Table of Contents
The Kashmir Files Telugu Review: కశ్మీర్ అందానికి ప్రపంచంలో మరే ఇతర ప్రాంతమూ పోటీకి రాలేదు. అదీ మన ‘కశ్మీరం’ ప్రత్యేకత.
అయితే, ఆ అందమైన కశ్మీరం వెనుక చరిత్రకి తెలిసిన రక్తపాతం, చరిత్రకెక్కని మారణహోమం వున్నాయ్. ఆ బాధ అనుభవించినోడికే తెలుస్తుంది. ఆ దారుణం కళ్లారా చూసినవారికి జీవితకాల గాయమది.
తరచూ మీడియాలో కనిపించే వార్తల్లో కశ్మీర్ అల్లకల్లోలం గురించి మాత్రమే తెలుసుకున్నాం. కానీ, తెలుసుకోవల్సింది చాలా వుంది. కశ్మీర్ యువత ఎలా తీవ్రవాదం వైపు మళ్లిందో చెబుతూ, ఎన్నో సినిమాలొచ్చాయ్.
The Kashmir Files Telugu Review.. చీకట్లో దాగిన నిజం.. వెలుగులోకి వచ్చిన వైనం.!
చాలా అరుదుగా మాత్రమే కశ్మీర్ వెనుక అసలు చీకటి కోణం సినిమాల్లోనో, మీడియాలోనో కనిపించీ, కనిపించనట్లుగా ప్రస్థావించారేమో. కొన్నాళ్ల క్రితం తెలుగులో ఓ సినిమా వచ్చింది. ఆది సాయికుమార్ హీరోగా నటించిన సినిమా అది. అందులో ఓ కశ్మీరీ పండిట్ కుటుంబం పడ్డ నరక యాతన కనిపిస్తుంది. కానీ, సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా, ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. సినిమాలో నటించిన నటీనటులు ఎలా చేశారు.? అన్న విషయం పక్కన పెడితే, కశ్మీరీ పండిట్లు మరీ ఇంతటి దుర్భరమైన పరిస్థితుల్ని అనుభవించారా.? అనే ఆవేదన, భయంతో కూడిన ఆశ్చర్యం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.
కశ్మీర్ లోయ అనగానే అమాయక చిన్నారుల్ని ఎత్తుకెళ్లి, విషపు మాటలు చెప్పి కన్నతల్లిలాంటి భారతావనిని కాటేసే కాలకూట విష సర్పాల్లా మార్చే తీవ్రవాదమే గుర్తుకొస్తుంది. కానీ, ఆ కశ్మీర్ లోయలో తీవ్రవాదులు సృష్టించిన మారణ హోమం కశ్మీరీ పండిట్ల కుటుంబాల్ని ఛిద్రం చేసిన పైశాచికత్వం గురించి ప్రపంచానికి పెద్దగా తెలియలేదు ఇప్పటిదాకా.
The Kashmir Files Telugu Review.. మాటలకందని పైశాచికత్వమది.!
ఇప్పుడు ఈ ‘ది కశ్మీర్ ఫైల్స్’.. అప్పట్లో జరిగిన ఆ దారుణాల్ని కళ్లముందుంచింది. వున్నది వున్నట్లుగా, జరిగింది జరిగినట్లుగా.. అలా ఎలా తీయగలిగారు.? స్ర్కీన్ మీద నుంచి కళ్లు పక్కకి తిప్పడం సాధ్యపడదు. కన్నీళ్లు అలా జాలువారుతూనే వుంటాయ్ సినిమా చూస్తున్నంతసేపూ. ఆ కళ్లని తుడుచుకోవడానికి కూడా ఇష్టపడలేం.
కశ్మీరీ పండిట్ల కుటుంబాల్లో మగవాళ్లని చంపేసి, ఆడవాళ్లపై అత్యంత పైశాచికత్వంతో కామ వాంఛలు తీర్చుకుని వాళ్లని కేవలం తీవ్రవాద భావజాలంతో దేశాన్ని నాశనం చేసే తీవ్రవాదుల్నికని పెట్టే యంత్రాలుగా.. సరిగ్గా చెప్పాలంటే బానిసల్లా మార్చేశారు.
ఇవన్నీ సినిమా చూశాకా కూడా మనల్ని వెంటాడతాయ్. వాటి గురించి గుర్తు తెచ్చుకుని మరీ కన్నీళ్లు పెడతాం. అసలివన్నీ ఇన్నాళ్లూ బాహ్య ప్రపంచానికి ఎందుకు తెలియలేదు.? ఇదొక మిస్టరీ.
The Kashmir Files.. ప్రపంచం చూడని కన్నీటి గాధలవి.!
ఒకరు కాదు, ఇద్దరు కాదు, పది మంది కాదు.. పాతిక మంది కాదు, వెయ్యి మంది కాదు.. పది వేల మంది కాదు, లక్షలాదిమంది కశ్మీరీ పండిట్లు అత్యంత దుర్భరమైన జీవితాల్ని అనుభవించారు. లక్షల మంది క్రూరాతి క్రూరంగా చంపివేయబడ్డారు.
Also Read: మూడో ప్రపంచ యుద్ధం.! మానవ జాతి వినాశనం.!
ఎలాగోలా బతికిన ఆ కొద్ది మంది కశ్మీరీ పండిట్లు స్వదేశంలో కాందశీకుల్లా బతికారు. కన్నభూమిపై మమకారం చంపుకోలేక తమని తాము క్రూర మృగాల వేటకు బలి చేసుకోలేక కశ్మీరీ పండిట్లు పడ్డ నరకం మాటల్లో వర్ణించలేనిది. సినిమాలో కనిపించింది నూటికి నూరు శాతం వాస్తవం.
ప్రపంచానికి తెలియాల్సింది ఇంకా చాలానే.!
కానీ, కశ్మీరీ పండిట్లు పడ్డ నరక యాతనలో ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలిసింది అర శాతం కూడా కాదు. ప్రపంచం కనీ వినీ ఎరుగని చీకటి కోణమిది. దీన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files Telugu Review) బృందానికి కన్నీళ్లతో హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.!
నిజానికి ఇది సమీక్ష కాదు.! పైశాచికత్వం అత్యంత రాక్షసంగా ఆడిన నెత్తుటి క్రీడలో అకారణంగా అసువులు బాసిన కశ్మీరీ పండిట్ల కుటుంబాలకి కన్నీటి నివాళి.!
– yeSBee