Politics Silly Chair Games.. పదవి కోసమూ కాళ్ల మీద పడాలి. పదవి వచ్చాకానూ కాళ్ల మీద పడాలి.. పదవి నిలబెట్టుకునేందుకు ఆ కాళ్లు ఒత్తుతూనే వుండాలి.
సరైన సమయం చూసి కాళ్లు పట్టుకుని కిందకి లాగేయాలి.. ఇదీ నిఖార్సయిన రాజకీయ సూత్రం.
వెన్నుపోటు గురించి తరచూ మాట్లాడతాం. కానీ, ఈ కాళ్ల గుంజుడు వ్యవహారం గురించి ఎందుకు మాట్లాడుకోం. దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకటా.? రెండా.? వందలు, వేలు కనిపిస్తాయ్ ఇలాంటి కాళ్లు గుంజుడు వ్యవహారాలు.
‘నాకు పదవి రాకపోయినా పర్లేదు. వాళ్లకి మాత్రం పదవి రాకూడదు..’ అని తాము మునిగిపోతూ, ఇతరుల కాళ్లు గుంజేసే నాయకులు ఎందరో కనబడతారు.

వొంగి వొంగి దండాలెట్టేవాడు అదను చూసి అవతలోన్నివొంగదీసి గుద్దేసే తత్వం కలిగివుంటాడు. రాజకీయం కూడా రబ్బరు బంతిలాంటిదే. ఎంత గట్టిగా నేలకేసి కొడితే, అంత గట్టిగా పైకెగరొచ్చూ.. లేదంటే గూబ పగులగొట్టనూ వచ్చు.
పదవి కోసం అడ్డమైనోళ్ల కాళ్లు పట్టుకుని ‘వసుదేవుడంతటోడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు..’ అని తమకు తాము సర్దిచెప్పుకునే నేతలెందరో.
Politics Silly Chair Games కాళ్ళు పట్టుకుంటారు.! పట్టుకుని లాగేస్తారు.!
చుట్టూ కెమెరాలు తమను చూస్తున్నాయని గమనించి, అందరి నోళ్లలో పడేందుకు పెద్దల కాళ్ల మీద పడే, నట రాజకీయం జనానికి కొత్తేమీ కాదు.
ఇక్కడ ‘పెద్దలు’ అంటే వయసులో పెద్దవారు కానక్కర్లేదు. వయసులో తమ కంటే చిన్నవారయినా కాళ్లు పట్టుకోవల్సిందే తప్పదు.
సినీ రంగంలో ఒకాయన వున్నాడు. ఎవడు కనిపించినా తన కాళ్ల మీదకి తోసేసుకుంటాడు. ఆయనకు అదో కక్కుర్తి. ఎవడూ తనను మనస్పూర్తిగా గౌరవించడు కాబట్టి, కనిపించోన్ని కనిపించినట్లే మెడ పట్టుకుని తన కాళ్ల మీదకి తోసేస్తాడు.
రాజకీయం అందుకు భిన్నమేమీ కాదు. అందరి ముందూ నా కాళ్లు పట్టుకుంటావా.? అని అడిగి మరీ పదవుల్ని ఎరగా చూపుతున్న రోజులివి. పదవి కోసం ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడే రాజకీయ నాయకులు ‘ఆఫ్టరాల్’ కాళ్లు పట్టుకోలేరా.?
Also Read: గుండె పోటు మాత్రమే.! ఇంకే ఇతర ‘పోటూ’ లేదట.!
ప్రతి కుక్కకీ (కుక్కలతో సోకాల్డ్ రాజకీయ నాయకుల్ని పోల్చవచ్చా.? కుక్కలు సిగ్గుపడతాయేమో.!) ఓ రోజు వస్తుందంటాడు ఓ పెద్దాయన.
అలా తమదైన రోజు వచ్చినప్పుడు ఆ కాళ్లు పట్టుకుని అవతలోడ్ని కిందికి లాగి పడేయడం సో కాల్డ్ రాజకీయ నాయకులకి కష్టమేమీ కాదు.