Three Capitals Ys Jagan.. పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి కూడా, అసెంబ్లీకి వెళ్ళడానికి మొహం చాటేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
అంతెందుకు, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వుండేందుకే వైఎస్ జగన్ ఇష్టపడటం లేదు.
పొలిటికల్ టూరిస్ట్ తరహాలో.. వారానికోసారి ఆంధ్ర ప్రదేశ్‌కి వచ్చి వెళుతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీన్ని తప్పించుకు తిరగడం.. అనే కదా అనాలి.?
అసలు విషయం వేరే వుంది.! వైఎస్ జగన్ తప్పించుకు తిరుగుతున్నది, రాజధాని అమరావతి విషయంలో కూడా. అదే ఇక్కడ ఇప్పుడు మనం చర్చించుకుంటున్న అంశం.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై స్మశానం అనీ, ఎడారి అనీ, ముంపు ప్రాంతం అనీ, కమ్మరావతి అనీ.. వైఎస్ జగన్ అండ్ టీమ్ మోపిన నిందలు అన్నీ ఇన్నీ కావు.
అదే అమరావతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వుంటున్నారు.. అమరావతి పరిధిలోని తాడేపల్లిలోనే కదా వైఎస్ జగన్ ప్యాలెస్ కట్టుకున్నదీ.. దాన్నే కదా క్యాంప్ కార్యాలయంగా మార్చుకుని, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించింది.
అయినాగానీ, అమరావతి మీద తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో బురద చల్లించారు వైఎస్ జగన్, తమ పార్టీ నాయకులతో.
ఐదేళ్ళపాటు తమ హయాంలో రాజధాని అమరావతికి సంబంధించి ఒక్క నిర్మాణం తాలూకు పనులు కూడా ముందుకు కొనసాగనివ్వలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఇంతకీ, మూడు రాజధానుల వ్యవహారంపై వైసీపీ తన పంథా మార్చుకుందా.? ఇది కూడా వైఎస్ జగన్ స్పష్టతనివ్వడంలేదు.
మొన్నటికి మొన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, మూడు రాజధానుల అంశంపై మీడియా నుంచి ప్రస్తావన వచ్చింది.
ప్రెస్ మీట్ అంటే, వైసీపీ ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిథులే వుంటారు.. వారిలోనూ ఒకరు ధైర్యం చేసి, ఆ ప్రశ్న అడిగారు. కానీ, ఆ ప్రశ్నకీ వైఎస్ జగన్ సమాధానమివ్వలేదు.
‘టైమ్ అయిపోయింది..’ అని చెప్పి వెళ్ళిపోయారు వైఎస్ జగన్. ఎందుకిలా, మూడు రాజధానుల అంశంపై వైఎస్ జగన్ తప్పించుకు తిరుగుతున్నట్లు.?
విశాఖలో కాపురం పెడతా.. అని గతంలో చెప్పిన వైఎస్ జగన్, ఇంకా అదే మాటకు కట్టుబడి వున్నారా.? వుంటే, తాడేపల్లి నుంచి విశాఖకు ఈపాటికే మకాం మార్చి వుండాలి కదా.?
అన్నట్టు, తాడేపల్లి నుంచి బెంగళూరుకి వైఎస్ జగన్ పూర్తిగా మకాం మార్చే ప్రయత్నాల్లో వున్నారనే ప్రచారం జరుగుతుండడం కొసమెరుపు. అంటే, ఏపీ రాజకీయాల్ని వైఎస్ జగన్ వదిలేస్తునట్లేనా.?
అది ఇంకోసారి చర్చించుకుందాం.
