Table of Contents
వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌లో భాగంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడాన్ని చాలామంది ఇష్టపడుతున్నారు. కొండ కోనల్లోనూ, సముద్ర తీర ప్రాంతాల్లోనూ సేద తీరడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. అతి త్వరలో కొత్త ట్రెండ్‌లోకి (Space Tourism Space X) అడుగు పెట్టబోతున్నాం.
ఇకపై వీకెండ్ ఎంజాయ్‌మెంట్ అంటే, సరదాగా కాస్సేపు చంద్రుడి మీదకు వెళ్ళొచ్చేస్తామేమో. ఆశ దోశ అప్పడం వడ.. ఒక్కరోజులోనో, రెండు మూడు రోజుల్లోనో పూర్తయిపోయే టూర్లు కావవి. పైగా, అవి సామాన్యులకి ఇప్పట్లో అందుబాటులోకి రావడం అసాధ్యమే.!
స్పేస్ ఎక్స్.. దారి చూపుతోంది..
అయితే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ‘స్పేస్ ఎక్స్’ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూనే వుంది. అంతరిక్షాన్ని టూరిజం స్పాట్‌గా మార్చేయాలన్నది స్పేస్ ఎక్స్ లక్ష్యంగా కనిపిస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడాది చివర్లో తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్ర.. అదీ ఓ సామాన్యుడి విహార యాత్ర… జరగబోతోంది. మొత్తం ముగ్గురు సామాన్యుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళాన్నది స్పేస్ ఎక్స్ ప్లాన్. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ ప్రకటించారు.
మొత్తం ఐదుగురు వ్యక్తులు స్పేస్ ఎక్స్ క్యాప్స్యూల్ ద్వారా అంతరిక్షంలోకి వెళతారు. ఇందులో ఇద్దరు పైలెట్లు వుంటారు. నిజానికి, అత్యంత కఠినతరమైన శిక్షణ తీసుకుంటే తప్ప, అంతరిక్షంలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఆ స్థాయి శిక్షణ సామాన్య ప్రయాణీకులకూ అందించబోతుండడమే విశేషమిక్కడ.
ఆ మాత్రం రిస్క్ చేయకపోతే ఎలా.? (Space Tourism Space X)
ఎంజాయ్‌మెంట్ కోసం ఆ మాత్రం రిస్క్ చేయలేమా.? సముద్రపు లోతుల్ని చూసేస్తున్నాం.. ఆకాశపుటంచుల్ని చూడాలనుకోవడం తప్పెలా అవుతుంది.? స్పేస్ ఎక్స్ క్యాప్స్యూల్ ద్వారా అంతరిక్షంలోకి వెళతాం సరే, అక్కడి నుంచి ఎలా తిరిగొస్తాం.? అంటే, సముద్రంలో ఆ క్యాప్స్యూల్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యేలా ఇప్పటికే ఎన్నో విజవంతమైన ప్రయోగాలు చేపట్టింది స్పేస్ ఎక్స్.
అంతరిక్షంలోకి స్పేస్ క్రాఫ్ట్‌లు వెళ్ళడం, తిరిగి అవి భూమ్మీదకు క్షేమంగా రావడం, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరగడం.. ఇవన్నీ తెలిసిన విషయాలే. పూర్తి ప్రమాద రహితంగా రూపొందించబడిన క్యాప్స్యూల్స్ ద్వారా ఇకపై ప్రైవేటు అంతరిక్ష యాత్రలు.. అదీ విహార యాత్రలు జరిగేందుకు వీలు కలుగుతోందన్నమాట.
ఇప్పటికైతే అత్యంత ఖరీదైన వ్యవహారమేగానీ..
ప్రస్తుతానికి అత్యంత ఖరీదైన వ్యవహారంగా ఈ అంతరిక్ష విహార యాత్రలు వుండబోతున్నాయి. కానీ, భవిష్యత్తులో సామాన్యులకు కాకపోయినా.. ఓ మోస్తరుగా డబ్బున్నోళ్లకి ఈ అంతరిక్ష విహార యాత్రలు అందుబాటులోకి వచ్చేస్తాయ్. హనీమూన్ కోసం మాల్దీవులో, ఇంకొక చోటికో వెళుతున్న సెలబ్రిటీలు ఎక్కువగా అంతరిక్ష యాత్రల గురించి ఆలోచించే అవకాశాలెక్కువగా వున్నాయి.
తొలుత సాధారణ అంతరిక్ష విహార యాత్రలు.. ఆ తర్వాత చంద్రుడి మీదకో, అంగారకుడి మీదకో వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ‘విడిది’ చేసి, భూమ్మీదకు రావడం.. ఇవన్నీ ముందు ముందు నిజమయ్యేలానే (Space Tourism Space X) వున్నాయ్.