Vishwanath And Sons Suriya.. తమిళ నటుడు సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్న సినిమాకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే పేరు పెట్టారు.!
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుందీ సినిమా. అంటే, బైలింగ్వల్ సినిమా అన్నమాట. నిజానికి, దీన్ని పాన్ ఇండియా సినిమా.. అని కూడా అనొచ్చు.
తెలుగు నిర్మాణ సంస్థ, తెలుగు దర్శకుడితో తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి, సహజంగానే ఇది తెలుగు సినిమా.. అని అంతా అనుకుంటారు.
కానీ, ఇది తెలుగు సినిమా కాదు. తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూడాల్సిన పని లేదు. సినిమా విడుదలయ్యాక కూడా, థియేటర్లలో ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే, సినిమా టైటిల్‌ని ఇంగ్లీషులోనూ, తమిళంలోనూ మాత్రమే విడుదల చేశారు. అంటే, ఇది తమిళ – ఇంగ్లీషు.. ద్విభాషా చిత్రమన్నమాట.
Suriya Vishwanath And Sons.. తమిళంలో రాయగలిగి.. తెలుగులో రాయలేని దౌర్భాగ్యం..
అబ్బే, ఇంగ్లీషులో టైటిల్ పేర్కొన్నంతమాత్రాన, ఇది ఇంగ్లీషు సినిమా అయిపోదు. తెలుగులో చాలా సినిమాలకు ఇంగ్లీషు టైటిల్స్ వాడేశారు కదా.. అంటే, అదీ కరెక్టే.!
కానీ, ఇక్కడ సమస్య ఏంటంటే, తమిళంలో టైటిల్ రాయాలన్న సోయ నిర్మాతలకు వుందిగానీ, తెలుగులో టైటిల్ ప్రస్తావించాలన్న కనీస ఇంగితం లేకుండా పోయింది.
సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు, ఈ విషయమై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘ఓహో, ఈ సినిమా మాలాంటి తెలుగు సినీ ప్రేక్షకుల కోసం కాదన్నమాట’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నాడు.
సినిమాకి భాషా బేధం లేదు. తమిళ సినిమాల్నీ తెలుగులో ఆదరిస్తున్నాం. తమిళ హీరో సూర్యకి తెలుగునాట చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ వుంది.
నటుడిగా సూర్యకి, అతని తమ్ముడు కార్తీకి కూడా తెలుగులో బోల్డంతమంది అభిమానులున్నారు. సూర్య, కార్తీ.. తెలుగులో మాట్లాడతారు కూడా.
కార్తీ, స్ట్రెయిట్‌గా తెలుగు సినిమా ‘నా ఊపిరి’ చేశాడు గతంలో. మరిన్ని సినిమాలు చేయడానికీ సిద్ధంగా వున్నాడు. ఇక్కడ సమస్య సూర్యతో కాదు.
దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ.. ఇద్దరూ తెలుగువారే అయి వుండీ, తెలుగు పట్ల ఇంత చిన్న చూపు ఎందుకు ప్రదర్శించారన్నదే ఇక్కడ ప్రశ్న.
ఏమో, ముందు ముందు టైటిల్‌ని తెలుగులోనూ వదులుతారేమో. కానీ, ఈలోగా డ్యామేజ్ చాలా తీవ్రంగా జరిగిపోయినట్టే.!
