Table of Contents
Ustaad Bhagat Singh Review.. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్.. కాంబినేషన్.. సరిగ్గా ఆరేళ్ళ క్రితం మొదలైన ప్రయాణమిది.!
దర్శకుడు హరీష్ శంకర్‌తో, పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా నిర్మించనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ 2020 ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
2019 ఎన్నికల్లో జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయాక, అసలు సినీ రంగంలోకి తిరిగి ఆయన వస్తారా.? లేదా.? అన్న గందరగోళంలో ప్రకటితమైన సినిమా ఇది.
అంతకన్నా ముందే, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవన్ కళ్యాణ్‌తో సినిమాని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యింది. అడ్వాన్స్ తీసుకున్నారు గనుక, సినిమాకి పవన్ కళ్యాణ్ కమిట్ అవ్వాల్సి వచ్చింది.
ఇంతలోనే, కోవిడ్ వచ్చేసింది.. సినిమా అస్సలు ముందుకు కదల్లేదు. రీమేక్ ఆరోపణలు, ‘భవదీయుడు భగత్ సింగ్’ కాస్తా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా మారడం.. ఇవన్నీ తెలిసిన విషయాలే.
Ustaad Bhagat Singh Review.. ఓ వైపు కోవిడ్.. ఇంకో వైపు రాజకీయం..
2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, తాను పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, 100 శాతం స్ట్రైక్ రేట్‌తో జన సేన పార్టీని మొత్తం 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో గెలిపించుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడటం, అందులో పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషించడం, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా సేవలందిస్తుండడం ఇవన్నీ తెలిసిన సంగతులే.
ఉప ముఖ్యమంత్రి అయ్యాక, తీరిక చూసుకుని అంతకు ముందు ఒప్పుకున్న సినిమాల్ని ఒకటొకటిగా పూర్తి చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. అలా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా పూర్తయి, ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇంత ఉపోద్గాతం ఎందుకు అవసరమయ్యిందంటే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి సగటు ప్రేక్షకుడు ఏం ఆశిస్తాడు.? సగటు పవన్ కళ్యాణ్ అభిమాని ఏం ఆశిస్తాడన్నదానిపై క్లారిటీ కోసమే.
హరి హర వీర మల్లు.. ఓజీ.. ఇప్పుడేమో ఉస్తాద్ భగత్ సింగ్..
ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డాక, సినిమాలు థియేటర్లలోకి రావడానికి తెగ భయపడుతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. అలాంటిది, పవన్ కళ్యాణ్ సినిమాలు ఎడా పెడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయ్.
‘హరి హర వీర మల్లు’, ‘ఓజీ’ సినిమాలు వచ్చాయి.. పెయిడ్ నెగెటివిటీని తట్టుకుని, ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్నాయ్. ‘హరి హర వీర మల్లు’ సినిమా కంటే, చాలా పెద్ద హిట్ అయ్యింది ‘ఓజీ’.
మరి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటి.? రీమేక్ సినిమా.. అనే ప్రచారం నేపథ్యంలో ప్రీ రిలీజ్ బజ్.. అనుకున్నంతగా రాలేదు. థియేటర్లలో బొమ్మ పడ్డాకనే, ‘ఇది రీమేక్ కాదు’ అని ప్రూవ్ అయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ముందు రోజు పడలేదు.. టిక్కెట్ ధరల పెరుగుదల దిశగా తెలంగాణలో ప్రయత్నాలూ జరగలేదు.
సినిమా ఎలాగైతేనేం, ఉగాది పండగ రోజున ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. పెయిడ్ నెగెటివిటీ మామూలే. సినిమా అదిరిపోయిందంటూ.. అభిమానులు, సినిమాని కాపాడుకునే ప్రయత్నం చేయడమూ మామూలే.
కథ కొత్తది కాదు గానీ..
కథ కొత్తదేమీ కాదు. సంభాషలణల్లో హరీష్ శంకర్ మార్క్ కనిపించింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకి బోల్డంత ఎనర్జీని ఇచ్చింది.
‘హరి హర వీర మల్లు’, ‘ఓజీ’ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్కి స్కోప్ తక్కువ. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రం పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్.
అయితే, ఐటమ్ సాంగ్ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ రిస్క్ చేయలేదు. డ్యూయెట్ సాంగ్స్ విషయంలోనూ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయాడు హరీష్ శంకర్.
డ్యూయెట్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ వుంటే.. మరింత కమర్షియల్ వాల్యూ అదనంగా వచ్చి వుండేది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి.
ఏపీ డిప్యూటీ సీఎం కదా, పవన్ కళ్యాణ్‌తో నాలుగు మంచి మాటలు చెప్పించే ప్రయత్నం చేసినందుకు దర్శకుడు హరీష్ శంకర్‌ని అభినందించి తీరాలి.
తన డాన్సుల మీద తానే సెటైర్లు వేసుకునేలా పవన్ కళ్యాణ్‌తో ఎంటర్టైనింగ్ సీన్స్ తీసినందుకూ దర్శకుడు హరీష్ శంకర్‌ని అభినందించకుండా వుండలేం.
దేవిశ్రీ, తమన్.. సరిపోలేదు.!
మ్యూజిక్ విషయంలో మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ఇంకాస్త ‘మనసు పెట్టి’ వుండాల్సింది. చివరి నిమిషంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్. తనవరకూ చేయాల్సిందంతా చేశాడు.
ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలేనా.? ఎప్పుడూ పొలిటికల్ వార్తలేనా.? అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తే బావుణ్ణు.. అంటూ, అభిమానులు కోరుకుంటున్న దరిమిలా, ఆ కోరిక తీర్చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
జన సేన కార్యకర్తల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త ఊపు తీసుకొస్తుందన్నది నిర్వివాదాంశం. యాక్షన్ సీక్వెన్సెస్, ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్.. ఇవన్నీ అభిమానుల్ని అలరిస్తాయ్.
పవన్ కళ్యాణ్ అంటే నచ్చనివాళ్ళకి, ఈ సినిమా నచ్చకపోవడంలో వింతేమీ లేదు. వాళ్ళ కోసం తీసిన సినిమా కాదు కూడా ఇది.
కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్..
కమర్షియల్‌గా చూసుకుంటే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్‌కి ముందే ప్రాఫిటబుల్ వెంచర్. అసలంటూ, అడ్వాన్స్ తప్ప పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తీసుకోలేదు.
ఆరేళ్ళ క్రితం ప్రారంభమైన ప్రాజెక్ట్ కాబట్టి, కథ కథనాల విషయంలో వంకలు పెట్టడానికేమీ లేదు. కోవిడ్ కాలంలో ఆగిన సినిమా కాబట్టి, చిన్నా చితకా మైనస్సుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలోకి ఎప్పుడొస్తుందో తెలియదు. సో, అభిమానులు రిపీట్ మోడ్‌లో వున్నారు. అందుకు తగ్గ కంటెంట్‌ని కల్ట్ దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చేశాడు.
ఇది పవన్ కళ్యాణ్ సినిమా.. తెరపై పవన్ కళ్యాణ్‌ని మాత్రమే చూస్తారు అభిమానులు. ఇతర నటీనటుల విషయానికొస్తే, శ్రీలీల నుంచి డాన్సుల్ని ఆశిస్తే, నిరాశ చెందాల్సిందే. రాశి కన్నా మమ అనిపించింది.
పార్దీబన్, కెఎస్ రవికుమార్, రావు రమేష్ తమ తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
చివరిగా.. ఇచ్చిపడేసిన హరీష్ శంకర్.. ఇరగదీసిన పవన్ కళ్యాణ్.!
