Lolita Orca Seaquarium Whale.. లోలిత మీకు తెలుసా.. తోకిటా అనే మరో పేరు కూడా వుంది దీనికి.! ఇంతకీ ఎవరీ లోలిత.?
లోలిత అంటే, ఓ తిమింగలం. మామూలుగా అయితే, ఇది అత్యంత భయంకరమైనది.! నడి సంద్రంలో అత్యంత కిరాతకంగా వేటాడుతుంది. అదీ ఆహారం కోసమే లెండి.!
‘రెస్ట్ ఇన్ పీస్ లోలిత’ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎందుకిలా.? అసలేంటి లోలిత కథ.!
1970లో లోలితని పట్టుకున్నారు.. అదీ సముద్రం నుంచి. దాన్ని ఓ భారీ అక్వేరియంలోకి తరలించారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ‘బంధించారు’ అనడం కరెక్ట్.!
ఫ్లోరిడాలోని మియామీ మ్యూజియంలో ఇదొక ప్రధాన ఆకర్షణ. మియామీ సీక్వేరియంలో.. దాదాపు యాభై ఏళ్ళపాటు సందర్శకుల్ని అలరించింది లోలిత.
Lolita Orca Seaquarium Whale.. బందీ అయిపోయిన వేటగత్తె.!
ముందే చెప్పుకున్నాం కదా.. సముద్రంలో ఇది అతి భయంకరమైన వేటగత్తె అని.! కానీ, సీక్వేరియంలో ఇదొక ఆటబొమ్మలా మారిపోయింది. సందర్శకులతో ఆటలాడింది.
సముద్రం నుంచి తీసుకొచ్చిన.. దాదాపు యాభై మూడేళ్ళ తర్వాత.. లోలిత తనువు చాలించింది. దాంతో, అందరూ ‘రెస్ట్ ఇన్ పీస్ లోలిత’ అంటూ స్పందిస్తున్నారు.
జంతు ప్రేమికులేమో, ‘ఐదు దశాబ్దాల తర్వాత లోలితకు విముక్తి లభించింది.. ఈ నర రూప రాక్షసుల నుంచి..’ అంటూ పేర్కొంటుండడం గమనార్హం.
పెంచుకుంటున్నాం.. వాటి మనుగడని ప్రశ్నార్థకం చేస్తున్నాం..
కొందరు కుక్కల్ని పెంచుకుంటారు.. కొందర్ని పిల్లుల్ని పెంచుకుంటారు.! చేపల్ని ఆక్వేరియంలో పెంచడం కూడా చూస్తూనే వున్నాం.
జూ-పార్కుల్లో వన్యమృగాల్ని సంరక్షణ పేరుతో బంధిస్తుండడమూ.. వాటిని అలా అక్కడ మనకి చూపించి, ప్రభుత్వాలు సొమ్ము చేసుకోవడమూ తెలిసిన విషయమే.
Also Read: ఎకరం వెయ్యి కోట్లు! నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ!
లోలిత విషయంలోనూ జరిగింది అదే.! కొలవలేనంత విస్తీర్ణం, లోతు కలిగిన సముద్రంలో స్వేచ్ఛగా తిరగాల్సిన లోలిత, ఓ చిన్న సీక్వేరియంలో.. మగ్గిపోయిందంటే బాధాకరమైన విషయమే.
అన్నట్టు, టిలికుమ్ అనే మరో తిమింగలం పరిస్థితీ ఇంతే.! దాదాపు ముప్ఫయ్యేళ్ళపాటు సీక్వేరియంలో జైలు జీవితం గడిపిన తర్వాత.. ప్రాణాలు విడిచిందది.!
నిజమే, లోలితకి విముక్తి లభించింది.! ఈ భూమ్మీద మనిషి మాత్రమే, ఇంకో జీవి మనుగడకి శాపంగా మారుతున్నాడు.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం.! నిష్టురసత్యం.!