YS Jagan Assembly Meetings.. ఎలాగైతేనేం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అదినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘అసెంబ్లీ’ గుర్తుకొచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్, తమ పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి అసెంబ్లీకి వెళ్ళనున్నారు.
ఇంతలోనే ఎంత మార్పు.? అసెంబ్లీకి వెళ్ళి ఏం చేయాలి.? అసెంబ్లీలో కంటే, మీడియా సమావేశం ద్వారానే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించగలమని చెప్పిన జగన్‌కి జ్ఞానోదయం ఎందుకు అయ్యింది.?
ఈ ప్రశ్నలు వైసీపీ శ్రేణుల్ని ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయంటే, దానిక్కారణం అసెంబ్లీ సమావేశాల విషయమై నిన్న మొన్నటిదాకా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన కుంటి సాకులే.
అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏమైంది.? అంటే, ఏమీ కాలేదు.! భయంతో కూడిన బాధ్యత గుర్తుకొచ్చిందాయనకి. భయం దేనికి.? బాధ్యత ఏమిటి.?
YS Jagan Assembly Meetings.. అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత తప్పదు.!
అసెంబ్లీకి గనుక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్ళకపోతే, శాసన సభ సభ్యత్వం రద్దవుతుందట.! ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు ఇటీవల స్పష్టం చేశారు.
పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మాత్రమే కాదు, వైసీపీకే చెందిన మిగతా పది మంది ఎమ్మెల్యేల శాసన సభ సభ్యత్వం కూడా ప్రమాదంలో పడుతుంది.
అందుకే, ఆ ఎమ్మెల్యేలు గుస్సా అవడంతో, వైఎస్ జగన్ కూడా మెట్టు దిగాల్సి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అద్గదీ అసలు సంగతి.

పులివెందుల ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి వెళ్ళి, తన నియోజకవర్గంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత జగన్ మీద వుంది.
అలానే, వైసీపీకి చెందిన మిగతా పది మంది ఎమ్మెల్యేలూ, తమను గెలిపించిన ప్రజల కోసం శాసన సభ్యులుగా, శాసన సభకు హాజరవ్వాల్సిందే.
పదకొండు కంటే దిగజారిపోతే.?
కేవలం 11 సీట్లే వున్నాయి, పైగా ప్రతి పక్ష హోదా కూడా లేదన్న కారణంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళేందుకు వైఎస్ జగన్ నిన్న మొన్నటిదాకా భయపడిన సంగతి తెలిసిందే.
ప్రతి పక్ష హోదా రాకపోయినా, ఎమ్మెల్యే పదవి అయినా మిగలాలన్న కోణంలో, అయిష్టంగానే అయినా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలనే ఆలోచన జగన్ చేయడం ఆహ్వానించదగ్గ విషయమే.
ఏమాత్రం బేషజానికి పోయినా, 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వస్తే, ఆ సంఖ్య ‘1’ అవుతుందో, 0 (సున్నా) అవుతుందోనన్న భయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుండటంలో వింతేముంది.?
ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, 18 సీట్లు వుంటే తప్ప ప్రతి పక్ష హోదా వుండదంటూ గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అప్పటి ప్రతి పక్ష నేత చంద్రబాబుని తూలనాడి వుండకూడదు.!
అప్పుడలా చంద్రబాబుని తూలనాడి, ఇప్పుడు 11 సీట్లతోనే ప్రతిపక్ష హోదా కావాలని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడగడం హాస్యాస్పదమే అయిపోయింది.
‘కర్మ’ ఎవర్నీ వదిలిపెట్టదు.. అంటే, ఇదేనేమో.!