సినిమా పరిశ్రమ కరోనా దెబ్బకి కనీ వినీ ఎరుగని రీతిలో నష్టపోయింది. ఎలాగోలా మళ్ళీ పట్టాలెక్కేందుకు సినీ పరిశ్రమ ప్రయత్నిస్తున్న వేళ అర్థం పర్థం లేని వివాదాలు తెరపైకొస్తున్నాయి. సాధారణంగా ఏదన్నా పెద్ద సినిమా వస్తోందంటే చాలు, వివాదాల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసేవారు (RRR Controversy) తయారవుతుంటారు.
గతంలో ఇలా చాలా సినిమాలకు సమస్యలొచ్చాయి. ‘సైరా నరసింహారెడ్డి’ విషయంలోనూ, ‘గద్దలకొండ గణేష్’ విషయంలోనూ వివాదాలు చూశాం. ‘వాల్మీకి’ అనే పేరు పెట్టారు ‘గద్దలకొండ గణేష్’ సినిమాకి తొలుత. కానీ, వివాదాల నేపథ్యంలో టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడిక ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాపై వివాదం (RRR Controversy) మొదలైంది.
‘కొమురం భీం’ పాత్రలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ఓ గెటప్‌లో ముస్లిం యువకుడిగా చూపించడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రగానీ, ఎన్టీఆర్ నటిస్తోన్న కొమురం భీం పాత్రగానీ కల్పితం తప్ప, నిజ జీవిత పాత్రలు కావని మొదటి నుంచీ దర్శకుడు రాజమౌళి చెబుతున్నాడు.
ఆయా గొప్ప వ్యక్తుల స్ఫూర్తితో మాత్రమే ఈ పాత్రలు రూపొందుతున్నాయి. రామరాజు ఇంట్రో ప్రోమో కావొచ్చు, కొమురం భీం ఇంట్రో ప్రోమో కావొచ్చు చెబుతున్నది అదే. చరణ్ అల్లూరి సీతారామరాజులా కన్పించలేదు, కొమురం భీంలా ఎన్టీఆర్ కూడా కనిపించలేదు.
మరెందుకు వివాదం.? అసలు సినిమాలో ఏం వుంటుందో తెలియకుండానే కొందరు రచ్చకెక్కి ఫ్రీ పబ్లిసిటీ పొందుతున్నారు. ఇప్పుడీ కొమురం భీం అభిమానులమంటూ నానా యాగీ చేస్తున్నవారిదీ అదే తీరు. సినిమాల్ని సర్వనాశనం చేసెయ్యాలన్న ఆలోచన తప్ప, ఇలాంటి వారికి వేరే ఆలోచన వుంటుందని అనుకోలేం.
‘సైరా నరసింహారెడ్డి’ విషయంలోనూ అదే నిరూపితమయ్యింది. ‘గద్దలకొండ గణేష్’ విషయంలోనూ అదే ప్రూవ్ అయ్యింది. సినిమా పరిశ్రమ కరోనా దెబ్బకి తీవ్రంగా నష్టపోయింది.. ఇప్పుడీ వివాదాలతో పరిశ్రమకు ఇంకా నష్టం చేయాలనుకోవడం ఎవరికీ తగదు.