Table of Contents
Political Survey India.. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి.. అన్న చందాన, కొన్ని సంస్థలకు రాజకీయ సర్వేలు అలా తయరయ్యాయ్. వీటికి ఎప్పుడూ పండగే.!
రాజకీయం అంటే, ప్రజా సేవ కోసం. కానీ, ఇక్కడ రాజకీయ సర్వేలు మాత్రం డబ్బు సంపాదన కోసం.! రాజకీయ వ్యూహకర్తలుగా పేరొస్తే, కోట్లల్లో సంపాదన.
ఆ మాటకొస్తే, రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ సంపాదించేయొచ్చు. అందుకే, రాజకీయ నాయకులే.. వ్యూహకర్తలుగా మారి, సర్వేలు చేస్తున్నారు.. చేయిస్తున్నారు కూడా.!
ఏ పార్టీకి ఎన్ని సీట్లు.?
ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు. కానీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే.. అంటూ సర్వేలు నిర్వహిస్తుంటాయి కొన్ని సంస్థలు. ఆ సంస్థల మోటివ్ ఏంటి.? అంటే, డబ్బు సంపాదన మాత్రమే.

130 కోట్ల మంది జనాభా వున్న భారతదేశంలో, సర్వేలు అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. ‘శాంపిల్ సైజ్’ చాలా చాలా తక్కువ.
అసలు ఓట్లు ఎన్ని.? ఓట్లు లేని ఓటు హక్కు వయసున్నవారెంతమంది.? అన్ని ఈ సంస్థలకు అనవసరం. శాంపిల్స్ తీసుకుంటారు, ఏవేవో లెక్కలు చెప్పేస్తారు.
మీడియా కక్కుర్తి ఫలితం..
మీడియా సంస్థలూ సర్వేలు చేయిస్తున్నాయి. వీటి లక్ష్యం కూడా డబ్బు సంపాదనే. రాజకీయ పార్టీలే మీడియా సంస్థల్ని నడుపుతున్న రోజులివి. దాంతో, తమకు అనుకూలంగా సర్వేలు చేయించుకుంటాయి.
తద్వారా ప్రజల్ని ప్రలోభపెట్టి, మసిపూసి మారేడుకాయని చేసి.. రేటింగులు పెంచేసుకుని, డబ్బు సంపాదించుకోవడం మీడియా సంస్థలు, రాజకీయ పార్టీల లక్ష్యమైపోయింది.
సర్వేల వెనుక, కార్పొరేట్ సంస్థల కక్కుర్తి కూడా లేకపోలేదు. ఆయా సంస్థలు, ఈ సర్వేల ఆధారంగా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం మామూలే.
అలా, తమకు అనుకూలంగా ఫలితాలు రప్పించుకుని, ఆయా పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే, అందుకు తగ్గ ప్రతిఫలం పొందుతాయ్.
Political Survey India.. ప్రజలతో సంబంధమే లేదాయె.!
ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయ్.. అన్న దిశగా రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం సర్వసాధారణమైపోయింది.
అంతే తప్ప, ప్రజలకు ఎంత మేర మెరుగైన పాలన ఇవ్వగలుగుతున్నాం.? అన్న దిశగా పాలకులు ప్రయత్నించడంలేదు.
అదే సమయంలో, ప్రజల కోసం ఎలాంటి పోరాటాలు చేస్తున్నామన్నది అధికారంలో లేని పార్టీలూ ఆలోచన చేయడంలేదు.
ఆయా సర్వేల ఫలితాలకు అనుగుణంగా, రాజకీయ రచ్చ చేయడం మీదనే అధికార, విపక్షాలు శ్రద్ధ చూపిస్తుండడం ఇటీవలి కాలంలో ఎక్కువైపోయింది.
Also Read: కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్.. కార్లు కొనుక్కోలేరా.?
అటు దేశం, ఇటు రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతాయ్. రాజకీయ పార్టీలకు మాత్రం అప్పులుండవ్.. అవి రోజురోజుకీ బలిసిపోతుంటాయ్.. సంపాదన పరంగా. ఇదీ నేటి భారతం.!