Home » ‘రిస్కీ’ హీరోయిజం.. కాస్త తగ్గాలోయ్ కుర్రాళ్ళూ..

‘రిస్కీ’ హీరోయిజం.. కాస్త తగ్గాలోయ్ కుర్రాళ్ళూ..

by hellomudra
0 comments

రీల్‌ హీరోలు మాత్రమే కాదు, రియల్‌ హీరోలని అన్పించుకునే క్రమంలో యంగ్‌ హీరోలు యాక్షన్‌ సీక్వెన్సెస్‌ చేసేటప్పుడు (Injuries While Filming In Tollywood) ‘రిస్క్‌’ని ఆశ్రయిస్తూ, సమస్యల్ని కొనితెచ్చుకుంటున్నారు.

ఒకదాని తర్వాత ఒకటి.. వరుస ఘటనలు జరగడంతో ఇప్పుడీ అంశం చర్చనీయాంశమవుతోందిగానీ.. నిజానికి సినిమాల కోసం హీరోలు రిస్క్‌ చేయడం కొత్తేమీ కాదు. అవును, రిస్క్‌ చేయకపోతే లైఫ్‌లో రస్క్‌ కూడా దొరకదు. ఇది నిజం.

సినిమా అయినా, ఇంకోటైనా.. రిస్క్‌ లేకపోతే ఎలా.? దేంట్లో అయినా రిస్క్‌ వుంటుంది. కానీ, అలా రిస్క్‌ చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా వుండాలి. మెగా పవర్‌ స్టార్‌ రామచరణ్‌ (Mega Power Star Ram Charan Tej), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే గాయపడ్డాడు.

జూనియర్‌ ఎన్టీఆర్‌దీ (Young Tiger NTR) ఇదే పరిస్థితి. అయితే, ఇద్దరూ సినిమాలో ఫిట్‌గా కన్పించేందుకు వర్కవుట్స్‌ చేస్తుండగా ఆ సమయంలో గాయపడటం గమనార్హం. రామ్‌చరణ్‌ (Ram Chran)కాలికి గాయమైతే, జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR Nandamuri Taraka Ramarao) చేతికి గాయమయ్యింది.

హీరో గాయపడితే.. అంతే సంగతులు.. (Injuries While Filming In Tollywood)

అలా, సినిమాలో నటిస్తోన్న ఇద్దరు ప్రముఖ హీరోలు గాయపడేసరికి, రాజమౌళి (SS Rajamouli) అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌ వాయిదా పడాల్సి వచ్చింది.

మరోపక్క, యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ (Sandeep Kishan) తన కొత్త సినిమా షూటింగ్‌ సందర్భంగా గాయపడ్డాడు. మెటల్‌ పార్టికల్స్‌ కొన్ని ఆయన (Sundeep Kishan) శరీరంలోకి చొచ్చుకుపోయాయట యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ జరుగుతుండగా.

అయితే, స్వల్ప గాయాలతోనే యువ హీరో సందీప్‌ కిషన్‌ బయటపడ్డాడుగానీ, అదే సమయంలో స్టంట్‌ మ్యాన్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

కాగా, మరో యువ హీరో నాగ శౌర్య (Naga Shaurya), ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డంతో అతను నటిస్తున్న ‘అశ్వద్ధామ’ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. దాదాపు నెల రోజులపాటు నాగ శౌర్య రెస్ట్‌ తీసుకోవాల్సిందేనని వైద్యులు వెల్లడించారు.

ఇటీవలే హీరో గోపీచంద్ సైతం ‘చాణక్య’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. వైద్య చికిత్స అనంతరం కోలుకుని, తిరిగి సినిమా పనుల్లో నిమగ్నమవనున్నాడు ఈ మాస్ హీరో.

శర్వానంద్ గాయం చాలా తీవ్రం.. (Injuries While Filming In Tollywood)

సరిగ్గా ఈ టైమ్‌లోనే, యంగ్‌ హీరో శర్వానంద్‌ (Sharwanand) కూడా గాయపడ్డాడు. అందరిలోకీ శర్వానంద్‌ అతి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. స్కై డైవింగ్‌ చేస్తూ, ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడట శర్వానంద్‌.

ఇది కూడా ’96’ సినిమా రీమేక్‌ కోసం జరుగుతున్న సన్నాహాల సందర్భంగా కావడం గమనార్హం. శర్వానంద్‌కి 11 గంటలపాటు వైద్యులు సర్జరీ చేశారంటే, ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా వుందో అర్థం చేసుకోవచ్చు. మూడు నెలలపాటు శర్వానంద్‌కి విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు.

ఆయా హీరోలు గాయపడ్డం, సినిమా షూటింగ్‌లు అలస్యమవడం అంటే కోట్ల రూపాయలతో ముడిపడి వున్న వ్యవహారాలవి. రిస్క్‌ చేయకపోతే లైఫ్‌లో రస్క్‌ కూడా దొరకదన్న మాటెలా వున్నా, రిస్క్‌ తగ్గించుకుంటే నిర్మాతల నెత్తిన పాలు పోసినవారవుతారు యంగ్‌ హీరోలు.

