చాలా ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Sarileru Neekevvaru Vijayashanthi) ఆటిట్యూడ్‌లో అస్సలేమాత్రం తగ్గడం లేదట. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్, ఆ ఆటిట్యూడ్ అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా ఉన్నాయంటూ ‘సరిలేరు నీకెవ్వరూ..’ గురించిన అప్‌డేట్‌ని అభిమానులతో పంచుకున్నాడు.
ఈ తతంగంలో ఆటిట్యూడ్ ప్రస్థావన ఎందుకొచ్చిందో కానీ, అదే, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహేష్ (Super Star Mahesh Babu) హీరోగా తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరూ..’ సినిమా షూటింగ్‌లో భాగంగా, విజయశాంతి చాన్నాళ్ల తర్వాత తొలిసారిగా కెమెరాని ఫేస్ చేశారు.
రాజకీయ రంగ ప్రవేశం తర్వాత సినిమాల్ని లైట్ తీసుకున్న విజయశాంతి, ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో ఓ సూపర్ హిట్ సినిమా నుండి ఎత్తేసిన ఓ సీన్ విజయశాంతి మీద చిత్రీకరిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
అదెంత నిజమో కానీ, దాదాపు దశాబ్ధంన్నర తర్వాత విజయశాంతిని మళ్లీ వెండితెరపై చూసే అవకాశం వస్తుండడం, అభిమానులకు బోలెడంత కిక్ ఇస్తుంది. మరోపక్క విజయశాంతి, రాజకీయాల్లోకి వెళ్లి, కేవలం తెలంగాణాకే పరిమితమైపోయారంటూ ఓ చర్చ జరుగుతోంది. ఆ మాటకొస్తే, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు.
నో డౌట్, ఒకప్పుడు విజయశాంతికి విపరీతంగా ఫాలోయింగ్ ఉండేది. ఆ ఫాలోయింగ్ ఇప్పటికీ అలాగే ఉందా.? అనేది అప్పుడే చెప్పలేం. మరోపక్క తనకు షూటింగ్ స్పాట్‌లో లభించిన ఆహ్వానం చాలా బావుందంటూ, స్పందించిన విజయశాంతి క్లైమేట్ మారిపోయినట్లు ఆటిట్యూడ్ మారదని పేర్కొనడం దుమారం రేపుతోంది.
తొలుత బీజేపీలో పని చేసిన విజయశాంతి (Sarileru Neekevvaru Vijayashanthi), ఆ తర్వాత సొంత కుంపటి పెట్టారు. అదే ‘తల్లి తెలంగాణా’ పార్టీ. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో కలిశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో ప్రస్థావిస్తూ, విజయశాంతి ఆటిట్యూడ్‌ని ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయం వేరు. సినిమా వేరు. అప్పటికీ, ఇప్పటికీ విజయశాంతి స్టార్‌డమ్‌లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.