Street Dogs And Humanity.. మనిషిని మనిషే చంపుకు తింటున్న రోజులివి.! కుక్కలు మనుషుల్ని చంపేయడంలో వింతేముంది.? అలా తయారైంది పరిస్థితి.!
సాటి మనిషి మీద ప్రేమ, దయ.. చచ్చిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో, కుక్కల మీద కొందరు మనుషులకు ప్రేమ ఎక్కువైపోవడం వింతే మరి.!
వీధి కుక్కల కారణంగా చిన్న పిల్లలు బలైపోతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. కారణాలు ఏంటి.? అని విశ్లేషిస్తే, బోల్డన్ని కనిపిస్తాయి.
మనుషులు తినే తిండి ఎలాగైతే మారిపోయిందో, వీధి కుక్కలకు దొరుకుతున్న తిండి కూడా అలానే మారిపోయింది. ఫలితంగా, కుక్కల ప్రవర్తనలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి.
మరి, వీధి కుక్కల్ని ఎవరు అదుపు చేయాలి.? నిజానికి, అది ప్రభుత్వాల బాధ్యత. అదే సమయంలో, కొంత బాధ్యత మన మీద కూడా వుంది కదా.!
ప్రభుత్వం తరఫున, కుక్కల్ని నియంత్రించడానికి సిబ్బంది వస్తే, వీధి కుక్కల్ని ఇళ్ళల్లో దాచేసేవాళ్ళు చాలామందే వున్నారు.

ఇంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాల్ని వీధి కుక్కలకు పెడితే, విశ్వాసంగా పడుంటాయి.. రాత్రిళ్ళు కాపలా కాస్తాయనే నమ్మకం చాలామందికి వుంది. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.
అలా వీధి కుక్కల నియంత్రణకి మనమే అడ్డుపడుతున్నాం. మళ్ళీ ఏదన్నా అనుకోని ఘటన జరిగితే, ప్రభుత్వాల మీద నిందలేస్తాం.
ఈ భూమ్మీద బతికేందుకు మనిషికి ఎంత హక్కు వుందో, కుక్కలకీ అంతే హక్కు వుంది. కానీ, మనుషుల్ని కుక్కలు చంపేస్తోంటే, తప్పదు.. మనం బతకడానికి, వాటిని చంపాల్సిందే.
సర్వోన్నత న్యాయస్థానం వీధి కుక్కల నియంత్రణ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ‘కుక్కల ప్రేమికులు’ నిరసన గళం విప్పుతున్నారు.
సినీ నటీమణులు రేణు దేశాయ్, రష్మి గౌతమ్ తాజాగా ఓ ప్రెస్ మీట్ పెట్టి, ‘కుక్కలపై అమితమైన ప్రేమ’ని చాటుకున్నారు. ఈ క్రమంలో ఆవేశంతో కొన్ని మాటలు కూడా విసిరేశారు.
మాట్లాడిన మంచి విషయాలన్నీ పక్కన పడేసి, దొర్లిన రెండు మూడు పొరపాటు మాటల్ని మీడియా ఎటూ హైలైట్ చేస్తుందనుకోండి.. అది వేరే సంగతి.
రేణు దేశాయ్ పిల్లలపైనా, రేణు దేశాయ్ మీదా.. అలానే రష్మి గౌతమ్ మీదా.. వ్యక్తిగత దూషణలు సోషల్ మీడియా వేదికగా పతాక స్థాయికి చేరుకున్నాయి.
ఇదీ సంగతి.! ముందు మనిషి మారాలి. వీధి కుక్కల విషయంలో ఒకింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.! ప్రభుత్వాలకీ సహకరించాలి.!
అన్నట్టు మనుషుల్లో మంచీ చెడూ వున్నట్లే.. కుక్కల్లో కూడా అగ్రెసివ్‌గా కొన్ని వుంటాయనీ, అలాంటి వాటి విషయంలో తనకు సమాచారం ఇస్తే, వచ్చి తీసుకెళ్ళిపోతానంటున్నారు రేణు దేశాయ్. సాధ్యమేనా అది.?
జంతువుల విషయంలో సంస్కృతీ సంప్రదాయాలు వదిలేసి, మీరంతా మా బట్టల దగ్గరే ఆగిపోయాంటూ రష్మి గౌతమ్ చిత్రమైన వ్యాఖ్యలు చేసింది. అసందర్భ ప్రేలాపనే ఇది.