నిజమే, హీరో గాయపడితే.. ఆ సినిమా కోసం పనిచేసినవారందరి పరిస్థితీ అగమ్యగోచరంగా తయారైపోతుంది. షూటింగ్ సమయంలోనే కాదు.. షూటింగ్ కి వెళుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన ప్రమాదాలు.. ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం.

తాజాగా టీవీ కమెడియన్ చలాకీ చంటి (జబర్దస్త్ ఫేం) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అంతకు ముందు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, షూటింగ్ కోసం వెళుతుండగా, అతని కారుకి పెద్ద ప్రమాదమే జరిగింది. కానీ, వరుణ్ ఎలాంటి గాయాలూ లేకుండా బయటపడ్డాడు ఆ ప్రమాదం నుంచి.

చిరంజీవి, మోహన్ బాబు మాటలు అక్షర సత్యం.. (Injuries While Filming In Tollywood)

మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినీ పరిశ్రమలో రిస్కీ సీన్స్ విషయంలో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. కానీ, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కావొచ్చు, తనయుడు చరణ్ కావొచ్చు.. రిస్కీ సీన్స్ చేస్తే.. ‘అవి చూడ్డానికి బాగుంటాయి.. నిర్మాతలు మాత్రం ఇబ్బంది పడతారు.. స్వానుభవంతో చెబుతున్న మాటలివి..’ అనేవారు.

డాన్స్ చేస్తున్నప్పుడు మోకాలి చిప్పలు పగిలిపోయి.. రక్తం కారుతున్నా చిరంజీవి డాన్స్ ఆపేవారు కాదట. అయితే, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థతులు వేరని ఆయనే చెబుతుంటారు.

ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు తన కుమారుల్ని ఇదే విషయమై హెచ్చరిస్తుంటారు. ‘మీ రిస్క్‌లు తెరపై చూడ్డానికి బాగుంటాయి. కానీ, నిర్మాతలకు అవి ఇబ్బందిగా మారకూడదు..’ అని చెబుతుంటారాయన తన కుమారులు విష్ణు, మనోజ్‌లకి.

విష్ణు కూడా ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్‌ సందర్భంగా గాయపడ్డాడు. మనోజ్‌ సంగతి తెల్సిందే. యంగ్‌ హీరోల్లో అత్యంత ఎక్కువగా రిస్క్‌లు చేసేది మనోజే.

ఇప్పుడంటే సినిమాలు తగ్గించేశాడుగానీ, చేసే ప్రతి సినిమాకీ యాక్షన్‌ తనే సొంతంగా చేసుకోవడానికి ఇష్టపడ్తాడు మనోజ్‌. ఈ క్రమంలో చాలా ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటుంటాడు.

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ మాత్రమే కాదు.. పాత కాలం హీరోలూ గాయపడ్డారు షూటింగ్ జరుగుతున్న సమయంలో. నిర్మాతలు, తమ హీరోలు గాయపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ప్రమాదకరమైన సన్నివేశాల్లో డూప్ అవసరం తీసుకుంటారు.

చేతికి దెబ్బ తగిలినా డ్యాన్స్ మానని స్టైలిష్ స్టార్..

అన్నట్టు, అల్లు అర్జున్ ‘వరుడు’ సినిమా సమయంలో గాయపడినా, చేతికి బ్యాండేజ్ వేసుకునే.. ఓ పాటలో డ్యాన్స్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దెబ్బ తగిలిన చేతిపై పెద్దగా ఒత్తిడి లేకుండా డ్యాన్స్ కంపోజ్ చేయించుకున్నాడు అల్లు అర్జున్ ఆ పాటకి.

అన్నట్టు హీరోలే కాదు, హీరోయిన్లు కూడా షూటింగ్ సందర్భంగా గాయాలపాలైన ఘటనలున్నాయి. ఆకాశంలో సగం.. అన్నింటా సగం కదా మరి.. రిస్కీ సీన్స్ చేయడానికి హీరోయిన్లూ, హీరోలతో పోటీ పడుతున్నారు.

ఆదా శర్మ, తాప్సీ, శ్రద్ధా కపూర్.. ఇలా చెప్పకుంటూ పోతే, షూటింగ్ కోసం ప్రమాదవశాత్తూ గాయపడ్డ హీరోయిన్ల సంఖ్య తక్కువేమీ కాదు.

ఒక్కోసారి, ‘డూప్‌లు’ పెట్టుకునే అవకాశమున్నా, హీరోలు స్వయంగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో కొంత రిస్క్‌ తీసుకుంటే వచ్చే కిక్కే వేరప్పా. కానీ, ఆ రిస్క్‌ తేడా కొడితే మాత్రం.. ఆ కిక్‌ అస్సలు భరించలేమప్పా.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group