Ys Jagan Bhogapuram Airport.. విశాఖ సమీపంలోని భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయం నిర్మితమవుతోంది. గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది.!
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, జిల్లాకో విమానాశ్రయం (ఉమ్మడి జిల్లాలకు సంబంధించి) అనే ప్రతిపాదనని, చంద్రబాబు సర్కార్ తెరపైకి తెచ్చింది.
రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన విశాఖపట్నంలో ఇప్పటికే విమానాశ్రయం వుంది. అయితే, అది నేవీ అవసరాల కోసం నిర్మించబడింది.. కాలక్రమంలో అది.. సాధారణ ప్రయాణీకులతో కిటకిటలాడుతోంది.
ఈ నేపత్యంలో, ఇంకో విమానాశ్రయం అనేది విశాఖకే కాదు, మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతానికి అవసరమైంది. అనేక ప్రాంతాల్ని పరిశీలించి, భోగాపురంలో అయితే బావుంటుందన్న ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి.
చివరికి, భోగాపురం పేరు ఖరారయ్యింది.. భూ సమీకరణ – సేకరణ ప్రయత్నాలు జోరందుకున్నాయి. అప్పట్లో ప్రతిపక్ష నేతగా వున్న వైఎస్ జగన్, భోగాపురం విమానాశ్రయం అవసరమే లేదని తేల్చారు.
విశాఖ విమానాశ్రయం చుట్టు పక్కల 150 మైళ్ళ దూరంలో విమానాశ్రయం ఇంకోటి వుండకూడదని వైఎస్ జగన్ తేల్చి చెప్పిన వీడియోలు ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్ అవుతూనే వున్నాయి.
త్వరలో భోగాపురం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపత్యంలో, ఆ విమానాశ్రయం ఘనత తనదేనంటూ వైఎస్ జగన్ చెప్పుకుంటున్నారు.
వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్ళ నుంచి ఇదే విషయమై పెద్దయెత్తున పబ్లిసిటీ స్టంట్స్ నడుస్తున్నాయి. వైఎస్ జగన్ హయాంలో కూడా భోగాపురం విమానాశ్రయ పనులు జరిగాయి.
అమరావతిని ఆపేసినట్లు, భోగాపురం విమానాశ్రయ పనుల్ని వైఎస్ జగన్ ఆపేయలేదు. ఎందుకు ఆపలేదు.? అన్నది మళ్ళీ వేరే చర్చ.
రాజధానిని విశాఖకు మార్చాలన్న ఆలోచనతో, భోగాపురం విమానాశ్రయం మీద వైఎస్ జగన్ కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టి వుండొచ్చు.. అది వేరే చర్చ.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు సంస్థ.. ఇలా విమానాశ్రయ నిర్మాణంలో చాలా వ్యవహారాలుంటాయి.. అదంతా పెద్ద కథ.! విమానాశ్రయం వల్లే శంషాబాద్ ప్రాంతం హైద్రాబాద్‌లో అభివృద్ధి చెిందిందన్నది నిర్వివాదాంశం.
భోగాపురం ప్రాంతం, తద్వారా శ్రీకాకుళం అలానే విజయనగరం జిల్లాలు విశాఖతో సమానంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడింది.
అంతకుముందు చంద్రబాబు, ఆ తర్వాత జగన్ అయినా, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అయినా, ఆ తర్వాత ఇంకొకరైనా.. అభివృద్ధిలో భాగమవ్వాల్సిందే. క్రెడిట్ చోరీ.. అనేది హాస్యాస్పదం.
ఎవరి జేబుల్లోంచీ అభివృద్ధి కోసం రూపాయి తీసి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌కి కాస్త మినహాయింపు ఇవ్వాలి.
ఎందుకంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే, అవసరమైతే, జేబులోంచి తీసి ఖర్చు చేయగలరు.
సో, వైఎస్ జగన్ వున్నపళంగా ‘క్రెడిట్ చోరీ’ ఆలోచనల్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే, క్రెడిట్ చోరీకి పాల్పడితే ప్రజలు అసహ్యించుకుంటారు.
