Pro Kabaddi.. కబడ్డీలో వున్నంత యాక్షన్ క్రికెట్‌లో చూడగలమా.? నిజానికి, కబడ్డీ గ్రామీణ క్రీడ. కబడ్డీ గురించి తెలియనివారెవరైనా వుంటారా.? చిన్నప్పటినుంచీ కబడ్డీతో ఏదో ఒక రకంగా అనుబంధం అందరికీ వుంటుంది. అయితే, కాలం మారింది.. కబడ్డీ ఆడటం సంగతి దేవుడెరుగు.. కబడ్డీ గురించి వినడమే అరుదైన వ్యవహారమైపోయింది.
కానీ, ప్రో కబడ్డీ లీగ్ పుణ్యమా అని కబడ్డీ ఆటకి మళ్ళీ క్రేజ్ వచ్చి పడుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే ప్రో కబడ్డీ లీగ్ కూడా నడుస్తోంది. ఆ మాటకొస్తే, క్రికెట్ కంటే కూడా ఎక్కువ మజా ఈ ప్రో కబడ్డీ లీగ్ ద్వారా కలుగుతోందనడం అతిశయోక్తి కాదేమో.
Pro Kabaddi.. లే పంగా.!
సూపర్ రైడ్.. సూపర్ టాకిల్.. డూ ఆర్ డై రైడ్.. బోనస్ పాయింట్.. ఇలా కబడ్డీ ఆటకి సంబంధించి ఆయా పేర్లు క్రమంగా పాపులర్ అవుతున్నాయి. అంతేనా, కబడ్డీ ఆటగాళ్ళ పేర్లు కూడా ‘స్టార్ డమ్’ సంపాదించుకుంటున్నాయి. ‘ఇది మన జట్టు..’ అని దేశవ్యాప్తంగా కబడ్డీ అభిమానులే కాదు, సాధారణ ప్రజానీకం కూడా కబడ్డీ ఆటకీ, ఆటగాళ్ళకీ, ఆయా జట్లకీ కనెక్ట్ అయిపోతున్నారు.

కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని కబడ్డీ పోటీల్ని నిర్వహిస్తోంది ప్రో కబడ్డీ లీగ్ టీమ్. పలువురు ప్రముఖులు ఈ ఆటకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతున్నారు. అంతేనా, సినీ ప్రముఖులు ఆయా జట్లకు స్పాన్సరర్లుగానూ వ్యవహరిస్తుండడం గమనార్హం.
క్రికెట్టు.. కబడ్డీ.. కెవ్వుకేక.!
క్రికెట్ ఒక్కటే ‘ఆట’ అయిపోయిన భారతదేశంలో, మిగతా ఆటల పట్ల కూడా క్రేజ్ పెరగాల్సి వుంది. ఆయా ఆటల్లో ప్రపంచ స్థాయి పథకాలు లభించడం అనేది ఈ మధ్య ఎక్కువవుతుండడం, ఆయా ఆటలకు పాపులారిటీ పెరుగుతున్న దరిమిలా, ముందు ముందు చిన్నతనం నుంచే ఆయా క్రీడల్లో చిన్నారుల ప్రవేశం మరింత ఎక్కువగా వుంటుందని ఆశిద్దాం.
Also Read: Cryptocurrency కొంచెం ఇష్టం.. చాలా కష్టం.!
మరీ ముఖ్యంగా కబడ్డీ లాంటి సంప్రదాయ ఆటల పట్ల అవగాహన పెరగాలి.. ప్రో కబడ్డీ లీగ్ (Pro Kabaddi) అందుకు సరైన మార్గం చూపుతోందనే అనుకోవచ్చు.