Ronth Telugu Review.. ఇద్దరు పోలీసులు.. అందులో, ఒకరు కొత్తగా ఉద్యోగంలో చేరిన డ్రైవర్. ఇంకొకరు సీనియర్ పోలీస్ అధికారి. ఇద్దరూ కలిసి, పెట్రోలింగ్ వాహనంలో రాత్రంతా డ్యూటీ చేస్తారు.
పోలీస్ ఉద్యోగమంటేనే, అనేక సవాళ్ళతో కూడిన ఓ బాధ్యతాయుతమైన పని. ఇద్దరూ బాధ్యతాయుతమైన పోలీసులే. సీనియర్ – జూనియర్ మధ్య చిన్నపాటి ఇగో క్లాష్ కూడా ఆ పెట్రోలింగ్లోనే వుంటుంది.
ఓ పోలీసుకి ఇంట్లో ఓ చిన్న సమస్య. మరో పోలీసుకి ఇంట్లో మరో సమస్య. కానీ, ఆ సమస్యల్ని పక్కన పెట్టి, పెట్రోలింగ్ చాలా పకడ్బందీగా నిర్వహిస్తారు.
పిల్లాడిని చావగొడుతున్న తండ్రికి బుద్ధి చెబుతారు ఓ సందర్భంలో. లేచిపోయిన ప్రేమ జంటని, సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కి చేరుస్తారు.
మానసిక స్థితి సరిగ్గా లేని ఓ తండ్రి నుంచి, అతని బిడ్డను కాపాడతారు మరో సందర్భంలో. కొంచెం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.. కొంచెం స్లోగానూ అనిపిస్తుంది.. అలానే, వేగంగానూ నడుస్తుంది.
ఎలాగైతేనేం, డ్యూటీ ముగించుకుని.. ఇద్దరూ తమ తమ ఇళ్ళకు వెళతారు. అంతలోనే, పిడుగులాంటి వార్త. అసలేంటది.? అదే అసలు ట్విస్ట్.!
Ronth Telugu Review.. మలయాళ సినిమాల ప్రత్యేకత అదే..
మలయాళ సినిమాలు లిమిటెడ్ బడ్జెట్లో తెరకెక్కుతాయి. టెక్నికల్‌గా బావుంటాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే వుంటుంది. కొంచెం స్లో పేస్ కూడా చూస్తుంటాం.
కానీ, మలయాళ సినిమాల్లో ‘నిజాయితీ’ కనిపిస్తుంది. సహజత్వానికి చాలా దగ్గరగా వుంటాయి మలయాళ సినిమాలు. ‘రోంత్’ కూడా ఆ కోవలోకే వస్తుంది.
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇలా దేనికదే, కథని బాగా ఎలివేట్ చేశాయి. ఇద్దరి మధ్యా సంభాషణ బాగా కుదిరింది. మంచి నటులు కావడంతో, ప్రతి సన్నివేశాన్నీ రక్తికట్టించారు.
గాలివానలో, మామిడి చెట్టు నుంచి కాయలు రాలి పడితే, పెట్రోలింగ్ వాహనాన్ని అక్కడ ఆపి, మామిడి కాయల్ని తీసుకుని, తన ఇంటికి తీసుకెళతానని జూనియర్‌తో సీనియర్ పోలీస్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అవసరమా థ్రిల్లింగ్ సినిమాలో ఇలాంటి సన్నివేశం.? అనిపిస్తుందిగానీ.. అంతలోనే, బావుంది కదా.. అనిపిస్తుంది.
పెట్రోలింగ్ సమయంలో, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే, ఇద్దరు పోలీసులు, పోలీస్ స్టేషన్లోనే మందు కొట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, అదే పెద్ద ట్విస్ట్ సినిమాకి.. అని, చివరిదాకా చూస్తే అర్థమవుతుంది.
పోలీసు శాఖలో వ్యవహారాలు ఎలా వుంటాయి.? కొత్తగా చేరేవారి పరిస్థితి ఏంటి.? సీనియర్ల ప్వర్తన వారిలో ఎలా వుంటుంది.? ఇవన్నీ, ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు.
తెలుగులో కూడా ఇలాంటివి వస్తే..
ఇలాంటి సినిమాలు మన తెలుగులో ఎందుకు రావు.? ఫలానా హీరో అయితే ఈ పాత్ర బాగా చేస్తాడు కదా.? ఫలానా హీరో అయితే, ఆ పాత్రకు బాగా సూటవుతాడు కదా.. అనిపించడం మామూలే.
కొంచెం గ్లామర్ యాడ్ చేయాల్సింది.. హీరోయిన్ పెడితే కలర్ఫుల్గా వుండేది.. ఇలా అనుకోవడం మలయాళ సినిమాలు కొన్ని చూసినప్పుడు అనిపిస్తుంటుంది.
పోనీ, ఓ లేడీ పోలీసుని అయినా పెట్టి, పెట్రోలింగ్ వాహనంలో రొమాంటిక్ ట్రాక్ నడిపించి వుండొచ్చు కదా.. అనిపిస్తుంటుందేమో కొందరికి.. ఈ తరహా సినిమాలు చూస్తున్నప్పుడు.
కానీ, అలాంటివేవీ లేకుండానే మలయాళ సినిమాల్ని గ్రిప్పింగ్‌గా నడిపిస్తుంటారు. తీరిగ్గా వున్నప్పుడు, ఓ లుక్కేయాల్సిన సినిమా ఇది.
కాకపోతే, క్లయిమాక్స్ చూశాక.. చాలా సేపు ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. ముగింపు అలా ఇవ్వడం ద్వారా, ఆ ఇంపాక్ట్ మన మీద ఎక్కువ వుండేలా చేయడం కొందరు దర్శకుల ప్రత్యేకత.
అందుకే, ఈ తరహా థ్రిల్లర్స్ చూడటానికి, ఓటీటీ ఆడియన్స్ (మరీ ముఖ్యంగా తెలుగు సినీ అభిమానులు) బాగా ఇష్టపడుతున్నారు.
