Table of Contents
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ‘సస్పెన్స్’ కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాస్‌ని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించడంతోపాటు, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మరికొందర్ని కూడా పోలీసులు ఇప్పటికే విచారించారు. వారి నుంచి కొంత సమాచారాన్ని రాబట్టి, ఆ సమాచారం ద్వారా మరింత లోతుగా ఈ కేసుని విచారిస్తున్నారు పోలీసులు. ఇంతకీ, జగన్‌పై దాడి కేసులో ఏది నిజం.? ఏది అవాస్తవం.?
దాడి నిజమేగానీ..
వైఎస్ జగన్‌పై (YS Jagan) హత్యాయత్నం జరిగిన మాట వాస్తవం. అయితే, దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ ఇప్పటికీ తాను వైఎస్ జగన్‌కి వీరాభిమానినని చెబుతున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని (YS Rajasekhar Reddy) దేవుడిలా పూజిస్తానని అంటున్నాడు. తనకు ప్రాణహాని వుందంటూ తాజాగా శ్రీనివాస్, పేర్కొన్నాడు. విచారణ సందర్భంగా అస్వస్థతకు గురైన శ్రీనివాస్‌ని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో, ‘ప్రజలతో మాట్లాడాలి.. నాకు ప్రాణహాని వుంది.. రాజకీయం చేస్తున్నారు..’ అంటూ అతను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
హత్యాయత్నం వెనుక వున్నదెవరు.?
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party).. ఈ రెండు పార్టీలూ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ హత్యాయత్నం వెనుక కుట్ర టీడీపీదేనని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే సానుభూతి కోసం హత్యాయత్నం కుట్రకు వ్యూహరచన చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ వాదనకు బీజేపీ (BJP) వంత పాడుతుండగా, ఈ ఘటనపై లోతైన విచారణ జరగాలనీ, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగిందని జనసేన పార్టీ (Jana Sena Party) అభిప్రాయపడుతోంది.
నిందితుడి లేఖతో గందరగోళం
నిందితుడు శ్రీనివాస్ (Srinivas) దగ్గర్నుంచి ఓ లేఖ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే ఆ లేఖ, దాడి సమయంలో శ్రీనివాస్ దగ్గర లేదన్నది వైఎస్సార్సీపీ నేతల వాదన. పైగా, జేబులో లేఖ వుంటే అది మడతలు పడకుండా వుండదనీ.. పోలీసులు చూపుతున్న లేఖ మడతల్లేకుండా వుండటంతోపాటుగా, ఆ లేఖలో చేతి రాత రెండు మూడు రకాలుగా వుందని వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. లేఖలో వాస్తవాల్నే విచారణ సందర్భంగా శ్రీనివాస్ చెబుతున్నట్లు పోలీసులు అంటున్నారు. దాంతో ఈ లేఖ ద్వారా కేసు కొలిక్కి రావడం సంగతెలా వున్నా, కొత్త అనుమానాలకు కారణమవుతోంది.
హత్యాయత్నం ఎవరికి లాభం.?
వైఎస్ జగన్‌పై (Ys Jagan)హత్యాయత్నం ద్వారా అధికార పార్టీకి లాభముండదనీ, పైగా రాజకీయంగా నష్టం చేకూరుతుంది కాబట్టి, ఇలాంటి ప్రయత్నాలు అధికార పార్టీ నుంచి ఎప్పుడూ జరగవని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే, రోజురోజుకీ ప్రజాబలంతో బలోపేతమవుతున్న వైఎస్ జగన్‌ని అడ్డుతొలగించుకునేందుకే టీడీపీ (TDP) కుట్రపన్నిందన్నది వైఎస్సార్సీపీ (YSRCP) ఆరోపణ. ఈ ఆరోపణల్లో నిజమెంతోగానీ, జరిగిన ఘటన మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని గత కొద్ది రోజులుగా హీటెక్కించేస్తూనే వుంది.
కోలుకుంటున్న వైఎస్ జగన్
హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న వైఎస్ జగన్, ప్రస్తుతం కోలుకుంటున్నారు. విశాఖ విమానాశ్రయంలో జగన్‌ని పరిశీలించిన వైద్యులు అర సెంటీమీటరు గాయమైనట్లు గుర్తించగా, సర్జికల్ ప్రొసిడ్యూర్ కారణంగా 3.5 సెంటీమీటర్ల మేర గాయం పెరిగిందని హైద్రాబాద్ వైద్యులు పేర్కొన్నారు. ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన జగన్, ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. నవంబర్ 3 నుంచి ఆయన తిరిగి ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అయితే, కొంత విశ్రాంతి జగన్‌కి అవసరం అనీ, కండరానికి తీవ్ర గాయం అయిన దరిమిలా, జాగ్రత్తగా వుండాలని వైద్యులు సూచించారు.
ఏదిఏమైనా, వైఎస్ జగన్ మీద జరిగిన హత్యాయత్నం అత్యంత దురదృష్టకరం. నిందితుడు ఎందుకు ఈ దాడి చేశాడు? అతని వెనుక ఎవరున్నారు? ఏ రాజకీయ ఉద్దేశ్యంతో ఈ దాడి జరిగింది? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి వుంది. అప్పటిదాకా ఈ ‘గాయం’ తాలూకు రాజకీయ దుమారం అమరావతి నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతూనే వుంటుంది.