Table of Contents
Srikakulam Temple Stampede.. భక్తుల ప్రాణాలకు అస్సలు విలువ లేదు.!
భక్తిని వ్యాపారంగా మార్చేశాక, భక్తుల నుంచి వచ్చే కాసుల మీద యావ తప్ప, భక్తుల భద్రత గురించిన ఆలోచన ఎందుకు వుంటుంది.?
తిరుపతిలో తొక్కిసలాట.. సింహాచలంలో తొక్కిసలాట.. తాజాగా, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట.!
పోతున్నాయ్.. భక్తుల ప్రాణాలు పోతున్నాయ్.! అయినా, భక్తుల భద్రత పట్ల ఎవరికీ బాధ్యత వుండటంలేదు.
Srikakulam Temple Stampede.. ప్రైవేటు దేవాలయమట.!
ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వచ్చింది. తొక్కిసలాట జరిగిన దేవాలయానికి, దేవాదాయ ధర్మాదాయ శాఖతో సంబంధం లేదని.
ప్రైవేటు వ్యక్తులు నిర్మించి, ప్రైవేటు వ్యక్తులే నిర్వహిస్తున్న దేవాలయంలో తొక్కిసలాట జరిగిందని ప్రభుత్వం చెబుతోంది.
మరి, తిరుపతిలో తొక్కిసలాట సంగతేంటి.? సింహాచంలలో తొక్కిసలాట మాటేమిటి.? ఇవి రెండూ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోనివే కదా.?
ఇక్కడ, ఈ విషయంలో.. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కాదు.. దుర్మార్గుడు.! ముమ్మాటికీ, ‘పాపం మూటగట్టుకోవాల్సిందే’.! ఇంకో మాటకు తావు లేదు.
బాధ్యత ఎవరిది.?
కార్తీక మాసం.. శనివారం.. భక్తులు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పోటెత్తారు. దేవస్థాన నిర్వాహకులు, పోలీసులకు కనీసపాటి సమాచారం కూడా ఇవ్వలేదట.
ఇదే విషయాన్ని దేవాలయ నిర్వాహకులు స్వయంగా సెలవిచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేదంటున్నారు దేవాలయ నిర్వాహకులు.
కానీ, సదరు దేవాలయానికి ప్రతి శనివారం భక్తులు ఎక్కువగా వెళతారన్న కనీసపాటి పరిజ్ఞానం స్థానిక పోలీసులకు లేకపోవడం శోచనీయం.
భక్తుల భద్రతపై అధికారులు ఎందుకు ముందుగా ఆరా తీయలేకపోయారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
శవ రాజకీయం మొదలు..
ఇంకోపక్క, ‘కాదేదీ రాజకీయానికి అనర్హం’ అన్నట్లు.. రాజకీయ గద్దలు వాలిపోయాయ్.. శవాల దగ్గర.! ఓ రాజకీయ నాయకుడు, వైద్యుడిగా మారిపోయి చికిత్స అందించేశాడట.
ఇది ప్రభుత్వ వైఫల్యం.. అని ఇంకొకాయన రాజకీయ విమర్శలు మొదలు పెట్టాడు.! ఒక్కటి మాత్రం నిజం.. పోయిన ప్రతి ప్రాణానికీ.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలకి వుంది.
అదే సమయంలో, భక్తులు.. జనం ఎక్కువగా గుమికూడే దేవాలయాకు వెళ్ళేటప్పుడు.. స్వీయ క్రమశిక్షణ పాటించాలి. తోపులాటలకు ఆస్కారమివ్వకూడదు.
