9M730 Burevestnik SSCX9 Skyfall.. దీర్ఘ శ్రేణి క్షిపణి.. అదే, లాంగ్ రేంజ్ మిస్సైల్ గురించి వింటుంటాం.!
మిస్సైల్స్ తయారు చేసే సామర్థ్యమున్న దేశాలు, ఎప్పటికప్పుడు సరికొత్త మిస్సైళ్ళను తయారు చేస్తూనే వుంటాయి.
శతృ దేశాల నుంచి తమ దేశాన్ని రక్షించుకునేందుకు మాత్రమే కాదు, ఇదొక వ్యాపారం కూడా.! పైగా, ఆయుధ వ్యాపారం కొత్తదేమీ కాదు.!
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది సరికొత్త మిస్సైల్. ఎన్నో ఏళ్ళుగా ప్రయోగాలు విఫలమవుతూ వచ్చిన ఆ మిస్సైల్, ఈసారి సూపర్ సక్సెస్ అయ్యింది.
ఒక్కసారి ఆ మిస్సైల్‌ని సంధిస్తే, భూమిని చుట్టొచ్చేయగలదు.! రేంజ్‌తో సంబంధం లేదు. అన్‌లిమిటెడ్ రేంజ్ అన్నమాట.! ప్రస్తుతానికైతే, ‘కొంత దూరం’ వరకు మాత్రమే దాన్ని ప్రయోగించారు.
9M730 Burevestnik SSCX9 Skyfall.. రష్యా తయారీ.. ఇదొక సంచలనం.!
తయారు చేసిన దేశం రష్యా. ఆ మిస్సైల్ పేరు బ్యూరోవెస్టినెక్. ‘ఎస్ఎస్‌సి-ఎక్స్-9 స్కై ఫాల్’ అని కూడా పిలుస్తున్నారు దీన్ని.!
9ఎం730 బ్యూరెవెస్టినెక్ మిస్సైల్ ప్రత్యేకత ఏంటో తెలుసా.! ఇది న్యూక్లియర్ మిస్సైల్. అదేంటీ, ప్రపంచంలో న్యూక్లియర్ వార్ హెడ్స్ కలిగిన మిస్సైళ్ళు చాలానే వున్నాయ్ కదా.?
వున్నాయ్.. కానీ, బ్యూరెవెస్టినెక్ మిస్సైల్ ఈజ్ సమ్‌థింగ్ వెరీ వెరీ స్పెషల్. మిస్సైల్ ప్రొపెల్షన్‌లోనే వుంది ఆ ప్రత్యేకత. సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసిన రాకెట్ టెక్నాలజీ కాదిది.
న్యూక్లియర్ పవర్డ్ ప్రొపెలక్షన్ ఈ బ్యూరేవెస్టినెక్ ప్రత్యేకత. అంటే, ప్రొపెల్షన్ కోసం న్యూక్లియర్ పవర్‌ని వినియోగిస్తారు. ఇందుకోసం, ఓ చిన్న న్యూక్లియర్ రియాక్టర్‌ని ఈ మిస్సైల్‌లో వాడతారు.
ఆ న్యూక్లియర్ రియాక్టర్ నుంచి వెలువడే శక్తి, మిస్సైల్‌ని ముందుకు తీసుకెళుతుంది. మిస్సైల్ వేగం, గంటకి వెయ్యి కిలోమీటర్ల పైనే.! తక్కువ ఎత్తులో దూసుకెళుతుంది ఈ క్షిపణి.
అత్యంత ఖచ్చితత్వంతో, శతృవుల కంట పడకుండా దూసుకెళ్ళేలా బ్యూరేవెస్టినెక్ మిస్సైల్‌ని రూపొందించారు. ప్రయోగ పరీక్లలో భాగంగా మిస్సైల్‌ని 14 వేల కిలోమీటర్ల దూరం వరకు పంపించారు.
ప్రొపెల్షన్ అనేది న్యూక్లియర్ పవర్‌తో జరుగుతుంది గనుక, దీని రేంజ్ అన్‌లిమిటెడ్. అంటే, ప్రపంచంలో ఏ దేశం కూడా, ఈ మిస్సైల్ నుంచి తప్పించుకోలేదు.
మల్టిపుల్ వార్‌హెడ్స్‌ని ఒకే మిస్సైల్ నుంచి ప్రయోగించే అవకాశం ఎలాగూ వుంది గనుక, ఈ మిస్సైల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఇక అంతే సంగతులు.
సహజంగానే అమెరికా, ఈ మిస్సైల్ ప్రయోగం విషయమై రష్యా మీద గుర్రుగా వుంది. నిజానికి, అమెరికా కూడా ఎప్పటినుంచో ఇలాంటి మిస్సైల్ తయారీ కోసం ప్రయత్నిస్తూనే వుంది.
చిన్న న్యూక్లియర్ రియాక్టర్‌ని తయారు చేయడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ.. దానికి తోడు, మిస్సైల్ అనేది ప్రయోగ దశలో పేలితే, తద్వారా వచ్చే రేడియేషన్ అత్యంత ప్రమాదకరం.
ఈ కారణంగా, దశాబ్దాలుగా ఈ మిస్సైల్ తయారీ విషయమై రష్మా కూడా ఆచి తూచి వ్యవహరిస్తూ వచ్చింది. చివరికి అత్యంత సంక్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది రష్యా.
రష్యా మీద కసితో అయినా, అమెరికా కూడా త్వరలో ఇలాంటి మిస్సైల్‌ని తామూ చేశామని ప్రకటించేసుకోవచ్చు.
ఆ తర్వాత మిగతా న్యూక్లియర్ పవర్డ్ కంట్రీస్ కూడా ఈ తరహా మిస్సైళ్ళను సిద్ధం చేసుకుంటాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ఏదిఏమైనా, పెరుగుట విరుగుట కొరకే.! రక్షణ కోసం తయారు చేసుకుంటున్న ఆయుధాలు, మానవ వినాశనం దిశగా అడుగులేస్తున్నట్లే కనిపిస్తోంది పరిస్థితి.
న్యూక్లియర్ ప్రొపెల్షన్, న్యూక్లియర్ వార్ హెడ్.. వెరసి.. భూమిని చుట్టొస్తుందనే సంబరం కాదిక్కడ.. చుట్టేస్తుంది.. అంటే, సర్వ నాశనం చేస్తుందన్న భయాలైతే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
