రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ (Radhe Shyam To Resume Shooting) సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. కరోనా నేపథ్యంలో మిగతా అన్ని సినిమాలతోపాటు ‘రాధేశ్యామ్’ కూడా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.
కరోనాకి కొద్ది రోజుల ముందు విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ‘రాధేశ్యామ్’, కరోనా సమయంలోనూ కీలకమైన షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్‌కి జస్ట్ కొన్ని రోజుల ముందే ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకుని, ఇండియాకి వచ్చిన ‘రాధేశ్యామ్’ టీమ్ అప్పట్లో సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్ళాల్సి వచ్చింది కూడా.
అదృష్టవశాత్తూ టీమ్ సభ్యులు ఎవరికీ కరోనా సోకలేదు. ఇక, కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలు షూటింగ్ ఆగిపోగా, అభిమానులకు ఓ సూపర్ గుడ్ న్యూస్ ఇచ్చాడు దర్శకుడు రాధాకృష్ణకుమార్ తాజాగా. సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతోందనీ, సెప్టెంబర్ రెండో వారం నుంచీ షూటింగ్ జరుపుతామని వెల్లడించాడు.
దాంతో, ప్రభాస్ (Rebel Star Prabhas) అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. ప్రభాస్ సరసన ఈ ’రాధేశ్యామ్‘లో పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే.
విదేశాల్లో చిత్రీకరించాల్సిన కొన్ని సన్నివేశాల్ని రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేసేస్తారంటూ ఓ పక్క గుసగుసలు విన్పిస్తోంటే, ఇంకోపక్క.. ఆ కొన్ని సన్నివేశాల్ని తర్వాత చిత్రీకరించేలా ప్లానింగ్ మార్చారనీ, ప్రస్తుతానికి ఇక్కడే పూర్తి చేయగల సీన్స్‌ని చిత్రీకరిస్తారనీ ఇంకో పక్క ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో షూటింగ్ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే, పరిస్థితులు ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా చక్కబడుతున్నాయి. పలు దేశాలు నిబంధనలతో విమాన ప్రయాణాలకు అనుమతులిస్తున్నాయి. ఇంకొన్ని దేశాలైతే, తమ దేశానికి అతిథుల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుండడం గమనార్హం.
ఏదిఏమైనా, ఇప్పటికే చాలా ఆలస్యమవుతోన్న ‘రాధేశ్యామ్’ సెప్టెంబర్ నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభించుకోనుందన్న వార్త ప్రభాస్ అభిమానులకి బోల్డంత ఆనందాన్నిస్తోందన్నది నిర్వివాదాంశం.