Care Of Kancharapalem Review స్వతహాగా సినిమాల మీద కాస్తంత ఎక్కువ ఆసక్తి, మక్కువ, ఇష్టం వున్నా.. ఎందుకో, ‘కేరాఫ్ కంచరపాలెం’ అనే సినిమా మీదకు దృష్టి పెద్దగా మళ్ళలేదు.!
కారణాలు ఏంటి.? అంటే, ప్చ్.. చెప్పలేం.! కొత్త సినిమాలొస్తున్నాయ్.. చూస్తున్నాను.. మధ్యలో అప్పుడప్పుడూ ‘కేరాఫ్ కంచరపాలెం’ చూడమని ‘రికమండేషన్’ కనిపిస్తోంటే, సింపుల్గా లైట్ తీసుకోవడం నాకే ఆశ్చర్యంగా అనిపించేది.
‘సినిమా బావుందన్నారు కదా, ఎందుకు స్కిప్ చేస్తున్నట్లు.?’ అని ప్రశ్నించుకుంటూనే, నెలలు.. సంవత్సరాలు కూడా గడిచిపోయింది.
స్కిప్ చేయడం కష్టమైంది..
అనుకోకుండా ‘కేరాఫ్ కంచపరాలెం’ సినిమా చూడాల్సి వచ్చింది. ఈసారి స్కిప్ చేయాలనిపించలేదు. సినిమా అలా అలా ముందుకు కదులుతోంటే, ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది.
గాఢమైన మూతి ముద్దులు.. మంచం విరిగిపోయేలా ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు.. సుమోలు గాల్లోకి ఎగరాలి.. కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ వుండాలి.. సినిమా అంటే ఇంతేనా.?
సహజమైన నటన.. సహజమైన కథ.. సహజమైన కథనం.. వీటి సంగతేంటి.?
చాలా అరుదుగా వస్తుంటాయ్ కొన్ని సినిమాలు.. అత్యంత సహజంగా.. అందులో పాత్రలన్నీ మన చుట్టూ వున్న మనుషుల్లానే వుంటాయ్.!
మనల్ని మనం ఆయా పాత్రలతో రిలేట్ అవుతాం.
అలాంటి సినిమాలొచ్చినప్పుడు.. ‘ఇదిరా సినిమా అంటే’ అనిపిస్తుంటుంది.
అలాంటిదే ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా కూడా.!
Mudra369
తెరపై పాత్రలు తమ పని తాము చేసుకుపోతున్నాయ్. ఆ పాత్రల మధ్యనే నేనూ వున్నట్లనిపించింది. సరిగ్గా నటించట్లేదా.? జీవించేస్తున్నారా.? అంతే కదా.? ఇలా అనుకుంటూ సినిమా పూర్తి చేసేశాను.
చివర్లో.. ట్విస్ట్ ముందర, ‘చెత్త సినిమా’ అనిపించింది మళ్ళీ.! ‘విచారకరమైన ఎండింగ్స్..’ అన్న భావన కలిగింది. స్కిప్ చేయలేదుగానీ, ‘పాజ్’ చేసేశాను.
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
ఓ చిన్నబ్బాయ్.. అంత చిన్న వయసులో తన క్లాస్మేట్ని ఇష్టపడటమేంటి.? లేటు వయసులో లేచిపోవడమనే కోణమేంటి.? అనే ప్రశ్న మెదడులో ఉత్పన్నమయ్యింది.
ఏం, లేటు వయసులో లిప్ లాక్ సీన్స్ హీరో హీరోయిన్లు చేసెయ్యట్లేదా సినిమాల్లో.? వాటితో ఈ సినిమాని పోల్చడానికి లేదు. అది పైత్యం.. ఇది జీవితం.!

చిన్నప్పటినుంచీ, ప్రేమలో పలుమార్లు విఫలమై.. చివరికి ప్రేమలో గెలిచాడతడు.! అతని జీవితంలోని వివిధ దశలు.. ఇదంతా ఓ జీవితం.
ప్రేమలో మునిగి తేలదామనుకున్న ఓ చిన్నబ్బాయ్కి.. యుక్త వయసులోనూ, నడి వయసులో కూడా ప్రేమ దొరకదు. జీవితం చివరి దశలో మాత్రం తోడు దొరుకుతుంది.
Care Of Kancharapalem Review గట్స్ వుండాలి గురూ..
అదే ‘కేరాఫ్ కంచరపాలెం’. నిజానికి, ఇలాంటి సినిమాలు తీయాలంటే గట్స్ కావాలి.! దర్శకుడ్ని ప్రత్యేకంగా అభినందించాలి. నటీనటులకైతే హేట్సాఫ్.!
ఇంతకాలం సినిమాని స్కిప్ చేసినందుకు ఒకింత బాధ కలిగింది. సినిమా ప్రేమికుడినేనా నేను.? అనిపించింది.!
సినిమాటోగ్రఫీ, డైలాగ్స్, ఎడిటింగ్.. దేనికదే ఒకదానితో ఇంకోటి పోటీ పడిందనడం సబబేమో.! స్క్రీన్ప్లే, నిర్మాణపు విలువలు.. వాట్ నాట్.. అన్నీ బాగా కుదిరాయ్.!
చివరగా.. ప్రేమంటే.. మూతి ముద్దుల్లో మునిగిపోవడం కాదు.. మంచాలు విరగ్గొట్టేయడం అసలే కాదు.! ప్రేమంటే అది ఓ గొప్ప అనుభూతి.! ఆ అనుభూతి ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలో కనిపిస్తుంది.