Ponman Telugu Review.. గొప్ప కథేమీ కాదు, కాకపోతే ఇంట్రెస్టింగ్ పాయింట్.! ఇలాంటోళ్ళు కూడా వుంటారా.? అని సినిమా చూశాక ముక్కున వేలేసుకోకుండా వుండలేం.
సినిమా పేరేమో ‘పొన్‌మాన్’. అనగా, ‘పొన్’ అంటే, ‘బంగారం’ అని అర్థమట.! బంగారు నగల్ని పెళ్ళిళ్ళకి ఇస్తుంటాడు ఇందులో హీరో.!
పెళ్ళికి బంధువులు, సన్నిహితుల చదివింపులు వుంటాయ్ కదా, తానిచ్చిన బంగారు నగలకు సరిపడా ఆ చదవింపుల నుంచి తీసుకుంటాడన్నమాట హీరోగారు.!
ఓ రాజకీయ పార్టీ కార్యకర్త.. తన చెల్లెలి పెళ్ళి కోసం, హీరోగారి ‘బంగారాన్ని’ సాయంగా తీసుకుంటాడు. కానీ, పెళ్ళికేమో చదివింపులు అనుకున్న స్థాయిలో రావు.
చదివింపులు పోను, మిగిలిన సొమ్ములకి తగ్గ బంగారాన్ని తిరిగి తీసుకునేందుకు, హీరో పడ్డ కష్టాలేంటి.? అన్నది మిగతా సినిమా.!
Ponman Telugu Review.. వన్ మ్యాన్ ఆర్మీ బాసిల్ జోసెఫ్..
అసలు ఎవరీ బాసిల్ జోసెఫ్.? అతన్ని ఈ సినిమాలోనే తొలిసారిగా చూసినవాళ్ళకి కలిగే ప్రశ్న ఇది. చురుగ్గా వుంటాడు, భావోద్వేగాలూ పండిస్తాడు.
అనకూడదుగానీ, పొట్టోడే.. కానీ, గట్టోడు.! ఇంతకు ముందు పలు సినిమాల్లో నటించాడు. అన్నీ మలయాళ సినిమాలే. ఓటీటీ పుణ్యమా అని, ఆ సినిమాలూ తెలుగు సినీ అభిమానులకి అందుబాటులో వున్నాయ్.

అలా, బాసిల్ జోసెఫ్.. అంటే, చాలామంది తెలుగు సినీ ప్రేక్షకులకి సుపరిచితుడైపోయాడు. ప్రతి ఫ్రేమ్‌లోనూ బాసిల్ జోసెఫ్ నటన ఆకట్టుకుంటుంది.
సినిమాలో పేరున్న నటీనటులు (మలయాళ సినీ పరిశ్రమకు చెందినవారు) వున్నాగానీ, సినిమా అంతా తానే అయి కనిపిస్తాడు బాసిల్ జోసెఫ్.
బంగారు నగల కాన్సెప్ట్..
కథ గొప్పగా ఏమీ అనిపించకపోయినా, ‘బంగారు నగల’ కాన్సెప్ట్ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దాని చుట్టూ అల్లిన స్క్రీన్ ప్లే వేరే లెవల్.
థియేటర్లలో చూస్తే, కొంచెం సాగతీత అనిపిస్తుందేమోగానీ, టైమ్ పాస్ కోసం ఇంట్లో చూసేవాళ్ళకి భలే థ్రిల్ ఇస్తుంది ఈ ‘పొన్‌మాన్’ సినిమా.!
బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ.. అన్నీ సినిమాకి తగ్గట్టుగానే వున్నాయి. నిర్మాణపు విలువలు కూడా బావున్నాయ్.!
Also Read: నాని ‘హిట్-3’: ‘మార్కో’ని మించిన రక్తపాతమా.?
తెలుగు సినిమాయేనా.? అన్నట్టుగా తెలుగులోకి డబ్ చేశారు. డైలాగులు అలా రాశారు మరి.! యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా సహజంగా డిజైన్ చేశారు.
పుట్టింటి నుంచి తీసుకొచ్చిన బంగారం లేకపోతే, అత్తవారింట్లో ఆడపిల్లకి ఎదురయ్యే పరిస్థితి గురించి ప్రస్తావించిన తీరు బావుంది. అలాగని, ఎమోషనల్ సీన్స్‌తో ఏడిపించేయలేదు.
హీరో ఇంట్లో దయనీయ స్థితులు బయటపడిన తీరు, హృదయాల్ని టచ్ చేస్తుంది. ఓవరాల్‌గా ‘పొన్‌మాన్’ ఓ ఇంట్రెస్టింగ్ మూవీ. వీలు చూసుకుని, ఓ సారి తప్పక చూడాల్సిన సినిమానే.!