణి ‘గాడిద గుడ్డు’.. ఔనా.?
మందు బాబులూ.. వింటున్నారా.? దేశాన్నీ, దేశ రాజకీయాల్ని మీరెంతలా భ్రష్ఠుపట్టిస్తున్నారో. ఓ సంవత్సరం పాటు లిక్కర్ తాగడం మానేసి చూడండి. దేశంలో రాజకీయం ఎలా మారిపోతుందో తెలుస్తుంది.