Home » జనసేన కవాతు: పోటెత్తుతున్న జన గోదారి

జనసేన కవాతు: పోటెత్తుతున్న జన గోదారి

by hellomudra
0 comments

గోదారి ఉప్పొంగుతోంది. జనసేన పార్టీ ‘కవాతు’కి పిలుపునిచ్చిన దరిమిలా ఉభయ గోదావరి జిల్లాలు ఒక్కటవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్ని కలిపే కాటన్‌ బ్యారేజీని ఆనుకుని వున్న బ్రిడ్జిపై ఉదయం నుంచే జనసేన పార్టీ కార్యకర్తల హంగామా మొదలైంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ కవాతు సుమారు రెండున్నర గంటలపాటు పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరి వైపుకు కొనసాగనుంది. ఇందుకోసం ఇప్పటికే జనసేన పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. ఉభయగోదావరి జిల్లాలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కి వున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల నుంచీ పెద్దయెత్తున జనసేన పార్టీ కార్యకర్తలు, ‘కవాతు’లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.

ఆ గట్టు నుంచి ఈ గట్టుకి..

రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనంతో కూడిన మార్పు కోసమే ఆవిర్భవించామని చెబుతున్న జనసేన పార్టీ, ఈ ‘కవాతు’ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ‘సందేశం’ పంపుతామని అంటోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్రాన్ని కడిగి పారేయడమే కాదు, గత నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలోని లోటుపాట్లని ఇప్పటికే పలు వేదికల ద్వారా కడిగి పారేస్తున్న జనసేన పార్టీ, ఈ వేదిక ద్వారా మరింత గట్టిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రశ్నించబోతోంది. స్వచ్ఛమైన రాజకీయాలు చేయడమే లక్ష్యంగా, జనం ముందుకు వచ్చిన జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వైనాన్ని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపేందుకు ఈ ‘కవాతు’ని వేదిక చేసుకుంది జనసేన పార్టీ.

జనసైన్యం గొంతుకగా మారిన ‘పాట’

జనసేన కవాతు కోసం రెండు పాటలు రూపొందాయి. వాటిల్లో ఒకటి కవాతు చేయి.. అంటూ అనంత్ శ్రీరామ్ రాసిన పాట కాగా, మరొకటి ‘పద పద’ అంటూ సాగే పాట. ‘పద పద పద..’ అంటూ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన పాటకు, అత్యద్భుతమైన ట్యూన్‌ ఇచ్చాడు ప్రముఖ యువ సంగీత దర్శకుడు తమన్‌. ఈ ఇద్దరికీ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడీ పాట సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. ‘పద పద పద..’ అంటూ, జనసైనికులు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచే కాక, తెలంగాణ నుంచీ ఉభయగోదావరి జిల్లాల వైపుకు పయనమయ్యారు. ఇది, బలప్రదర్శన కానే కాదనీ.. ఈ ‘కవాతు’ ద్వారా ప్రజల ఆకాంక్షల్నీ, ఆలోచనల్నీ, జనసేన సత్తానీ చాటి చెప్పబోతున్నామని జనసేన అంటోంది.

డబ్బు కాదు.. అభిమానమే పోటెత్తుతోంది

సాధారణంగా రాజకీయ పార్టీలు బహిరంగ సభలు నిర్వహించినా, జనసమీకరణ చేపట్టినా.. అందులో డబ్బు, మద్యం కీలక భూమిక పోషిస్తాయి. కానీ, జనసేన లెక్క వేరు. ‘మేం జన సైనికులం..’ అంటూ స్వచ్ఛందంగా యువత, పవన్‌ వెంట నడిచేందుకు సిద్ధమయ్యింది. మహిళలు, వృద్ధులు సైతం ‘కవాతు’లో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. వికలాంగులు కూడా ‘మేము సైతం’ అంటూ, ‘కవాతు’లో పాల్గొనేందుకు ముందుకు రావడం అభినందనీయం. భద్రత విషయంలోనూ జనసేన గట్టి చర్యలు చేపట్టింది. వేలాది మంది కార్యకర్తలే వాలంటీర్లుగా మారి, బ్రిడ్జిపై ఇరువైపులా రక్షణ కవచమై కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమాయత్తమయ్యారు.

జనసంద్రం కాబోతోన్న గోదావరి వంతెన

కింద పరవళ్ళు తొక్కే గోదారి.. ఆ పైన, జనసంద్రం.. ఇదీ పశ్చిమగోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాని కలిపే ధవళేశ్వరం బ్రిడ్జిపై కన్పించనున్న పరిస్థితి. ఇప్పటికే, జనసైనికుల సందడితో లంక గ్రామాలు కోలాహలంగా మారాయి. లంకగ్రామాల్లోని ప్రజలు జనసేనానికి ఘనస్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లూ చేసుకున్నారు. మధ్యాహ్నం కవాతు ప్రారంభం కానుండగా, ఉదయం నుంచే సందడి నెలకొనడం పట్ల జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కవాతు అనంతరం బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్‌తోపాటు, జనసేన పార్టీలో ఇటీవల చేరిన మాజీ అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సైతం ప్రసంగించబోతున్నారు.

గోదావరి జిల్లాల్లో రాజకీయ ప్రభంజనమే

ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ ప్రభంజనమే లక్ష్యంగా జనసేన పార్టీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. అందులో ‘కవాతు’ అతి ముఖ్యమైనదిగా జనసేన నేతలు అభివర్ణిస్తున్నారు. జనాన్ని పోగేసి, మభ్యపెట్టి తాము రాజకీయాలు చేయబోమనీ, జనంలో చైతన్యం తీసుకొచ్చి, జవాబుదారీతనంతో వుంటామనే భరోసా ఇచ్చి, జనసేన – జనం తరఫున నిలబడుతుందనే నమ్మకం కలిగించడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నామని, రాజకీయాలకు ఇప్పుడున్న అర్థాన్ని మార్చేసి, రాజకీయాల పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులయ్యే పరిస్థితులు తీసుకొస్తామని జనసేన నేతలు కుండబద్దలుగొడుతున్నారు.

ఏదిఏమైనా, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జనసేన ‘గోదారి కవాతు’ ఓ చరిత్ర సృష్టించబోతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group