Table of Contents
Ys Jagan Against Assembly.. శాసన సభ్యుడంటే ఎవరు.? ఓటర్లు, ఎన్నికల్లో గెలిపించిన వ్యక్తి.! అదే వ్యక్తి, ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, శాసన సభకు వెళ్లకపోతే.?
ఏముంది.? ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చని వ్యక్తి, చట్ట సభల్లో వుండటానికి వీల్లేదు.! స్వచ్ఛందంగా రాజీనామాలే చేస్తారో, లేదంటే స్పీకర్ రంగంలోకి దిగి అనర్హత వేటు వేస్తారో.! ఈ రెండిటిలో ఏదో ఒకటి జరగాలి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యుల గురించి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇది. వాస్తవానికి, అసెంబ్లీకి డుమ్మా కొట్టడం వైసీపీకి కొత్త కాదు.
గతంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్ి పాదయాత్ర పేరుతో, శాసన సభ సమావేశాలకు డుమ్మా కొట్టేశారు.
అసెంబ్లీలో తనకు అవమానం జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గతంలో అసెంబ్లీ సమావేశాలకు దూరమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
శాసన సభ కష్టం.. శాసన మండలి ఇష్టం.!
2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక, వైసీపీ పూర్తిగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. శాసన మండలి సభ్యులు మాత్రం, శాసన మండలి సమావేశాలకు హాజరవుతున్నారు.
ఎమ్మెల్యేలుగా పదవీ ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి హాజరయ్యాక, ఆ తర్వాత అసెంబ్లీ మొహం చూడలేదు వైఎస్ జగన్ సహా, వైసీపీకి చెందిన శాసన సభ్యులు.
వైఎస్ జగన్ సహా, వైసీపీ శాసన సభ్యులందరిపైనా అనర్హత వేటు పడుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెబుతున్నారు.
కానీ, నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయ్.. అనర్హత వేటు పడటంలేదు.
వారం వారం బెంగళూరు నుంచి వచ్చి, తాడేపల్లి నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం తప్ప, అసెంబ్లీ వపు చూడ్డానికీ ఇష్టపడటం లేదు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..
ఈ నేపథ్యంలోనే, రాష్ట్ర ప్రజల్లో శాసన సభ – శాసన సభ్యుల హాజరు.. అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పులివెందుల ప్రజలు సైతం, ఇదే విషయమై చర్చించుకుంటున్నారు.
అధికారంలో వున్నప్పుడు, శాసన మండలిని ఖర్చు దండగ వ్యవహారంగా అభివర్ణించిన వైసీపీ, ఆ శాసన మండలి రద్దుకి తీర్మానం కూడా చేసింది. ఆ శాసన మండలి లేకపోతే, వైసీపీ పరిస్థితి ఏంటిప్పుడు.?
చట్ట సభలకు వెళ్ళే ఆలోచన లేని వ్యక్తులు, అసలు ఎన్నికల్లోనే పోటీ చెయ్యకూడదు.. ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే, చట్ట సభలకు వెళ్ళి తీరాలి.. అంటూ జనంలో చర్చ బయల్దేరింది.
ప్రెస్ మీట్ పెడితే, అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించినట్లు అవుతుందా.? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుండా పోయింది వైసీపీ అధినేతకి.. అని జనం మాట్లాడుకుంటున్న పరిస్థితి.
పాదయాత్ర మొదలైతే..
అయినాసరే, బేఖాతర్.. అన్నట్లుంది వైసీపీ తీరు.! త్వరలో పాదయాత్ర.. అంటూ, వైసీపీ నుంచి ప్రకటనలు వస్తున్నాయ్. జగన్ పాదయాత్ర మొదలెడితే, అసెంబ్లీకి వెళ్లడం అనేది జరగదు.
ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తా.. అంటూ, బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తెరలేపారు వైఎస్ జగన్. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం చిన్న పిల్లాడిలా మారం చేయడమేంటో జగన్‌కే తెలియాలి.
ఒక్కటి మాత్రం నిజం.. వైఎస్ జగన్ సహా, వైసీపీ ఎమ్మెల్యలు అసెంబ్లీకి వెళ్ళకపోతే, వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కుని వైసీపీ కోల్పోతుంది.
ప్రజల్లో ఈ అంశంపై లోతైన చర్చ జరుగుతున్న దరిమిలా, రానున్న రోజుల్లో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకం కాబోతోంది.
