Ys Jagan Coterie VSR.. రాజకీయ పార్టీలన్నాక, అధినాయకత్వానికి కోటరీ అనేది సర్వ సాధారణం. ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా.. ‘కోటరీ’ తప్పనిసరి.!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు గతంలో ‘కోటరీ’ అంటే, విజయ సాయి రెడ్డి మాత్రమే.! ఆ తర్వాత లెక్కలు మారాయ్.!
విజయ సాయి రెడ్డి స్థానంలోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి కూడా సైడయిపోయారన్నది వైసీపీ నాయకులు, కార్యకర్తలందరికీ తెలిసిన విషయమే.
ఎక్కడో వ్యవహారం తేడా కొట్టింది.. విజయ సాయి రెడ్డి వైసీపీకి దూరమయ్యారు.! ఇది రాజకీయం కాదు, యాపారం.! ఔను, తన వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బంది రాకుండా, వైసీపీని వీడారాయన.
Ys Jagan Coterie VSR.. విశ్వాసం, విధేయత..
వైసీపీని వీడినా, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల విజయ సాయి రెడ్డి ఇంకా అదే ‘విశ్వాసం’ ప్రదర్శిస్తున్నారా.? అంటే, ఔననే అనుకోవాలేమో.!
విశ్వాసం, విధేయతల్లో ‘విసారె’కి సాటి ఇంకెవరూ లేరని తాజాగా ఆయన వేసిన ఓ ట్వీట్‌తో నిరూపితమయ్యిందన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది.
‘‘అమ్ముడు పోయిన “కోటరీల” మధ్య “బందీలుగా” ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి’’ అంటూ విజయ సాయి రెడ్డి ఓ సలహా ఇచ్చారు.
‘‘వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు, ఇంతమంది చుట్టూ ఉన్నా, మిసైళ్ళు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా, ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ పేలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి? వారంతా అమ్ముడు పోవటమే కదా..’’ అన్నది విజయ సాయి రెడ్డి ట్వీటు తాలూకు పూర్తి సారాంశం.
ఇక్కడ, అమ్ముడుపోవడం గురించి విజయ సాయి రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన ట్వీటులో విజయ సాయి రెడ్డి ఎక్కడా వైఎస్ జగన్ ప్రస్తావన తీసుకురాలేదు.
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..
కానీ, విజయ సాయి రెడ్డి ట్వీటు తమ అధినేత జగన్ రెడ్డి గురించేనంటూ వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నాయి.
‘తిరిగి పార్టీలోకి వచ్చెయ్యండి..’ అంటూ కొందరు విజయ సాయి రెడ్డికి ఉచిత సలహా ఇస్తుండగా, ‘నువ్వే ఒకప్పుడు కోటరీ.. ఇప్పుడు నువ్వు కోటరీ గురించి మాట్లాడుతున్నావా.?’ అంటూ మండిపడుతున్నారు ఇంకొందరు.
ఎవరి గోల వారిదే.! వైఎస్ జగన్ త్వరలో పాదయాత్ర చేపట్టనున్న దరిమిలా, ఆ పాదయాత్రలో జగన్‌ని కలిసి వైసీపీలోకి విజయ సాయి రెడ్డి రీ-ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
కోటరీ.. అంటూ, సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా విసారె ఇచ్చిన బోడి సలహా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల అతి శ్రద్ధతోనే. అని సజ్జల గుర్తిస్తే ఏమవుతుందో ఏమో.!
