Table of Contents
Sembi Telugu Review.. మెయిన్ రోల్ ముసలమ్మది కదా.! అయినాగానీ, గాల్లోకి ఎగిరి ఫైటింగులు చేసెయ్యాలి.. లేదా, సినిమా అంతా రోదిస్తూ వుండాలి.!
ఓ చిన్న పిల్లపై అఘాయిత్యం.! ఆ ఘోరాన్ని ఇంకా ఘోరంగా చూపిస్తేనే కదా.. ‘కిక్కు’ వుండేది.?
సినిమాలో ఓ హీరో కూడా వున్నాడండోయ్.! సో, అతనికి జోడీగా ఓ గ్లామరస్ హీరోయిన్ కూడా వుండాలి. హీరో ఏమో, ఫైటింగులు చేసెయ్యాలి.!
అత్యంత క్రూరమైన విలన్లు.. మంచోళ్ళని అత్యంత కిరాతకంగా వేధిస్తుండాలి.. తెరపై రక్తపాతం జరిగి వుండాలి.! ఛేజింగులు గట్రా అదిరిపోవాలి.!
ఇది కదా.. సాధారణ సినిమా అంటే..
కానీ, పైన చెప్పుకున్నవేవీ లేవు ‘సెంబి’ సినిమాలో. కోవై సరళ మనకు తెలిసిన నటి. అంతే, మిగతా వాళ్ళెవరూ మన తెలుగు ప్రేక్షకులకి తెలిసినోళ్ళు కాదు.
అసలిది తెలుగు సినిమానే కాదు. ఓటీటీ పుణ్యమా అని అన్ని భాషల్లోకీ డబ్ అయ్యింది.. అందరికీ అందుబాటులో వుంది.!
తన మనవరాలిపై జరిగిన అఘ్యాయిత్యం నేపథ్యంలో.. ఆ బాలిక అమ్మమ్మ పడే ఆవేదన, ఈ క్రమంలో ఆమెకు ‘సామాన్యులు’ చేసిన సాయమే ఈ ‘సెంబి’ సినిమా.
బస్ జర్నీ..
పోలీసుని నమ్మితే, తన మనవరాలి శీలానికి వెలకట్టేస్తాడు. వాడి నుంచి తప్పించుకునే క్రమంలో.. తప్పనిసరై, ఆ ‘ముసల్ది’ గాయపరుస్తుంది, మనవరాల్ని తీసుకుని పారిపోతుంది.
పోలీసుల వెతుకులాట.. తప్పించుకునేందుకు అమ్మమ్మ చేసే ప్రయత్నం. ఈ క్రమంలో దేవుడే పంపినట్టు వచ్చే ఓ బస్సు.. అందులో భిన్న రకాలైన మనస్తత్వాలున్న వ్యక్తులు.
బస్సు డ్రైవర్ సహా.. దాదాపు అందరూ, జరిగిన ఘోరాన్ని అర్థం చేసుకునేలా పలు సంఘటనలు.. వాళ్ళంతా ఆ అభాగ్య చిన్నారకి న్యాయం చేసేందుకు ప్రయత్నించడం.
ఓ న్యాయవాది ఆమె కోసం చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో అతనికి అదే బస్సులో వున్నవారంతా చేసే సాయం.. న్యాయమూర్తి జరిగిన ఘటనలోని ‘లోతుని’.. నేరం తాలూకు తీవ్రతను అర్థం చేసుకుని తీర్పునివ్వడం.!
కథ.. కత్తి మీద సాము చేయలేదు..
కథ అందరికీ తెలిసిందే.. కథనం కూడా కత్తి మీద సాములా ఏమీ లేదు. మామూలుగా నడుచుకుపోయిందంతే. చిన్న చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ లాంటివి.. ఛేజింగుల్లాంటివి.. అంతే.
ఆహ్లాదం కలిగించే సన్నివేశాలు.. సన్నితమైన హాస్యం.. వీటికీ ప్రాధాన్యత వుంది. మంచి మ్యూజిక్.. సన్నివేశాల్లోని లోతుని ఇంకా బాగా ఎలివేట్ చేసే నేపథ్య సంగీతం. అన్నీ అద్భుతం అంతే.
Also Read: సినిమాల వల్ల జనం చెడిపోతారా.? బాగుపడతారా.?
పెద్దగా వంక పెట్టడానికేం లేవు.. ఎందుకంటే, మనం కూడా కాస్సేపు ఆ బస్సులోని ప్రయాణీకులమైపోతాం.. ఆ పాపకు న్యాయం జరగాలనుకుంటాం.
కామెడీ పరంగా ‘అతి’ చేసే కోవై సరళ.. చాలా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇవ్వడం గమనార్హం. నటిగా ఆమె పట్ల గౌరవం మరింత పెరుగుతుంది ఈ సినిమా చూశాక.
Sembi Telugu Review.. సినిమానే.. కానీ, జీవితం.!
చిన్నారి చాలా బాగా చేసింది. ప్రభు సోలమన్.. ఎక్కడా ‘అతి’ అన్న ప్రస్తావన రాకుండా చూసుకున్నాడు. ఓవరాల్‌గా ప్రభు సోలమన్ నుంచి వచ్చిన ఓ బ్యూటిఫుల్ ప్రోడక్ట్.!
గడ్డి పరకలు అన్నీ కలిస్తే మదగజాన్ని బంధించగలవనీ.. చలి చీమలు కాల సర్పాన్ని చంపేయగలవనీ.. వింటుంటాం. ఈ సినిమా సారాంశం కూడా అదే.!
ఒకరికొకరు సాయం చేసుకుంటే.. సాటి మనిషిని ఆదుకోవచ్చు.. ఆ వ్యక్తి ఎంత కష్టంలో వున్నా.. గెలిపించొచ్చు.!
జరిగిన ఘటన ఏంటో తెలియకుండా, వక్రీకరణలకు దిగేవారు.. ఎవరేమైపోతున్నా మాకేంటి సంబంధం అనుకునేవాళ్ళు.. ఇలాంటోళ్ళు సమాజానికి తాము ఏం ఇస్తున్నాం.? అని ప్రశ్నించుకునేలా చేసే సినిమా ఇది.