Table of Contents
Thug Life Telugu Review.. మణిరత్నం సినిమా అంటే ఏంటి.? ఒకప్పుడు ఆయన సినిమా అంటే, భాషతో సంబంధం లేకుండా ఆదరించేవాడు సగటు సినీ ప్రేక్షకుడు.
సాధారణ ప్రేక్షకుడికే కాదు, ఇంటలెక్చువల్స్.. అనదగ్గ ప్రేక్షకుల్ని కూడా మణిరత్నం సినిమాలు అలరించేవి. ప్రతి ఫ్రేమ్.. చాలా అందంగా వుండేది.
ప్రతి డైలాగ్‌లోనూ ‘మణిరత్నం మార్క్’ వుండేది. ప్రతి పాటలోనూ, ‘మణిరత్నం స్పెషల్ బ్యూటీ’ వుండేది. వాట్ నాట్.. సినిమాలో, మొదటి నుంచి చివరిదాకా మణిరత్నమే.!
Thug Life Telugu Review.. థగ్ లైఫ్.. కథా కమామిషు ఏంటి.?
అతనో గ్యాంగ్‌స్టర్ లాంటోడు. అతనికో నమ్మిన బంటు.! నమ్మినోళ్ళే అంతమొందించాలని చూస్తారు. కానీ, చావుని ప్రతిసారీ ఆ గ్యాంగ్‌స్టర్ జయించేస్తుంటాడు. ఇదే కథ.
తన కారణంగా ఓ వ్యక్తి చనిపోవడం, అతని కొడుకుని తన అనుచరుడిగా మార్చుకుని, కొడుకులా చూసుకోవడం.. ఇదంతా కథలో మరో కీలక అంశం.
విశ్వనటుడు కమల్ హాసన్ వున్నారు. శింబు వున్నాడు.. నాజర్, అభిరామి, ఐశ్వర్యలక్ష్మి.. ఇలా తారాగణం బాగానే వుంది. మణిరత్నం సినిమాలో నటీనటులంటే, ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టేస్తారు.
సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ మణిరత్నం మార్క్ టాలెంటెడ్ పీపుల్ వున్నారు. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లు తయారైంది.
ఎగిరెగిరి.. ఆ ఫైటింగులేంటి కమల్.?
ఆ వయసులో కమల్ హాసన్ అలా ఎగిరెగిరి ఫైట్లు చేసేస్తోంటే నమ్మేలా వుండాలి కదా.? అనే డౌట్ రావడం మామూలే. ఏం, ఎందుకు చేయకూడదు.. అనేవాళ్ళూ లేకపోలేదు.
కాకపోతే, పాత్రకి ఓ వయసు.. ఆ పాత్రకి రేంజ్.. ఇవన్నీ వుండాలి. దానికి అనుగుణంగానే సన్నివేశాలు రాసుకోవాలి.. యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో ఇంకా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి.

వయసు మీద పడినా, కమల్ హాసన్‌లో వేగం తగ్గలేదని అనుకోగలమా.. ఆ ఫైట్స్ చూస్తే.? ప్చ్.. కష్టమే. కమల్ హాసన్ చాలా సినిమాల్లో తన నటనతో చికాకు పుట్టించేస్తారు. ఇందులోనూ అంతే.
ఎందుకో, కమల్ హాసన్‌తో కొందరు దర్శకులు ‘అతి’ చేయిస్తుంటారు. ఇక్కడా అదే జరిగింది. మణిరత్నంతోపాటు, ఈ సినిమాకి కమల్ హాసన్ కూడా రచన పరంగా ఓ చెయ్యేశారాయె.
బోల్డన్ని సినిమాలు గుర్తుకొస్తాయ్..
‘థగ్ లైఫ్’ చూస్తున్నంతసేపూ, చాలా సినిమాల్లోని సన్నివేశాలు మదిలో మెదులుతూ వుంటాయి. ఈ సన్నివేశం దండగ, ఈ యాక్షన్ బ్లాక్ వృధా.. ఇలా అనిపిస్తుంటుంది సినిమా చూస్తున్నంతసేపూ.
నిజానికి, స్క్రీన్ ప్లే పరంగా జాగ్రత్తలు తీసుకుని వుంటే, ‘థగ్ లైఫ్’ మంచి టెంపోతో సాగేదే. మంచి విజయాన్ని అందుకునేదే.! కానీ, సాగదీత.. అక్కడక్కడా సినిమా పూర్తిగా ఆగిపోయినట్లనిపిస్తుంటుంది.
మంచు కింద కూరుకుపోయి, ఆ తర్వాత ఎక్కడో బౌద్ధుల చికిత్సతో ఆరోగ్యం కుదటపడ్డం.. ఆ తర్వాత, ఫైట్స్‌లో విపరీతమైన స్పీడు చూపించడం.. ఇవన్నీ అస్సలు కమల్ హాసన్ గెటప్‌కి సెట్ అవలేదు.
అస్సలు తగ్గేదే లే..
క్లయిమాక్స్ ముందర అయితే, డాక్టర్ వైద్య చికిత్స చేసి, మత్తు ఇంజెక్షన్ ఇచ్చాక కూడా.. కమల్ హాసన్, బీభత్సమైన ఫైట్లు చేసేస్తాడు.. అదెలా సాధ్యమో ఏమో.
కమల్ హాసన్ నుంచీ, మణిరత్నం నుంచీ రావాల్సిన సినిమానే కాదిది. సినిమా రిజల్ట్ ముందే అర్థమయిపోయిందో ఏమో, కన్నడ పంచాయితీ పెట్టుకున్నాడు కమల్.
ఆ కన్నడ వివాదం కూడా, ‘థగ్ లైఫ్’ సినిమాని కాపాడలేకపోయింది. విశ్వనటుడి డిజాస్టర్ సినిమాల లిస్టులో ‘థగ్ లైఫ్’ కూడా ఒకటి.!
‘విక్రమ్’ లాంటి హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా చేసిన కమల్ హాసన్ నుంచి, ఇలాంటి సిల్లీ సినిమానా.? ప్చ్.. టూ బ్యాడ్.!