భారతదేశ రాజకీయాల్లో ‘ట్రబుల్ షూటర్’ అంటే కేవలం ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) మాత్రమే. రెండు సార్లు ప్రధాన మంత్రి పదవికి దగ్గరగా వెళ్ళినా ఆ పదవి ఆయనకు అందని ద్రాక్షే అయ్యింది. అయితేనేం, దేశ ప్రధమ పౌరుడిగా పనిచేసే అద్భుత అవకాశాన్ని (Pranab Mukherjee The Trouble Shooter) దక్కించుకున్నారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరన్న వార్త.. 130 కోట్ల మంది భారతీయుల్ని కలచివేసింది. కొందరి విషయంలో అంతే.. దేశం ఓ గొప్ప నాయకుడ్ని కోల్పోయిందన్న భావన కలుగుతుంది. అలాంటి అతికొద్దిమందిలో ప్రణబ్ ముఖర్జీ ఒకరు. ఆర్థిక మంత్రిగా ఆయన దేశానికి అందించిన సేవలు అత్యద్భుతం.
రాజకీయ చాణక్యుడిగా ప్రణబ్ ముఖర్జీ పేరు దేశ రాజకీయాల్లో ఎప్పటికీ చెరిగిపోదు. ఎందుకంటే, ఆయన తప్ప.. అలాంటి చాణక్యం వున్న రాజకీయ నాయకుడ్ని ముందు ముందు మనం చూడలేం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ.. అదే ఆ పార్టీకి శాపం. అలా కాంగ్రెస్ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రతిసారీ, ప్రణబ్ ముఖర్జీ.. ఆ సమస్యల నుంచి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించారు.
ఏ విషయం అయినా సూటిగా కుండబద్దలుగొట్టేయడం ప్రణబ్ ముఖర్జీకి వెన్నతో పెట్టిన విద్య. చెప్పుకుంటూ పోతే ఆయన సాధించిన విజయాలు చాలానే కన్పిస్తాయి. ఎంత ఎదిగినా ఒదిగి వుండడం అనేది కొందరికే చెల్లుతుంది. అలాంటి మహనీయుల్లో ప్రణబ్ ముఖర్జీని కూడా ఒకరుగా చెప్పుకోవచ్చు.
‘రెస్ట్ ఇన్ పీస్’ అని మాత్రమే కాదు మనం ఈ సందర్భంలో చెప్పాల్సింది. ‘థ్యాంక్యూ దాదా’ అని. అవును, ప్రణబ్ ముఖర్జీని ‘దాదా’ అని పిలుస్తుంటారు. ఆయనకి ఇప్పుడు మనమంతా ‘థాంక్యూ’ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే, ఆయన దేశానికి అందించిన సేవలు అలాంటివి మరి.
దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాను ఆర్థిక మంత్రిగా వున్న సమయంలో ప్రణబ్ దాదా తెచ్చిన సంస్కరణలు అన్నీ ఇన్నీ కావు. అవి ప్రపంచ పటంలో భారతదేశానికి ప్రత్యేక స్థానం కల్పించాయని చెబుతారు ఆర్థిక రంగ నిపుణులు.
కాంగ్రెస్ వాది అయినా, కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళి, కొత్త పార్టీ పెట్టిన ప్రణబ్ (Pranab Mukherjee The Trouble Shooter), ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చి, మళ్ళీ తన సత్తా చాటారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరై, కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్దషాకే ఇచ్చారు.. అయితే, అది రాష్ట్రపతిగా రిటైర్ అయ్యాక.. అందునా ఎన్డీయే హయాంలో.
ఏదిఏమైనా, దేశం ఓ గొప్ప నాయకుడ్ని కోల్పోయింది. భారత జాతి రత్నాల్లో ప్రణబ్ ముఖర్జీ కూడా ఒకరు.