YS Jagan EVM Gola.. రోజులు గడుస్తున్నాయ్.. నెలలు గడుస్తున్నాయ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం, ఇంకా ‘ఈవీఎం లొల్లి’ కొనసాగిస్తూనే వుంది.!
2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయాన్ని ఆ పార్టీ నేతలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అధినేత వైఎస్ జగన్ సహా, వైసీపీ నాయకులంతా, తమ పార్టీ ఓటమికి ఈవీఎంలే కారణమని నమ్ముతున్నారు.
సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఆరోపణలు ప్రత్యారోపణలు సహజాతి సహజం. అలానే, బుకాయింపులు కూడా సర్వసాధారణం.
వైఎస్ జగన్ సహా వైసీపీకి మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలున్నారు. నలుగురు ఎంపీలు కూడా వున్నారు వైసీపీకి. వీళ్ళంతా గెలిచింది ఈవీఎంల మీదనే.
YS Jagan EVM Gola.. అదే లొల్లి.. ఇంకెన్నాళ్ళు.?
పోలింగ్ రోజున, పోలింగ్ సమయం ముగిశాక పెద్దయెత్తున రిగ్గింగ్ జరిగిందన్నది వైసీపీ నుంచి వస్తోన్న ప్రధాన ఆరోపణ. ఆంగ్ల మీడియాకి సంబంధించి ఇలాంటి వాటి కోసం పెయిడ్ వార్తలు రాసే సంస్థలుంటాయ్.
అలాంటి ఓ పెయిడ్ వ్యవహారం తాజాగా ఈవీఎం లొల్లికి కారణమైంది. అందులో కథనం రావడం, దాన్ని పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా టీమ్స్ రచ్చ చేయడం చూస్తున్నాం.
నిజానికి, ఓడిపోయాక.. మూడు నెలలకో.. ఆరు నెలలకో.. ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంటుంది.. ఓటమికి సంబంధించి. అలా ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడే, ఎక్కడ తప్పు జరిగిందో తెలుస్తుంది.
ఆత్మ విమర్శ ఇంకెప్పుడు.?
ఎప్పుడైతే, తమ తప్పుని తాము తెలుసుకుంటారో.. తిరిగి పుంజుకోవడానికి మార్గాలూ కనిపిస్తాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఇంతవరకు ఓటమిపై పోస్టుమార్టమ్ జరగలేదాయె.
ఇంకా పార్టీ శ్రేణుల్ని ‘ఈవీఎం వల్లే ఓటమి’ అనే మత్తులో వుంచడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సబబు కాదు. అది వైసీపీకి అస్సలేమాత్రం రాజకీయంగా మేలు చేయదు.
ఈవీఎం ట్యాంపరింగ్.. కుట్ర సిద్ధాంతాలు.. ఇవన్నీ వైసీపీని ప్రజల్లో పలచన చేస్తున్నాయ్.. జనం నవ్వుకుంటున్నారు వైసీపీ నాయకుల తీరు చూసి.
దాదాపు రెండేళ్ళు పూర్తవుతోంది 2024 ఎన్నికలు జరిగి. త్వరలో పాదయాత్ర చేపట్టడానికి వైఎస్ జగన్ సంసిద్ధమవుతున్నారు.
ఓటమికి కారణాలు విశ్లేషించుకుని, గెలవడానికి మార్గాల్ని వెతుక్కుంటే.. ప్రజలకు చేరువవగలుగుతారు పాదయాత్రలో.
లేదంటే, పాదయాత్రలో కూడా, వైఎస్ జగన్ ఈవీఎంల గురించే మాట్లాడితే.. ఇక అంతే సంగతులు.!
